AP Ration Shops : వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ- మంత్రి నాదెండ్ల మనోహర్

Best Web Hosting Provider In India 2024

AP Ration Shops : పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాల (ఎండీయూ)పై కీలక చర్చ జరిగింది. ఎండీయూ వాహానాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీంతో ఎండీయూలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎండీయూ వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్న దానిపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని మంత్రి అన్నారు. వీధి చివర వాహనం పెట్టి మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ.1,844 కోట్లతో 9260 వాహనాలు గత ప్రభుత్వం కొనుగోలు చేసిందని అధికారులు వెల్లడించారు.

 

సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.41 వేల కోట్లు

రేషన్ బియ్యం తరలింపు వాహనాలను కూడా బియ్యం స్మగ్లింగ్ కు వాడుకున్నారన్న అంశంపై సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం పెడదామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులకు నిర్ణయం తీసుకుంటామన్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని మంత్రులతో పాటు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు రూ.21,622 కోట్లు కాగా.. ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను రూ. 41550 కోట్లకు తీసుకువెళ్లారని సీఎం చంద్రబాబు అన్నారు. రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు.

రేషన్ షాపుల్లో ఎక్కువ సరుకులు

వైసీపీ హయాంలో బియ్యంతోపాటు చక్కెర, అప్పుడప్పుడూ కందిపప్పు మాత్రమే ఇచ్చేవారని అధికారులు గుర్తించారు. ఎండీయూ వాహనాలను వీధి చివరకు నిలిపి అక్కడికి వచ్చి సరుకులు తీసుకెళ్లాలని సూచించేవారన్నారు. ఈ పథకం వల్ల ప్రజాధనం వృధా తప్ప ఇంటింటికీ బియ్యం అందజేయడం లేదని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ హయాంలో గతంలో ఇచ్చిన విధంగా రేషన్ దుకాణాల్లో సరుకులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు.

 

రేషన్ దుకాణాల్లో వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తక్కువ ధరకే కందిపప్పు అందిస్తామన్నారు. వైసీపీ హయాంలో రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం దారి మళ్లించడంలో బడా బాబులు పాత్ర ఉందన్నారు. పేదలకు అందించాల్సిన రేషన్‌ సరుకుల్లో అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఉచిత ఇసుక విధానంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారని అన్నారు. జనసేన నాయకులు ఎవరూ కూడా ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. రేషన్ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకే కందిపప్పు అందిస్తామని తెలిపారు.

WhatsApp channel
 

టాపిక్

 
Ration CardsAndhra Pradesh NewsNadendla ManoharChandrababu NaiduTelugu News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024