Swelling in pregnancy: ప్రెగ్నెన్సీలో ముఖం, కాళ్లు ఉబ్బిపోయాయా? కారణాలు, నివారణ మార్గాలివే

Best Web Hosting Provider In India 2024


గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళలో వాపు రావడం సాధారణం. శరీరంలో ద్రవాలు చేరుకోవడమే దీనికి కారణం. దీనిని వైద్య భాషలో ఎడెమా అంటారు. ఎడెమా శరీరంలోని వివిధ భాగాల్లో ముఖ్యంగా పాదాలు, చీలమండలం, చేతుల్లో వాపుకు కారణమవుతుంది. ఇది సాధారణ సమస్యే. కానీ కొన్నిసార్లు అసౌకర్యంగా, తీవ్రంగా ఉంటుంది. ఎడెమా కారణాలు, పరిష్కారాలు అర్థం చేసుకుంటే సులువుగా దీన్ని తగ్గించుకోవచ్చు.

ఎడెమా కారణాలు:

రక్త పరిమాణం:

గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే బిడ్డ, మావిని పోషించడానికి ఎక్కువ ద్రవం, రక్తం ఉత్పత్తి ఉంటుంది. ఈ పెరుగుదల సాధారణం కంటే 50 శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా తల్లీబిడ్డ ఇద్దరికీ తగినంత పోషణ లభిస్తుంది. కానీ దీని వల్ల శరీరంలో నీటి శాతం నిల్వ పెరుగుతుంది.

గర్భాశయ పరిమాణం:

గర్భాశయం పరిమాణం పెరిగేకొద్దీ, కటిలోని సిరలు, శరీరంలోని అతిపెద్ద సిర అయిన బృహత్ సరిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాళ్ళ నుండి గుండెకు వచ్చే రక్తాన్ని అడ్డుకుంటుంది. శరీరం యొక్క దిగువ భాగాలలో ద్రవాల స్థాయులు పేరుకుపోవడం మొదలవుతుంది.

అధిక సోడియం:

ఆహారంలో అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం కూడా ఒక కారణమే. గర్భధారణ సమయంలో వాపు సమస్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అధిక మొత్తంలో సోడియంను సమతుల్యం చేయడానికి, శరీరం నీటిని సేకరిస్తుంది. ఇది వాపును పెంచుతుంది.

ప్రొజెస్టిరాన్:

గర్భధారణలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. రక్త నాళాల వశ్యత పెరగడం వల్ల, ద్రవం ఇతర కణాలలోకి కూడా వెళుతుంది, దీనివల్ల వాపు వస్తుంది.

వేడిలో కూర్చోవడం:

వేడి వాతావరణంలో ఉండటం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడటం గర్భధారణ సమయంలో వాపు సమస్యను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సేపు ఒకే స్థితిలో ఉండటం వల్ల శరీరం కింది భాగంలో వాపు పెరుగుతుంది.

ఎడెమా లక్షణాలు:

అత్యంత స్పష్టమైన లక్షణం పాదాలు, చీలమండలం, కొన్నిసార్లు చేతులు, ముఖంలో వాపు కనిపించడం.

వాపు ఉన్న భాగాన్ని నొక్కినప్పుడు, అక్కడ లోతు ఏర్పడుతుంది. ఇది తిరిగి మామూలుగా అవ్వడానికి కొంత సమయం పడుతుంది.

వాపు ఉన్న ప్రాంతంలో చర్మం బిగుతుగా అనిపిస్తుంది.

చేతులు, వేళ్ళలో వాపు ఉన్నప్పుడు వస్తువులను పట్టుకోవడం లేదా వేళ్లను వంచడం కష్టమవుతుంది.

ఎడెమా తగ్గడానికి చిట్కాలు:

నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీటి పరిమాణం తగినంతగా ఉన్నప్పుడు, నీరు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి.

ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, నీరు చేరకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవద్దు ఎందుకంటే వాటిలో చాలా సోడియం ఉంటుంది.

పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, బచ్చలికూర, చిలగడదుంపలు తినడం వల్ల శరీరంలో నీటి స్థాయి సమతుల్యంగా ఉంటుంది.

నడక, స్విమ్మింగ్, ప్రినేటల్ యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వాపు తగ్గుతుంది.

రోజుకు కాసేపు గోడకు దగ్గరగా పడుకుని మీ కాళ్ళను గోడకు ఆనించి 20 నిమిషాలు పైకి కిందికి ఎత్తడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని దిగువ భాగాలలో వాపు తగ్గుతుంది.

వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు, షూ ధరించడం రక్త ప్రసరణకు సహాయపడుతుంది. వాపును తగ్గిస్తుంది.

అప్పుడప్పుడు లేవడం, నడవడం మర్చిపోవద్దు. దీని వల్ల శరీరం దిగువ భాగాలలో నీరు చేరకుండా నిరోధించవచ్చు.

ఎప్సమ్ లవణం కలిపిన నీటిలో కాసేపు సమస్య ఉన్న చోటు ముంచి ఉంచితే కూడా వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కోల్డ్ కంప్రెస్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024