Best Web Hosting Provider In India 2024
Flour Adulteration: మార్కెట్లో స్వచ్ఛమైన ఆహారం దొరకడమే కష్టంగా మారింది. మానవ ఆరోగ్యానికి హాని కలిగించేలా ప్రమాదకరమైన రసాయనాలను పదార్థాల్లో కలిపి అమ్ముతున్నారు. ఇప్పటికే ఎన్నో మసాలా బ్రాండ్లలో కల్తీ జరుగుతోందని ఎన్నో అధ్యయనాలు బయటపెట్టాయి. ఆ మసాలాలలో ఆరోగ్యానికి హాని చేసే క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు తాజా నివేదిక ప్రకారం మార్కెట్లో దొరికే గోధుమపిండి, మైదా పిండిలో కూడా ఒక రకమైన రాతిపొడిని కలిపి అమ్ముతున్నట్టు బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ లోని ఒక పిండి మిల్లు పై ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. అక్కడ 400 కిలోల రాయిపొడిని గుర్తించారు. దాన్ని పిండిలో కలుపుతున్నట్టు కనుగొన్నారు.
ఏ రాయితో చేసిన పొడి?
అలబ్లాస్టర్ అనే ఒక రాయి చాలా మృదువుగా ఉంటుంది. దీన్ని చెక్కితే తెల్లటి పొడి లాగా వస్తుంది.దీన్ని కాస్త ప్రాసెస్ చేయడం ద్వారా మరింత మెత్తగా మార్చొచ్చు. ఈ అలబ్లాస్టర్ రాతిలో రెండు రకాలు ఉన్నాయి. అవి జిప్సం అలభాస్టర్, కాల్సైట్ అలబాస్టర్. ఈ రాయిలను సాధారణంగా శిల్పకళకు, అలంకార వస్తువులు తయారు చేయడానికి వాడతారు. ఇది మానవ వినియోగానికి తగినది కాదు. ఇది కళాత్మక వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించే రాయి. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అయితే మైదా, గోధుమ పిండిలో ఈ అలబాస్టర్ రాతిపొడిని కలపడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో రోగాల బారిన పడతాము.
అలబాస్టర్ రాతిపొడి విషపూరితము కాదు. కానీ ఇది హానికరమైన మలినాలను, సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఆ పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. అలబాస్టర్ రాతిపొడి తీసుకోవడం వల్ల జీర్ణాశయంతర సమస్యలు వస్తాయి. పేగుల్లో చికాకు వస్తుంది. వికారం, వాంతులు, పొట్ట నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎన్నో శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అలబ్లాస్టర్ రాతి పొడి సూక్ష్మ రేణువులుగా ఉంటుంది. ఆ సూక్ష్మ రేణువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస సమస్యలకు కారణం అవుతుంది. ఏమైనా ఈ రాతిపొడి ఆహారం కాదు, కాబట్టి ఈ రాతి పొడి కలిపిన పిండిని తరచూ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువ.
టాపిక్