PT Usha Vinesh Phogat: తప్పంతా వినేశ్ ఫోగాట్‌దే అంటున్న పీటీ ఉష.. వైరల్ అవుతున్న ఐఓఏ ఛీఫ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


PT Usha Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ లో కచ్చితంగా మెడల్ గెలుస్తుందనుకున్న రెజ్లర్ వినేశ్ ఫోగాట్.. ఫైనల్ బౌట్ కు ముందు బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం తెలుసు కదా. ఈ విషయంలో తప్పంతా వినేశ్ దే అన్నట్లుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడటం గమనార్హం.

ఆ అథ్లెట్‌దే బాధ్యత

వినేశ్ ఫోగాట్ అనర్హత విషయంలో చాలా మంది ఐఓఏ మెడికల్ టీమ్ ను నిందిస్తున్నారు. ముఖ్యంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్షా పర్డీవాలాను తప్పుబడుతున్నారు. కానీ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వాదన మరోలా ఉంది. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడోలాంటి వాటిలో తన బరువు నియంత్రణలో ఉంచుకునే బాధ్యత మొత్తం అథ్లెట్ దే అవుతుందని ఆమె అనడం గమనార్హం.

ఈ ఈవెంట్లో కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇప్పించాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో ఇండియా అప్పీల్ చేసిన నేపథ్యంలో పీటీ ఉష కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. వినేశ్ కు ఈ పరిస్థితి రావడానికి ఐఓఏ మెడికల్ టీమ్ దే బాధ్యత అని పార్లమెంట్ లోని కొన్ని వర్గాలు కూడా ఆరోపణలు గుప్పించాయి. అయితే ఉష వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడోలాంటి వాటిలో బరువు నియంత్రణలో ఉంచుకునే బాధ్యత మొత్తం సదరు అథ్లెట్, ఆమె లేదా అతడి కోచ్ పై ఉంటుంది తప్ప ఐఓఏ నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్డీవాలా, ఆయన టీమ్ పై కాదు. ఐఓఏ మెడికల్ టీమ్, ముఖ్యంగా డాక్టర్ పర్డీవాలాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలు సరికావు. వీటిని ఖండిస్తున్నాను” అని పీటీ ఉష స్పష్టం చేసింది.

ఆ టీమ్ అందుకే..

ఐఓఏ కొన్ని నెలల కిందట నియమించిన మెడికల్ టీమ్ కేవలం అథ్లెట్ల గాయాల విషయంలోనే పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా పీటీ ఉష చెప్పారు. “పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ లో ఆయా స్పోర్ట్స్ లో తలపడిన ప్రతి అథ్లెట్ కు సొంతంగా ఓ సపోర్ట్ టీమ్ ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆ టీమ్స్ ఆయా అథ్లెట్లతో కలిసి పని చేస్తున్నాయి.

ఐఓఏ రెండు నెలల కిందటే మెడికల్ టీమ్ ను నియమించింది. ఒలింపిక్స్ కు ముందు, తర్వాత అథ్లెట్ల గాయాలపై పని చేయడం మాత్రమే ఈ టీమ్ పని. తమకు సొంతంగా న్యూట్రిషనిస్టులు, ఫిజియో థెరపిస్టులు లేని అథ్లెట్ల కోసం కూడా ఈ టీమ్ పని చేస్తుంది” అని పీటీ ఉష తెలిపారు.

మరోవైపు వినేశ్ ఫోగాట్ కు సిల్వర్ మెడల్ అయినా ఇస్తారా లేదా అన్నది బుధవారం (ఆగస్ట్ 13) తేలనుంది. ఈ విషయంపై ఇండియా చేసిన అప్పీల్ పై తుది నిర్ణయాన్ని సీఏఎస్ వెల్లడించనుంది.

Best Web Hosting Provider In India 2024



Source link