Best Web Hosting Provider In India 2024
రాఖీ పండగ అనగానే మన తెలుగు రాష్టాలతో పాటూ దేశంలోని చాలా ప్రాంతాల్లో తోబుట్టువుల బంధాన్ని వేడుకలా చేసుకుంటారు. సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి బంధం విలువ గుర్తు చేసే పండగ ఇది. అయితే కొన్ని చోట్ల రాఖీ రోజు వివిధ ఆచారాలు పాటిస్తారు. కాస్త భిన్నంగా రాఖీ వేడుకలు జరుపుకుంటారు.
మహారాష్ట్రలో నరాలీ పూర్ణిమ:
ఈ రోజు సోదరుడి నుదుటన తిలకం పెట్టి చేతికి రాఖీ కట్టే సాంప్రదాయం ఇక్కడా ఉంది. కాకపోతే మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో, అలాగే డామన్, డయ్యూల్లో సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో నరాలీ పూర్ణిమ జరుపుకుంటారు. నరాల్/నారియల్ అంటే కొబ్బరి కాయ. పూర్ణిమ రోజు సముద్రానికి కొబ్బరి కాయలు సమర్పిస్తారు. అవి సముద్రంలో ఉండే పెద్ద అలల్ని శాంతింప జేస్తాయని నమ్ముతారు. కొబ్బరికి మూడు కళ్లుంటాయి కాబట్టి దాన్ని శివునికి ప్రతీకగా భావించి సముద్రుడికి సమర్పిస్తే చేపలు పట్టడానికి వీలుగా ఆ వరుణుడు సహాయం చేస్తాడని ఇక్కడ జాలర్ల కుటుంబాలు నమ్ముతాయి. ఈ పవిత్ర పండగ రోజు వాళ్ల ప్రధాన ఆహారమైన చేపలు తినకుండా నియమ నిష్ఠలు పాటిస్తారు.
ఝులన్ పూర్ణిమ:
పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ రాష్ట్రంలో రాఖీ పూర్ణిమనే ఝులన్ పూర్ణిమ అంటారు. ఈ రోజు కృష్ణుడికి, రాధకు పూజలు చేస్తారు. తోబుట్టువులు రాఖీ కట్టుకుంటారు. ఘులన్ అంటే ఊయల. ఈ రోజు రాధా కృష్ణుల విగ్రహాలు, ఫొటోలు, ఊయలలో ఉంచి ప్రత్యేక వేడుకలు చేస్తారు. ఆటలు, పాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుగుతాయి.
గంహ పూర్ణిమ:
ఇది ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే సాంప్రదాయం. రాఖీ పూర్ణిమ రోజే గంహ పూర్ణిమ వేడుకలూ జరుగుతాయిక్కడ. ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తోబుట్టువుల బంధాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. దాంతో పాటే ఈ రోజున శ్రీ కృష్ణుడు అన్న అయిన బలరాముడి పుట్టిన రోజూ జరుపుకుంటారు. ఈ రోజు సాంప్రదాయ వేడుక అయిన గంహ దియాన్ లేదా గంహ జంప్ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలు చాలా ప్రత్యేంగా ఉంటాయి.
ఈ రోజు పశువుల ప్రాధాన్యతను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ఆవులు, ఎద్దులను అందంగా అలంకరిస్తారు. అంతే కాదు.. వాటి కొమ్ములకు రాఖీలు కూడా కడతారు. ఇలాంటి పండగే మన తెలుగు రాష్ట్రాల్లోనూ పొలాల అమావాస్య పేరుతో జరుపుకుంటారు. బలరాముడు భుజం మీద హలంతో కనిపిస్తాడు. అందుకే ఈ పండగ వ్యవసాయ సంబంధిత ఆచారాలకు ప్రసిద్ధి.
మరిన్ని ఆచారాలు:
ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు గాలిపటాలు ఎగరేస్తారు. అదొక వేడుకలా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వదిన మరుదులకు రాఖీ కట్టే ఆచారమూ ఉంటుంది. ఇప్పుడు మారుతున్న కాలంలో అక్కా చెల్లెళ్లు, అన్నా దమ్ముల్లు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకుంటున్నారు. వాళ్ల బంధాన్ని వేడుకలా జరుపుకుంటున్నారు.