Kothimeera Podi: టేస్టీ కొత్తిమీర పొడి ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024


Kothimeera Podi: తాజా కొత్తిమీర ఆకులతో చేసే చట్నీ ఎంత రుచిగా ఉంటుందో, అలాగే కొత్తిమీర పొడి కూడా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారి చేసుకుంటే వారం పది రోజులు పాటు తినవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పొడి, ఒక స్పూను నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఎవరైనా దీనికి అభిమాని అయిపోవాల్సిందే. కొత్తిమీర పొడి చేయడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము, ఫాలో అయిపోండి.

కొత్తిమీర పొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కొత్తిమీర తరుగు – పావు కిలో

మినప్పప్పు – మూడు స్పూన్లు

శనగపప్పు – మూడు స్పూన్లు

ఎండుమిర్చి – ఎనిమిది

ఇంగువ – చిటికెడు

చింతపండు – ఒక నిమ్మకాయ సైజులో

నూనె – ఒక స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర పొడి రెసిపీ

1. కొత్తిమీర పొడి చేసేందుకు కేవలం ఆకులనే కాదు, కాండాన్ని కూడా వాడుకోవచ్చు.

2. వాటిని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఒక వార్తాపత్రికపై వాటిని విడివిడిగా చల్లి గాలికి ఆరబెట్టాలి.

3. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఆరబెడితే చాలు. అవి పొడిగా మారిపోతాయి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఆ ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు నూనెలో మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.

7. స్టవ్ చిన్న మంట మీద ఉంచి ముందుగా ఆరబెట్టుకున్న కొత్తిమీరను ఆకులను వేసి వేయించుకోవాలి.

8. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.

9. మిక్సీ గిన్నెలో కొత్తిమీర ఆకుల మిశ్రమం, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి రుబ్బుకోవాలి.

10. అది పొడిలా అయ్యాక గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరచుకోవాలి.

11. మీకు ఇష్టమైతే అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేయొచ్చు.

12. గాలి చొరబడని కంటైనర్లో వేస్తే ఈ కొత్తిమీర పొడి వారం నుంచి పది రోజులు పాటు తాజాగా ఉంటుంది.

13. దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అప్పుడు తాజాదనం బయటికి పోకుండా లోపల లాక్ అవుతుంది.

కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగాక వాటిని గాలికి ఆరబెట్టకపోతే త్వరగా నల్లగా మారిపోయే అవకాశం ఉంది. వీలైతే కొత్తిమీర ఆకులను బాగా కడిగి చేత్తోనే పిండి ఒక కాటన్ క్లాత్లో వేసి మెత్తగా ఆ క్లాత్‌తో ఒత్తండి. అవి నీటిని త్వరగా పీల్చుకుంటుంది. తర్వాత వార్తాపత్రికి పై వేసి ఆరబెట్టండి. అలా అయితే కొత్తిమీర త్వరగా ఎండిపోతుంది. కొత్తిమీరలో తడి ఉంటే… కొత్తిమీర పొడి పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. కొత్తిమీరలో ఉండే పోషకాలు అన్నీ కొత్తిమీర పొడిలో కూడా ఉంటాయి. కాబట్టి కొత్తిమీర పొడి ఆరోగ్యానికి మేలే చేస్తుంది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024