Kerala Tour: వారంపాటూ కేరళ ట్రిప్, ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ చూడాల్సిన ప్రదేశాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

Kerala Tour: ఎప్పటి నుంచో కేరళ వెళ్లాలని అనుకుంటున్నాం. కానీ ప్రతిసారీ వాయిదా వేస్తూనే వస్తున్నాం. ఈషారి మాత్రం తప్పకుండా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. కేరళ టూర్‌ను కేవలం ఆధ్యాత్మికంగానే చూడాలనుకోవడం లేదు, అటు పర్యాటకంగానూ ఆస్వాదించేలా ప్లాన్ చేశాం. మా టూర్‌లో గురువాయుర్, త్రిసూర్, అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్, తిరువనంతపురం, వర్కలా ఇవన్నీ ప్రధానంగా కవర్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అనుకున్న విధంగానే టూర్ పూర్తి చేశాము.

13 జూన్ 2024

వైజాగ్ నుంచి త్రిసూర్ వెళ్లాము. అక్కడ ఒక హోటల్ లో రూమ్ బుక్ చేశాము. ఫ్రెష్ అయి సాయంత్రం అక్కడ ఉన్న వడక్కునాధన్ ఆలయానికి వెళ్లాం. అత్యంత పురాతనమైన శివాలయం అది. సువిశాలమైన ప్రాంగణంలో కేరళ ఆర్కిటెక్చర్ స్టయిల్ లో అత్యద్భుతంగా ఉంది ఆలయం. అక్కడ శివలింగానికి నిత్యం నెయ్యితో అభిషేకం చేస్తారు. దాంతో శివలింగం గడ్డకట్టుకుపోయిన నేయి మధ్యలో ఉంటుంది. కేరళలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరం వేడుక జరిగేది ఈ ఆలయంలోనే. పదుల సంఖ్యలో ఏనుగుల్ని అందంగా అలంకరించి, ఊరేగింపుగా వేడుక నిర్వహిస్తారు.

వడక్కునాధన్ ఆలయం వెనుక వైపు పరమైకావు భగవతి ఆలయం ఉంది. ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దర్శించి దీపాలు వెలిగించా. మొదటి రోజు త్రిసూర్ లో సంప్రదాయ బ్రహ్మణ భోజన హోటల్లో భోజనం తిన్నాం. అక్కడి కేరళ సంప్రదాయ భోజనం అదిరిపోయింది.

14 జూన్ 2024

ఈ రోజున అతిరాపల్లి జలపాతాలు చూసేందుకు బయల్దేరాం. అతిరాపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లను చూస్తే మాకు మతిపోయింది. హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉండే సంన్నుల భవనాలు కూడా వెలవెలబోతాయేమో అన్నంతగా ఉన్నాయి.పిల్లలంతా విదేశాల్లో ఉండి డబ్బులు పంపిస్తే…ఇక్కడున్న తల్లిదండ్రులు ఈ స్థాయిలో ఇళ్లు కట్టించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.అతిరాపల్లి ఫాల్స్‌కు వెళ్లే సరికే జనం విపరీతంగా ఉన్నారు. మెయిన్ గేట్ నుంచి జలపాతం పై భాగం వరకు దాదాపు ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి వచ్చింది. కానీ ఆ మార్గం మొత్తం అత్యద్భుతంగా ఉంది.దాదాపు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించాక జలపాతం కింది భాగానికి చేరుకున్నాం.గంగమ్మ పరవళ్లు తొక్కుతూ పై నుంచి లోయలోకి దూకుతున్న తీరు చూస్తూ అలా ఉండిపోయాం. ఆ తరువాత అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోని చాప్రా జలపాతం దగ్గరకు వెళ్లాం. అక్కడి దగ్గరలోనే ఉన్న వాలాచల్ జలపాతం కూడా చూశాం. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న డ్యామ్ కూడా చూశాం. తిరిగి హోటల్‌కు చేరుకున్నాం.

15 జూన్ 2024

సోమవారం ఉదయాన్నే మా ప్రయాణం గురువాయుర్ కి. కేరళ, తమినాడు ప్రజలు గురువాయుర్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. కేరళలో అత్యధికంగా వివాహాలు జరిగే ఆలయం కూడా ఇదే. మేం ఉదయం 8 గంటలకు గురువాయుర్ చేరుకున్నాం. సువిశాలమైన ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ ప్రత్యేక దర్శనం అంటే 1000 టికెట్. ఒక గంటలో దర్శనం పూర్తియింది. ఆ బాలకృష్ణుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవనిపించింది. ఇక్కడ పాలపాయసం ప్రసాదం ఇక్కడెంతో ఫేమస్. తర్వాత అక్కడి సమీపంలోని మమ్మియూర్ మహదేవన్ ఆలయానికి వెళ్లాం. ఇక్కడ శివుడు, విష్ణుమూర్తి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఆ ఆలయాన్ని సందర్శిస్తే కానీ గురువాయుర్ యాత్ర పరిపూర్ణం కాదని చెబుతారు. ఈ ఆలయంలో నెయ్యి పాయసం అత్యద్భుతంగా ఉంటుంది. మేం ఇంటికి కూడా తెచ్చుకున్నాం. దాదాపు నెల రోజుల నిల్వ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు త్రిసూర్ నుంచి త్రివేండం వెళ్లడానికి వందేభారత్ ట్రైన్ ఎక్కి రాత్రి 10 గంటలకు తిరువనంతపురం చేరుకున్నాం.

16 జూన్ 2024

తిరువనంతపురంలో హోటల్ రూమ్ తీసుకున్నాం. ఉదయం 7 గంటలకే అనంతపద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాము. సువిశాల ఆలయ అవరణ అత్యద్భుతంగా ఉంది. ఆ నిర్మాణ శైలిని, అక్కడ శిల్పసందను చూసి తీరాల్సిందే. దర్శనం అయ్యేటప్పటికి పదిన్నర దాటింది. తిరువనంతపురం సమీపంలోని కొన్ని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు చూడటానికి ఒక ఆటో తీసుకున్నాం. పద్మనాభస్వామి ఆలయం సమీపంలోని పలవనగాడు(పవనగడి) వినాయక ఆలయం సందర్శనతో మా ట్రిప్ మొదలైంది. ఈ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే తీరు విచిత్రంగా ఉంది. గోడ మీదకు బలంగా విసిరి కొడతారు. ఆ తర్వాత అట్టుక్కల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లాం. ఆ తర్వాత అక్కడ నుంచి పూవార్ ఐలాండ్ బోటింగ్ పాయింట్‌కి వెళ్లాం. రెండున్నర గంటల బోటింగ్‌కి, ఒక బోట్ కి మూడు వేల ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తున్నారు. కోకొనట్ ఐలాండ్, ఫ్లోటింగ్ రిసార్ట్స్, గొల్డెన్ బీచ్, కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని మేరిమాత విగ్రహం, షూటింగ్ స్పాట్ ఇలా కొన్ని ప్రాంతాలు కవర్ చేస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అనకొండతో పాటుగా కొన్ని హాలివుడ్ సినిమాలు ఈ ప్రాంతంలోనే షూట్ చేశారట. ఆ ప్రాంతాలను కూడా మనం చూడొచ్చు.

ఆ తర్వాత అక్కడ నుంచి కోవలం బీచ్ కి వెళ్లాం. బీచ్ చాలా బాగుంది. అలల తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో బీచ్ లోకి ఎవ్వరినీ దిగనివ్వడం లేదు. తర్వాత అజమల శివాలయానికి చేరుకున్నాం. బీచ్ ఒడ్డున 58 అడుగుల గంగాధరేశ్వరుడిని చూసి తరించాల్సిందే. ఓ పురాతన శివాలయాన్ని ఆనుకుని ఈ భారీ శివుడి విగ్రహం ఉంటుంది. అజమల సందర్శన పూర్తయిన తర్వాత మేం అక్కడ నుంచి చంకల్ మహేశ్వరాలయానికి ప్రయాణం అయ్యాం. అది మారుమూల ప్రాంతం. సాయంత్రమైపోవడంతో మేం అంత దూరం వెళ్లడం సరైందేనా అని అనుమానం కలిగింది. కానీ ఆ అలయం దగ్గర ఆటో దిగగానే ఒక్కసారి మనస్సు గాలిలో తేలిపోయింది. 111 అడుగుల శివలింగం… ఆ శివలింగాన్ని నెడుతున్నట్టుగా ఉన్న హనుమంతుడు, కేరళ నిర్మాణ శైలిలో ఉన్న భారీ స్థాయి ఆలయం అంతా కన్నుల పండుగే. తిరిగి త్రివ్రేండం బయలుదేరాం.

17 జూన్ 2024

కేరళ పేరు చెప్పగానే ప్రధానంగా గుర్తుకొచ్చే పర్యాటక ప్రాంతం జటాయు ఎర్త్ సెంటర్. రామాయణంలో జటాయు పక్షి రెక్కలను రావణుడు అతడి రెక్కలు నరికేస్తాడు. ఆ జటాయువు పడిన ప్రాంతంలోనే ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా చెబుతారు. కొండ మీద ఏర్పాటు చేసిన భారీ జటాయువు విగ్రహం అత్యద్భుతంగా ఉంటుంది. కింద నుంచి కొండ మీదకు రోప్ వే ఉంటుంది. కొండ మీద సీతారాముల ఆలయం ఉంది, ఆ పక్కనే రాముడి పాదం ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇతర ఎంటర్ టైన్మెంట్ గేమింగ్స్ కూడా ఉన్నాయి.

జటాయువు తర్వాత మా మజిలీ వర్కలా. అద్భుతమైన బీచ్ లతో అలరారే వర్కలాలో విదేశీ టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఉంటారు. గోవా తర్వాత ఆ తరహాలో బీచ్‌లకు వర్కలా ప్రసిద్ది. ఇక్కడ పారా గ్లైడింగ్, మోటార్ రైడింగ్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. అక్కడ ఎంజాయ్ చేశాక సాయంత్రానికి తిరిగి తివేండ్రం చేరుకున్నాం.

18 జూన్ 2024

ఆ రోజు ఉదయం మరోసారి అనంతపద్మనాభుడిని దర్శించుకున్నాం. షాపింగ్ చేశాం. మధ్యాహ్నం కేరళలో ప్రసిద్ది చెందిన మదర్స్ ప్లాజాకు వెళ్లాం. కేరళ పెళ్లి వేడుకల్లో ఎలాంటి వెజిటేరియన్ భోజనం పెడతారో అదే తరహాలో భోజనం పెడతారు, దీనిని అక్కడ సద్య అంటారు. ఈ సద్యలో దాదాపు 60 రకాల వెరైటీలు మనకు వడ్డిస్తారు. అందులో 20కిపైగా స్వీట్లు ఉంటాయి. అన్నీ కేరళ స్టయిల్ వంటకాలే. ఆ విందు అద్భుతంగా ఉంది. త్రివేండ్రం వెళ్తే తప్పకుండా ఈ సద్య ట్రై చేయండి. ఆ రోజు సాయంత్రం మేం తిరిగి వైజాగ్ రైలు ఎక్కేశాం.

– సూర్య

రచయిత సూర్య
రచయిత సూర్య

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024