Best Web Hosting Provider In India 2024
అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు.. వయసుతో సంబంధం లేకుండా అంతా నైటీలకు అలవాటు పడిపోయారు. గృహిణులకు నైటీ అంటే యునిఫార్మ్ లాగా అయిపోయింది. చిన్న వేడుకకో, పెళ్లికో వెళ్లొచ్చాక వెంటనే చేయాల్సిన పని నైటీ తగిలేసుకోవడం. లేదంటే మనశ్శాంతి రాదు. అసలు ప్రశాంతత అంతా నైటీలోనే ఉంది అనిపిస్తుంది దానికి అలవాటు పడ్డవాళ్లకి. ఇప్పుడు ఈ నైటీలు వేసుకుంటే ఏంటీ సమస్యా అంటే ఊరుకోండి. కానీ రోజూ నైటీలు వేసుకుని.. వేసుకుని మీరూ, మిమ్మల్ని నైటీలో చూసి చూసి మీ ఇంట్లో వాళ్లు విసుగెత్తిపోయుంటే దానికి ఉన్న ప్రత్యామ్నాయాలు మాత్రం తెల్సుకోవాల్సిందే. వాటితో నైటీలకు మించిన సౌకర్యం, లుక్ ఉంటాయి.
నైటీలంటే అడిక్షన్:
మిగతా ఏ బట్టలు వేసుకున్నా బిగుతుగా పట్టేసినట్లుంటాయి. దాంతో ఇంటిపనులు చేయడానికి సౌకర్యంగా అనిపించదు. నైటీలు శరీరానికి సరిపోయేలా ఉంటాయి. వదులుగా ఉంటాయి. ఏ పనైనా సులువుగా చేయొచ్చు. అలాగే వీటి ధర కూడా తక్కువే ఉంటుంది. ఎక్కువ కాలమూ మన్నుతాయి. అందుకే వీటి వల్ల వచ్చే సౌకర్యంతో వీటికి అలవాటు పడిపోయాం. కాటన్‌తో చేసినవే ఎక్కువుంటాయి. బరువూ తక్కువే. వీటిని ఉతకడమూ సులువే.
నైటీల్లో ఏముంది?
నైటీ ఆంగ్ల స్పెల్లింగ్ చూస్తే.. నైట్ అంటే రాత్రి పూట వేసుకునే దుస్తులివి. రాత్రి పూట సౌకర్యంగా నిద్రపోడానికి వీటిని వేసుకోవాలి. కానీ దినమంతా వీటితోనే గడిపేస్తున్నాం. పూజకో నైటీ, పనులకో నైటీ, నిద్రకో నైటీ.. ఇలా నైటీలు దేనికవే వేరుగా ఉంటాయి కానీ.. నైటీలు ఉండటం అయితే పక్కా.
ప్రత్యామ్నాయాలున్నాయ్:
ఇంత సౌకర్యం ఇచ్చే నైటీలకు అలవాటు పడిపోయినా చాలా ఇబ్బందే. మరింకే రకమైన బట్టలు వేసుకోవాలన్నా విసుగు వస్తుంది. పైగా టక్కుమని బయటకు వెళ్లడం, చిన్న పనులకు బట్టలు మార్చుకోవాల్సి రావడం, ఎవరైనా ఇంటికి వస్తారంటే కంగారు పడటమూ సాధారణమే. అందుకే నైటీల లాంటి సౌకర్యాన్నిచ్చే బట్టలు కొన్నున్నాయి. అవేంటో చూడండి. వీటితో సౌకర్యంతో పాటూ, ట్రెండీగానూ కనిపించొచ్చు.
1. కాఫ్తాన్లు:
మీరు కాస్త మధ్య వయస్సు వాళ్లయితే కాఫ్తాన్ మ్యాక్సీ కుర్తాలు ఎంచుకోవచ్చు. లేదా కాఫ్తాన్ నైటీలు కూడా చాలా ట్రెండీగా ఉంటాయి.ఇవి కూడా సాదా నైటీల్లాగే చాలా వదులుగా ఉంటాయి. పైనుంచి కింది దాకా పొడవుగా ఉంటాయి. ఇవి బోలెడు డిజైన్లు, ప్రింట్లు, రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని వేసుకుని బయటకు వెళ్లిపోయినా ఇబ్బంది ఉండదు. తక్కువ వయసున్న వారయితే కాఫ్తాన్ నైట్ డ్రెస్సులు అందుబాటులో ఉంటాయి. అంటే కింద ప్యాంట్, మీద కాఫ్తాన్ కుర్తా ఉంటుంది. ఇది కూడా చాలా సౌకర్యాన్నిస్తుంది.
2. మ్యాక్సీ టీషర్ట్:
నైటీకి మించిన సౌకర్యం ఈ మ్యాక్జీ టీషర్ట్ వల్ల వస్తుంది. పేరు చెబుతున్నట్లే టీషర్ట్ పొడవు మోకాళ్లు దాటి ఉంటుంది. కింద లూజ్ ప్యాంట్, పైజామా, కాప్రి లాంటివి ఏదైనా వేసుకుంటే లుక్ బాగుంటుంది. నైటీ వేసుకున్నట్లే చాలా సౌకర్యంగా ఉంటుంది. వీటి మన్నిక ఎక్కువే. ఉతకడమూ సులువే.
3. ట్రెండీ నైట్ వేర్:
నైట్ డ్రెస్ కూడా ట్రెండీగా ఉండాలి అనుకుంటే హరెమ్ (harem pants) ప్యాంట్లు ఎంచుకోవచ్చు. ఇవి చాలా వదులుగా ఉంటాయి. కింద స్కర్ట్ వేసుకున్నట్టుంటాయి. కాస్త ఎగుడు దిగుడు డిజైన్లతో ఉండే ప్యాంట్లు ఇవి. వీటితో వచ్చే సౌకర్యమూ ఎక్కువే. మీద టీషర్ట్ కానీ, షార్ట్ కుర్తా కానీ వేసుకుంటే రోజంతా గడపొచ్చు.
లేదంటే ఇప్పుడు పలాజో స్కర్టులు వస్తున్నాయి. అంటే ఫ్లేర్ట్ పలాజోలు అనుకోవచ్చు. దూరం నుంచి చూస్తే స్కర్ట్ వేసుకున్నారు అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా వదులుగా ఉండే ప్యాంట్లు ఇవి. స్కర్టుల్లో సౌకర్యం ఉండదనుకుంటే ఈ ప్యాంట్లు, జతగా టీషర్ట్ లేదా కుర్తా ఎంచుకోండి. అటు ట్రెండీగా ఉంటారు. ఇటు సౌకర్యమూ ఉంటుంది.
టాపిక్