Best Web Hosting Provider In India 2024
Egg Ghee Roast: ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు తింటే పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ఉడకబెట్టిన కోడిగుడ్లతో అనేక రకాల రెసిపీలను వండుకోవచ్చు. అందులో ఒక టేస్టీ రెసిపీ ‘ఎగ్ ఘీ రోస్ట్’. కోడిగుడ్లలో నెయ్యి మసాలా దినుసులు వేసి చేసే ఈ వంటకం ఘుమఘుమలాడిపోతుంది. ఒక్కసారి వండారంటే మళ్ళీ మళ్ళీ మీకే తినాలనిపిస్తుంది. ముఖ్యంగా అతిథులు వచ్చినప్పుడు ఇలాంటి కూర వండి చూడండి. మీకు నచ్చడం ఖాయం. కోడిగుడ్లతో చేసిన ఈ వంటకానికి అభిమాని అయిపోతారు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గుడ్లు – నాలుగు
నెయ్యి – ఐదు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూన్
ధనియాలు – ఒక స్పూన్
జీలకర్ర – ఒక స్పూను
మిరియాలు – అర స్పూను
లవంగాలు – ఆరు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
ఎండుమిర్చి – పది
టమాటాలు – 2
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ
1. ఈ రెసిపీని వండేందుకు ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
3. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
5. నెయ్యి వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి.
6. అవి రంగు మారేవరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని వేయాలి.
7. అలాగే కరివేపాకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇది ఇగురులాగా అయ్యాక ముందుగా పొడిచేసి పెట్టుకున్న మసాలాలు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇదంతా చిన్న మంట మీద వండాలి. లేకుంటే త్వరగా అడుగంటి పోతుంది.
10. ఇప్పుడు పావు కప్పు నీళ్లను వేసి ఇగురులాగా ఉడికించుకోవాలి.
11. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను అందులో వేసి కలుపుకోవాలి.
12. ఒక పావు గంటసేపు చిన్న మంట మీద ఉంచాలి. అంతే రుచికరమైన టేస్టీ ఎగ్ ఘీ రోస్ట్ రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంలో తిన్నా, చపాతీతో తిన్న రుచిగా ఉంటుంది.
13. ఇది వండుతున్నప్పుడే ఇది ఘుమఘుమలాడిపోతుంది. ఇందులో నూనెకు బదులు నెయ్యి వేసాము, కాబట్టి నెయ్యి సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది.
ఎగ్ ఘీ రోస్ట్ రెసిపీ పిల్లలకు ఎంతో నచ్చుతుంది. వారికి ఒకసారి ఇది పెట్టి చూడండి. ఇందులో కారం ఎక్కువగా వేయలేదు. కాబట్టి పిల్లలకు ఇది నచ్చుతుంది. ముఖ్యంగా దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎవరు మర్చిపోలేరు. పైగా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఈ కూరను వండుకోవచ్చు.