Khammam Crime : ఓ వ్యక్తి భూదాహానికి అన్నదమ్ములు బలి, ఖమ్మం జిల్లాలో వరుసగా కబ్జా కేసులు!

Best Web Hosting Provider In India 2024

Khammam Crime : ఓ కబ్జాదారుడి భూ దాహానికి అన్నదమ్ములు నిలువునా ఉసురు తీసుకున్నారు. ఎకరం భూమి కొని తప్పుడు పత్రాలు సృష్టించి వివాదానికి ఆజ్యం పోశాడు. ఫలితంగా తొలుత తమ్ముడు పురుగుల మందు తాగి తనువు చాలించగా తాజాగా అన్న బలవంతపు మరణం పొందాడు. ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం కలిచివేస్తోంది. కాగా ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో వరసగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనంగా మారింది.

కబ్జా కోరలకు ప్రాణాలే హారతి

భూ కబ్జాదారుల ఆగడాలకు ఖమ్మం జిల్లాలో తాజాగా మరో రైతు బలయ్యాడు. జులై 2న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం పొద్దుటూరులో భూ కబ్జాదారుల ఆగడాలకు బోజడ్ల ప్రభాకర్ అనే రైతు పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన మరువకముందే.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో భూ కబ్జాదారుల దాటికి సన్న చిన్న కారు రైతు ఏలేటి వెంకటరెడ్డి (46) తన పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న రైతు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. రైతు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి అన్నదమ్ములు. వీరి వాటాకు వచ్చిన భూమిలో వెంకటరెడ్డి తమ్ముడు భూపాల్ రెడ్డి అనే రైతు అదే గ్రామానికి చెందిన జాటోత్ వీరన్నకు ఎకరం భూమిని విక్రయించాడు. డబ్బుల చెల్లింపులో అలసత్వం వహించి విడతల వారీగా చెల్లిస్తూ భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రాంసరీ నోట్, అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు తీసుకొని గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

సరిహద్దుల విషయంలో మరో మారు తప్పుడు పత్రాలు సృష్టించి సంతకాలు తీసుకొని ఆ భూమిని తనవశం చేసుకునేందుకు ప్రయత్నించాడు. వీరన్న ఆగడాలు తట్టుకోలేక భూపాల్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురై 2021లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా భూపాల్ రెడ్డి వద్ద కొనుగోలు చేసిన భూమి సాగుకు అనుకూలంగా లేదని భావించి, భూపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి భూమిని దాదాపు అర ఎకరం మేర సరిహద్దు భూమిని వీరన్న కబ్జా చేసి సాగు చేయటం ప్రారంభించాడు. దీనిని అడ్డుకునేందుకు వెళ్లిన వెంకటరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. పలు దఫాలు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. వీరన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద గతంలో కేసులు నమోదు చేశారు. ఈ వివాదంలో ఇరువురు కూడా కోర్టును ఆశ్రయించి ఎవరికి వారుగా పై చేయిసాధించారు. ఈ వివాదం దాదాపు గత 10 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది.

సూడో మావోగా హల్ చల్..

సూడో మావోయిస్టుగా పేరు ఉన్న జాటోత్ వీరన్న తరచూ ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ దౌర్జన్యంగా భూ కబ్జాలకు పాల్పడుతుంటాడు. దీంతో వీరన్నను ఎదుర్కొనే శక్తి వెంకటరెడ్డికి లేకుండా పోయింది. ఈ నెల నాలుగో తేదీన ఆదివారం ట్రాక్టర్ సహాయంతో తను ఆక్రమించిన భూమిని దున్నుతూ పొలం వేసేందుకు వీరన్న సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డి తన పొలానికి వచ్చి చూడగా అప్పటికే ట్రాక్టర్ సహాయంతో వీరన్నతో పాటు అతని కుటుంబ సభ్యులు నాట్లు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనులను ఆపమని వెంకటరెడ్డి ఎంత వేడుకున్నా కూడా వారు వినలేదు. పోలీసులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

మరో వైపు తన పొలం కండ్ల ఎదుటే కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరెడ్డి తన పొలంలో ఉన్న పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు జాటోత్ వీరన్న, అతని కుటుంబ సభ్యులే కారణమని, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తన సెల్ఫీ వీడియోలో బాధను వ్యక్తం చేశాడు. ఈనెల 4న పురుగుల మందు తాగిన వెంకటరెడ్డి మూడు రోజులు పాటు ఖమ్మంలోని శ్రీ రక్ష ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఖమ్మం రూరల్ పోలీసులు జాటోత్ వీరన్న తో పాటు మరో ఆరుగురుపై 306 రెడ్ విత్, 447,427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో వరస ఘటనలు..

ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న కూడా ఇటు పోలీసులు, అటు మంత్రులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో ఇటు ప్రజలు అటు అన్నదాతలు ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యానికి, భూ కబ్జాదారుల ఆగడాలకు మరిన్ని ప్రాణాలు పోతాయేమోనని జనం భయంతో వణికిపోతున్నారు. భూ కబ్జాదారులను ఉక్కు పాదంతో అణచివేసినప్పుడే యజమానులు ఉపిరి పీల్చుకుంటారని రైతులు భావిస్తున్నారు.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaKhammamCrime TelanganaFarmers
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024