Best Web Hosting Provider In India 2024
Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల. తాజాగా ఇప్పుడామె కమిటీ కుర్రాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తాజాగా ఆమె చైతన్యతో విడాకులు, మళ్లీ ప్రేమ, పెళ్లిలాంటి అంశాలపై స్పందించింది.
అదంతా ఇప్పుడు గతం
ఈ మధ్యే గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన వ్యక్తిగత జీవితంపై స్పందించడం విశేషం. విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం మరింత మెరుగ్గా ఉందా అని అడిగినప్పుడు.. “ఇప్పుడదంతా గతం. ప్రస్తుతానికి నేను నా పనిపైనా దృష్టి సారించాను. నటనతోపాటు మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను” అని నిహారిక చెప్పింది.
మళ్లీ ప్రేమ, పెళ్లి గురించి చూస్తున్నారా అని అడిగినప్పుడు కూడా నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. “నేను కేవలం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. అది సింగిల్ గా అయినా లేక ఎవరితో కమిట్ అయినా కూడా. నేను దానికి విరుద్ధంగా వెళ్లను.. అదే సమయంలో దానిని వెతుక్కుంటూ కూడా వెళ్లను. టైమ్ వచ్చినప్పుడు జరిగేది ఉంటే అదే జరుగుతుంది. మా పేరెంట్స్ కూడా నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు. నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలని వాళ్లు భావిస్తున్నా.. నాపై ఒత్తిడి మాత్రం పెట్టరు” అని నిహారిక చెప్పింది.
చాలా బాధ కలిగించింది
నిహారిక విడాకులపై గతంలోనూ ఓసారి స్పందించింది. అది తనను ఎంత బాధపెట్టిందో వివరించింది. నిఖిల్ విజయేంద్ర సింహా పాడ్కాస్ట్ లో ఆమె దీనిపై స్పందించింది. “నేను నాపైనే దృష్టి సారించే దశలో ఉన్నాను. నా పేరెంట్స్ కు కూడా సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నాను. ఎవరో తప్పుడు వ్యక్తిపై ఆధారపడలేము. నేను విడాకులు తీసుకొని రెండేళ్లవుతోంది. అది ఎంత బాధ పెడుతుందో నాకు మాత్రమే తెలుసు” అని నిహారిక చెప్పింది.
విడాకుల తర్వాత ఎంతో ఏడ్చాననీ తెలిపింది. “జీవితాంతం కలిసి ఉండాలనే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. నా వయసు 30 ఏళ్లు. నేనింకా ప్రేమకు తలుపులు మూసేయలేదు. అయితే ఓ రిలేషన్షిప్ లోకి వెళ్ల ముందు నేను స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నాను. ఇప్పటికైతే నేను సింగిలే” అని అప్పట్లో నిహారిక చెప్పింది.
విడాకుల తర్వాత నిహారిక నటనతోపాటు సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మాణంలోనూ బిజీగా ఉంటోంది. గతేడాది డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్ లో నటించింది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్లనే సినిమాను నిర్మించింది. వాట్ ద ఫిష్ అనే మూవీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ఈ సినిమాలో ఆమె అష్టలక్ష్మి అనే పాత్ర పోషిస్తోంది. మరో తమిళ సినిమా కూడా నిహారిక చేయబోతోంది.