Best Web Hosting Provider In India 2024
భారతదేశంలోని చేనేత కార్మికుల గొప్పతన్నాన్ని గుర్తుచేస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే. దేశంలోని గొప్ప చేనేత పరిశ్రమ గురించి తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ చేనేత కళ వారసత్వం శతాబ్దాల నాటిది. మన దేశ మాండలికాలు, వంటకాల లాగే ఈ కళ కూడా వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గొప్ప చేనేత వారసత్వం ఉంది.
చేనేత అంటే గుర్తొచ్చేది సాంప్రదాయ చీరలే. చీరలకు దక్షిణాసియా సంస్కృతిలో అసాధారణమైన ప్రాముఖ్యత ఉంది. వీటి మన్నిక కారణంగా చీరలకు విపరీతమైన ఆదరణ లభించింది.
బంజారా కాసుటి వ్యవస్థాపకురాలు ఆశా పాటిల్ భారతదేశ శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే కొన్ని అద్భుతమైన చేనేత చీరలను హెచ్ టి లైఫ్ స్టైల్ తో పంచుకున్నారు.
మైసూర్ సిల్క్ చీర:
మైసూర్ పట్టుచీరకు తిరుగులేని ప్రతిష్ఠాత్మక హోదా ఉంది. మొదట్లో రాజ వంశీయులకే పరిమితమై క్రమంగా ఉన్నత వర్గాలకు విస్తరించిన ఈ చీర ఇప్పుడు అందరి చెంతకూ చేరింది. మార్కెట్లో వివిధ చీరల రకాలు వచ్చినప్పటికీ, మైసూర్ పట్టు చీర యొక్క ప్రజాదరణ, ఆకర్షణ తగ్గలేదు. దాని అసాధారణ హస్తకళా నైపుణ్యం, స్వచ్ఛమైన బంగారు- వెండి దారాలను ఉపయోగించడం వల్ల వస్త్రం అందం పెరగడమే కాకుండా, ఎక్కువ కాలం మన్నుతుంది.
మైసూర్ పట్టుచీరల అందాన్ని తరచుగా కాసుతి ఎంబ్రాయిడరీ, క్లిష్టంగా అల్లిన చీర కొంగు డిజైన్లు, వినూత్న రంగుల కలయికల ద్వారా ఈ చీరలు మరింత అందంగా కనిపిస్తాయి. అసలైన బంగారు వెండి పోగులు వాడటం వల్ల వచ్చే మెరుపే చీర నాణ్యతను తెలియజేస్తుంది.
బేగంపురి చీర:
పశ్చిమ బెంగాల్లో చిన్న పట్టణమైన బేగంపూర్ నుండి ఈ బేగంపురి కాటన్ చీరలు తయారవుతాయి. పూర్తిగా పత్తి నుండి తయారు చేస్తారు. మంచి చీర అంచుల డిజైన్లు, రంగుల కాంబినేషన్లతో ఈ చీరలు అందంగా ఉంటాయి. సాధారణంగా రేఖాగణిత నమూనాల డిజైన్లు కలిగి ఉంటాయి. ఈశాన్య భారత రాష్ట్రాల సౌందర్యం నుండి ప్రేరణ పొందుతాయి. మన్నికకు ప్రసిద్ధి చెందిన బేగంపురి చీరలు రోజువారీ దుస్తులు అని చెప్పొచ్చు. ఆఫీసుకు వేసుకోడానికి మంచి లుక్ ఇస్తాయి.
కంచిపట్టు చీర:
తమిళనాడుకు చెందిన కాంజీవరం చీరలు లేదా కంచిపట్లు చీరలు నిపుణులైన హస్తకళా కార్మికుల నైపుణ్యం, ప్రతిభావంతులైన చేతివృత్తుల సునిశిత కృషిని ప్రతిబింబిస్తాయి. ఈ లగ్జరీ దుస్తులను అధిక-నాణ్యత స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ ఉపయోగించి రూపొందిస్తారు. ఇది మెరిసే చీరలకు ప్రసిద్ధి చెందింది. సంక్లిష్టమైన డిజైన్లు, ఆకృతులు క్లిష్టంగా నేరుగా అల్లతారు. ఇది ప్రామాణిక వెండి లేదా బంగారు జరీ దారాలను ఉపయోగించి తయారు చేస్తారు.
చందేరి చీర:
మధ్యప్రదేశ్ నుండి వచ్చిన చందేరీ చీరలు భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వానికి ఉదాహరణగా నిలుస్తాయి. అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని మరియు సున్నితమైన ఆకర్షణను ప్రదర్శిస్తాయి. ఈ చీరలు చేతితో నేసిన డిజైన్లు, మెరిసే వస్త్రం, సంక్లిష్టమైన ఆకృతులతో ఆకర్షిస్తాయి. ఇవన్నీ నైపుణ్యం కలిగిన కళాకారులు సునిశితంగా రూపొందిస్తారు.మొఘల్ కాలం నుండి నేటి వరకు కాటన్ చందేరీ చీరలు తమ విలక్షణ స్వభావాన్ని నిలుపుకుంటూ మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా మారాయి.
కలంకారీ చీరలు:
కలంకారీ చీరలు సాంప్రదాయ కళానైపుణ్యం, కళాత్మక డిజైన్లకు ప్రసిద్ధి చెందాయి. కలంకారీ చీరల మీద ఎక్కువగా పూలు, చెట్లు, జంతువుల, పక్షుల డిజైన్లుంటాయి. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన డిజైన్లుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు విభిన్న శైలుల్లో (మచిలీపట్నం, శ్రీకాళహస్తి) కలంకారీ చీరలు తయారు చేస్తారు.మంచి రంగులు, వైవిధ్యమైన థీమ్ ఎంపికలు, ఖచ్చితమైన డిజైన్లు, డీటెయిలింగ్ వీటికి ప్రత్యేకత తెస్తాయి.
బనారసి సిల్క్స్:
లగ్జరీకి, అసమాన కళానైపుణ్యానికి ప్రతీక అయిన బనారసి వారసత్వ సంపద ఈ బనారసీ చీరలు. బనారస్ అని కూడా పిలువబడే వారణాసి ఈ చీరలకు ప్రసిద్ధి. మొఘల్, పర్షియన్, హిందూ , ఇతర ఆసియా ప్రాంత జీవన విధానాల్ని ప్రతిబింబించే బనారస్ యొక్క డిజైన్ అందంగా వైవిధ్యంగా ఉంటుంది. సమకాలీన బనారసి చీర బహుళ సాంస్కృతిక వారసత్వ సంపద.
చికన్‌కారీ చీరలు:
లక్నోలోని చికన్‌కారీ చీరల అందం గురించి అందరికీ తెలుసు. షిఫాన్స్, జార్జెట్స్ వంటి వస్త్రాలపై ఎంబోస్ లాంటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి వీటిని తయారు చేస్తారు. చికన్‌కారీ చీరలతో పాటే దీంతో చేసిన కుర్తాలకూ అంతే ప్రాముఖ్యత ఉంది. చెప్పాలంటే అదొక ట్రెండ్.
ఇక్కత్ సిల్క్స్:
పురాతన ఇక్కత్ డిజైన్ సౌందర్యం నేటి ఫ్యాషన్ ట్రెండ్‌కు కూడా సరిపోయేంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కత్ లో ఖచ్చితమైన గణిత గణనలతో సంక్లిష్టమైన రెసిస్టెంట్ డైయింగ్ టెక్నిక్ ఉంటుంది. రేఖాగణిత నమూనాలు, ఫ్లూయిడ్ డిజైన్లు మరియు అద్భుతమైన ఆకర్షణతో ఉంటుంది ఇక్కత్ వస్త్రం. గౌనులు, డ్రెస్సులు, చీరలు.. ఇలా ఏవైనా ఇక్కత్ వస్త్రంతో చేసినవి ప్రత్యేక ఆకర్షణే.