Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక బోణీ.. మెడల్‍తో చరిత్ర సృష్టించిన షూటర్ భాకర్

Best Web Hosting Provider In India 2024


ప్రతిష్టాత్మక క్రీడాసమరం పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతక బోణీ చేసింది. పతకాల ఖాతా తెరిచింది. ఈ పారిస్ క్రీడాపోటీల రెండో రోజైన నేడు (జూలై 28) భారత్‍కు తొలి మెడల్ దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‍లో భారత షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో షూటింగ్‍ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భాకర్ చరిత్ర సృష్టించారు. ఫైనల్‍లో 221.7 పాయింట్లు సాధించిన 22ఏళ్ల మనూ భాకర్ మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. పారిస్ గడ్డపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

ఒలింపిక్స్‌లో షూటింగ్‍లో 12 ఏళ్ల తర్వాత భారత్‍కు పతకం వచ్చింది. చివరగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో వినయ్ కుమార్ రజతం గెలువగా.. గగన్ నారంగ్ కాంస్యం దక్కించుకున్నారు. పన్నెండేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఇండియాకు షూటింగ్‍లో పతకం దక్కింది. మహిళల విభాగంలో మాత్రం వ్యక్తిగతంగా పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా భాకర్ ఘనత దక్కించుకున్నారు.

టోక్యోలో కన్నీరు.. ఇప్పుడు చరిత్ర

2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మనూ భాకర్ అనూహ్య రీతిలో వైదొలిగారు. పిస్టల్ మాల్‍ఫంక్షన్ వల్ల వల్ల క్వాలిఫికేషన్ రౌండ్‍లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో మనూ కన్నీరు పెట్టుకున్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు పారిస్‍లో కాంస్య పతకం సాధించి చరిత్ర లిఖించారు. క్వాలిఫికేషన్ రౌండ్‍లో 580 పాయింట్లు సాధించి ఫైనల్ చేరారు మనూ. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా షూటర్‌గా నిలిచారు. ఫైనల్‍లో మూడో ప్లేస్‍లో నిలిచి కాంస్యం కైవసం చేసుకున్నారు.

మహిళల 10 మీటర్ల పిస్టల్ విభాగం ఫైనల్‍లో సౌత్ కొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. అదే దేశానికి చెందిన వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలిచారు. ఇద్దరి మధ్య తేడా కేవలం 0.1 పాయింట్ మాత్రమే. 221.7 పాయింట్లతో మనూ భాకర్ కాంస్య పతకం దక్కించుకున్నారు.

ఫైనల్ చేరిన మరో ఇద్దరు షూటర్లు

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ కూడా ఫైనల్‍కు అర్హత సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం క్వాలిఫికేషన్లలో రమితా అదరగొట్టారు. క్వాలిఫికేషన్ రౌండ్‍లో 631.5 పాయింట్లు సాధించి ఫైనల్‍లో అడుగుపెట్టారు. రమితాపై కూడా పతక ఆశలు భారీగా ఉన్నాయి.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ అర్జున్ బబుతా కూడా ఫైనల్ చేరారు. నేటి క్వాలిఫికేషన్ రౌండ్‍లో 630.1 పాయింట్లలో ఏడో ప్లేస్‍లో నిలిచారు. ఫైనల్‍కు అర్హత సాధించారు. అయితే, 12వ ప్లేస్‍కు నిలిచిన భారత షూటర్ సందీప్ సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్క్రమించారు.

రాణించిన తెలుగమ్మాయి శ్రీజ

భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ పారిస్ ఒలింపిక్స్ 2024లో అదిరే ఆరంభం చేశారు. నేడు జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‍లో శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్‍కు చెందిన క్రిస్టినా కాల్‍బర్గ్‌పై అలవోకగా గెలిచారు. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో 32 రౌండ్ ఈవెంట్‍కు శ్రీజ క్వాలిఫై అయ్యారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024



Source link