Best Web Hosting Provider In India 2024
భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా భారీ హైప్ మధ్య థియేటర్లలో అడుగుపెట్టింది. కల్ట్ క్లాసిక్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్‍గా 28 సంవత్సరాల తర్వాత వచ్చింది. అయితే, దర్శకుడు శంకర్ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు. ఉలగనాయగన్, తమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన భారతీయుడు 2 తీవ్రంగా నిరాశపరిచింది. జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నెగెటివ్ టాక్‍తో చతికిలపడింది. ఇప్పుడు, భారతీయుడు 2 ఓటీటీ విషయంలోనూ సందిగ్ధత నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సగమే ఇస్తామంటూ!
భారతీయుడు 2 సినిమాకు చాలా హైప్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సుమారు రూ.120 కోట్ల భారీ రేటుకు దక్కించుకునేలా డీల్ చేసుకుందని అప్పట్లో సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ ఎక్కువగా రావడంతో ఇప్పుడు ఇంత మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు రావడం లేదని టాక్. డీల్ చేసుకున్న దాంట్లో సగం మాత్రమే ఇస్తామని ఈ మూవీని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌తో నెట్‍ఫ్లిక్స్ మళ్లీ చర్చలు చేస్తోందని రిపోర్టులు బయటికి వచ్చాయి.
ఆలస్యంగానే..
భారతీయుడు 2 సినిమా స్ట్రీమింగ్ హక్కులకు నెట్‍ఫ్లిక్స్ పూర్తి మొత్తం చెల్లించేందుకు నిరాకరించి.. మళ్లీ చర్చలు చేస్తుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు తొలి వారంలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్‍కు వస్తుందనగా ఈ ట్విస్ట్ ఎదురైంది. స్ట్రీమింగ్ హక్కుల విషయంలో మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ బేరాలు షురూ చేసింది. మరి, ఇవి ఎప్పుడు ఫిక్స్ అయి.. భారతీయుడు 2 ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందో చూడాలి.
భారతీయుడు 2 సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం, స్ట్రీమింగ్ హక్కుల విషయంలోనూ సందిగ్ధత నెలకొనడం తదుపరి చిత్రంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయుడు 3 షూటింగ్ కూడా అయిపోయిందని మూవీ టీమ్ ఇప్పటికే చెప్పింది. ట్రైలర్ కూడా భారతీయుడు 2కు అటాచ్ చేసింది.
కలెక్షన్లు ఇలా..
భారతీయుడు 2 సినిమా సుమారు రూ.250కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొత్తంగా సుమారు రూ.140కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మించారు.
భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్ విభిన్న గెటప్‍ల్లో కనిపించారు. యాక్టింగ్ మెప్పించినా.. గెటప్‍లను డైరెక్టర్ శంకర్ సరిగా డిజైన్ చేయలేదనే కామెంట్లు వినిపించాయి. ఈ మూవీలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, ప్రియాంక భవానీ శంకర్, బాబీ సింహా, వివేక్, సముద్రఖని, నడుమూరి రవి కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిశంకర్ సంగీతం అందించారు. కొనసాగింపుగా భారతీయుడు 3 మూవీని కూడా మేకర్స్ ప్రకటింటారు. అయితే, నెగెటివ్ టాక్ రావటంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది కాస్త ఆలస్యంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి.
టాపిక్