అందాల ఆరబోత, ఆపై బుకింగ్…! ఖమ్మంలో హైటెక్ వ్యభిచార దందా, అంతా ‘వాట్సాప్’ నుంచే…!

Best Web Hosting Provider In India 2024


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసింది. ఖండాంతరాల ఆవతల జరిగిన ఉదంతాలనూ క్షణాల్లో వీక్షించగలిగే నైపుణ్యం ఇప్పుడు అందరికీ అందివచ్చింది. అయితే ఇది కొత్త పుంతలు తొక్కుతున్న అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నప్పటికీ ఇదే సాంకేతికతను అందిపుచ్చుకుని కొందరు వెర్రి తలలు వేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.

రెండు దశాబ్దాల కిందట అవతలి వ్యక్తి పలుకులను వినిపించే ఫోన్ ఓ అద్భుతం. ఇప్పుడు అదే ఫోన్ ఎన్నో మహాద్భుతాలకు వేదికవుతోంది. ఫొటో క్లిక్ మనిపించి సుదూర ప్రాంతాలకు సైతం పోస్ట్ చేయగలిగే పరిజ్ఞానం వాట్సాప్. అయితే ఇదే వాట్సాప్ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిపోయింది. ఖమ్మం నగరంలో చాటుమాటు రాసలీలలకు ఇది సులువైన… హైటెక్ మార్గమైంది.

వాట్సాప్ వేదికగా బుకింగ్ లు..

నిశబ్ద విప్లవానికి ఓ ప్రతీక వాట్సాప్. మంచైనా, చెడైనా దేనినైనా ఇట్టే చేరవేయగల ఓ సమాచార వేదిక అది. ఫొటోలను చిటెకెలో చేరవేయగల ఓ సూపర్ ఫాస్ట్ సాధనం. కాగా ఇది ఖమ్మంలో హైటెక్ రాసలీలల యంత్రంలా మారిపోయింది. అవును.. ఇది నిజం! నానాటికీ విస్తరిస్తున్న ఖమ్మం నగరంలో చాటు మాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.

నగరంలోని కొన్ని నివాస గృహాల్లో ఎప్పటి నుంచో రాసలీలలు సాగుతున్నాయన్నది అంగీకరించాల్సిన విషయమే…! అయితే ఇప్పటి వరకూ ఇది నేరుగా బేరసారాలతోనే సాగిపోయింది. ఇప్పుడు సీన్ మారింది. శ్రమ తగ్గింది. ఈ కార్యకలాపాలు కూడా సులువైన హైటెక్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇదే వృత్తిగా వ్యాపార లావాదేవీలు సాగించే కొందరు వ్యక్తులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన వాట్సాప్ ను వేదిక చేసుకున్నారు.

పదుల సంఖ్యలో గ్రూపులు…!

విటులను ఆకర్షించి వల వేసేందుకు వాట్సాప్ గ్రూపులు కదం తొక్కుతున్నాయి. కొందరు నిర్వాహకులు పాత కస్టమర్లను ఆసరాగా చేసుకుని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మూడు బేరాలు, ఆరుగురు విటులు అన్న చందంగా విస్తరిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఇలా పదుల సంఖ్యలో వాట్సావ్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు సమాచారం. 

ఎవరైనా ఒక్కసారి గ్రూప్ లోకి వచ్చి చేరితే ఇక రోజూ అందమైన అమ్మాయిల ఫొటోలు వారి సెల్ ఫోన్లలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. ఆకర్షితులైతే వాట్సాప్ లో చాట్ చేస్తే సరి. అమ్మాయి ఫొటోను ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత నిర్వాహకులు బేరసారాల్లోకి దించేస్తారు. అంతా సవ్యంగా సాగి బేరం కుదిరితే ప్లేస్ ఎవరు చెప్పినా ఓకే. ఇందుకోసం కొన్ని ప్రత్యేక గృహాలు సైతం ఏర్పాటై ఉండటం గమనార్హం. ఖమ్మంలోని సారధీనగర్, మామిళ్లగూడెం, ముస్తఫానగర్, కవిరాజ్నగర్ ప్రాంతాల్లో ఉండే కేంద్రాల్లోకి విటులను ఆహ్వానిస్తారు. ఒక వేళ అక్కడికి వెళ్లడానికి వారు ఇష్టపడకపోతే వారు కోరిన చోటికే అమ్మాయిలను పంపిస్తారు. ఆ తర్వాత ముందుగా వాట్సాప్లో కుదుర్చుకున్న బేరం మేరకు సొమ్ములు చెల్లించి వెనుదిరగాల్సి ఉంటుందన్న మాట.

గుట్టుచప్పుడు కాకుండా….

ఖమ్మం నగరంలో చాటు మాటు రాసలీలలు సాగిస్తూ విటులు, మహిళలు పట్టుబడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం అందుకునే పోలీసులు లాడ్జీలు, ఇతర నివాస ప్రాంతాల్లో సాగుతున్న రాసలీలలపై వల విసిరి పట్టుకునే వారు. 

ఇప్పుడు ఖమ్మం నగరంలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే చాటు మాటు రాసలీలలు సాగడం లేదని కాదు అర్ధం. మరింత చాటు మాటుగా సాగిపోతున్నాయి. వాట్సాప్ వేదికగా సాగిపోయే రాసలీలలను గుర్తించడం అంత సులువైన పనేం కాదు. పక్కనే ఉన్న వ్యక్తికి కూడా తెలియకుండా ఫోన్లో సాగించే ఈ కార్యకలాపాన్ని పసి గట్టడం ఖాకీలకు కూడా కత్తిమీద సాములాంటిదే. 

సాంకేతికతను ఆసరాగా చేసుకుని యదేశ్చగా సాగిపోతున్న చాటు మాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టే లేకుండాపోతోంది. ఖమ్మం నగర నలు దిక్కుల్లో విస్తరించిన నిర్వాహకులు ఎంచక్కా కస్టమర్ల సంఖ్యను నానాటికీ పెంచుకుంటూ చైన్ బిజినెస్ కు నాందీ పలుకుతున్నారు. ఆసక్తి చూపే విటులు సైతం వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. 

రేపటి పౌరులుగా దేశ భవితను తీర్చి దిద్దాల్సిన యువత తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వలపు వలలో చిక్కుకుని బంగారు భవితను బుగ్గిపాలు చేసుకుంటే రేపటి తరానికి మార్గదర్శకులు కరువవుతారు. బీ కేర్ ఫుల్ సుమీ.!

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

WhatsApp channel

టాపిక్

Telangana NewsKhammamKhammam Assembly ConstituencyKhammam Lok Sabha Constituency
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024