Medical College Jobs: ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు.. అనుకోకుండా పోలీసులకు చిక్కారు..!

Best Web Hosting Provider In India 2024


వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఇందులో పొరుగు సేవల కింద కొన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాధ్యతను నవోదయ ఎజెన్సీకి అప్పగించారు. పదుల సంఖ్యలో ఉన్న పోస్టులకు.. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు వ్యక్తులు నిరుద్యోగులను నిండా ముంచారు.

పోలీసులు కథనం ప్రకారం..

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు విభాగాల్లో భర్తీకి గత నెలలో నవోదయ ఏజెన్సీ ప్రతినిధులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి భారీ స్పందన వచ్చింది. ఏజెన్సీ ప్రతినిధులు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిమ దారావత్ శరత్ చంద్ర, హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన పోరండ్ల శివ, వరంగల్ నగరం దేశాయిపేటకు చెందిన కవిత ముఠాగా ఏర్పడ్డారు. తాము నవోదయ ఏజెన్సీ ప్రతినిధులం అని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు.

పోస్టును బట్టి డబ్బు వసూలు..

పోస్టును బట్టి లక్ష రూపాయల నుంచి.. రూ.5 లక్షల వరకూ వసూలు చేశారు. ఈ క్రమంలో నవోదయ ఏజెన్సీపై ఉద్యోగాలు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నవోదయ ప్రతినిధులు డబ్బులు వసూలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు నిఘా పెట్టారు. శుక్రవారం రాత్రి సమయంలో.. ముఠా సభ్యులు నర్సంపేటకు వచ్చారని తెలుసుకొని వారిని ఫాలో అయ్యారు. నలుగురు ఉద్యోగార్థుల నుంచి డబ్బులు తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు. అయితే.. నవోదయ ఏజెన్సీ వారిని గమనించిన కవిత.. అక్కడి నుంచి పారిపోయింది.

ముగ్గురిపై కేసు నమోదు..

నవోదయ ఏజెన్సీ నిర్వాహకులు స్వప్న ఫిర్యాదుతో.. దారావత్ శరత్ చంద్ర, పోరండ్ల శివపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు వారిని పోలీసులకు అప్పగించారు. అయితే.. ఈ ముగ్గురు ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు.. ఎంత వసూలు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటు నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని నవోదయ ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.

టాపిక్

JobsTs PoliceTelangana NewsWarangalFrauds

Source / Credits

Best Web Hosting Provider In India 2024