Vallabhaneni Vamsi: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, పోలీసుల ముమ్మర గాలింపు

Best Web Hosting Provider In India 2024


Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో వంశీ కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ కేసులో 71వ ముద్దాయిగా ఉన్న వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే వంశీ అచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు. వంశీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగానే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ఫైల్ చేశారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వంశీ దాదాపుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా నారా లోకేష్, చంద్రబాబులపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్యంసం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్‌‌కు పరిమితం అయ్యారు. రెండు నెలల క్రితం విజయవాడలోని వంశీ అపార్ట్‌మెంట్‌పై యువకులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపు చేయాల్సి వచ్చింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిలో వల్లభనేని వంశీ నేరుగా పాల్గొనక పోయినా, ఎమ్మెల్యే హోదాలో అనుచరుల్ని రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ కేసులో జులై 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉంది.

టీడీపీ కార్యాలయం ఆపరేటర్‌ ముదునూరి సత్యవర్ధన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్‌ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్‌ నంబర్‌ 137/2023) నమోదు చేశారు. 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు.

కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వారి వాహనాలను తగులబెట్టారు. ఐదు గంటల పాటు తీవ్గర విధ్వంసం సృష్టించారు. గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులపై ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

టీడీపీ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో సీసీ కెమేరాలు, వీడియోలు ద్వారా నిందితుల్ని గుర్తించారు. మొత్తం 71మంది దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిలో మూల్పూరి ప్రభుకాంత్‌ అలియాస్‌ ప్రేమ్‌కుమార్‌, ఎర్రగళ్ల నగేశ్‌, షేక్‌ కరీముల్లా, కొల్లి సుబ్రమణ్యం, బుగ్గల రాజేశ్‌, రామినేని రవిబాబు, మల్లవల్లి సాయి రాహుల్‌, షేక్‌ రబ్బాని, పాగోలు సురేశ్‌, బండారుపల్లి కోటేశ్వరరావు, పడమట నాగరాజు, దాసరి విజయ్‌, సాలియోహాన్‌, డొక్కు సాంబశివ వెంకన్నబాబు, మేచినేని విజయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తాజాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

టాపిక్

Ysrcp Vs TdpYsrcpAp PoliticsAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024