Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మరో ట్విస్ట్ ఉండనుందా? ఆలస్యం తప్పదా!

Best Web Hosting Provider In India 2024


మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చరణ్ అభిమానులు సహా సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ మూడేళ్లుగా సాగుతోంది. ఇప్పటికీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ మాత్రం ఖరారు కాలేదు. ఈ మూవీ కోసం రామ్ చరణ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే, చిత్రీకరణ విషయంలో ఓ ట్విస్ట్ ఎదురవుతోందనే సమాచారం చక్కర్లు కొడుతోంది.

రీషూట్ కావాలంటున్న శంకర్!

గేమ్ ఛేంజర్ సినిమా కోసం కొన్ని సీన్లను మళ్లీ షూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రఫ్ కట్స్ చూసిన శంకర్.. కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తే మరింత మెరుగ్గా వస్తాయని అనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు రీషూట్స్ కోసం నిర్మాత దిల్‍రాజును కూడా శంకర్ సంప్రదించాలని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం చక్కర్లు కొడుతోంది.

రామ్‍చరణ్‍ను రీషూట్ కోసం ఒప్పించాలని నిర్మాత దిల్‍రాజును శంకర్ అడిగారట. ఈ విషయంపై అధికారికంగా సమాచారం రాకపోయినా.. సినీ సర్కిళ్లలో హాట్ టాపిక్‍గా మారింది. దీంతో డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ వస్తుందని భావిస్తుండగా.. మళ్లీ ట్విస్ట్ ఎదురవుతుందా అనే సందిగ్ధత నెలకొంది.

చరణ్ అంగీకరిస్తారా?

గేమ్ ఛేంజర్ మూవీలో కొన్ని సీన్ల రీషూట్ కోసం శంకర్ అడిగినా.. రామ్‍చరణ్ అంగీకరిస్తారా అనే సందేహం ఉంది. మూడేళ్ల నుంచి ఇదే ప్రాజెక్టుపై చరణ్ ఉన్నారు. మధ్యలో ఆచార్య మూవీ ఒక్కటే చేశారు. ఎక్కువ శాతం గేమ్ ఛేంజర్ మూవీకే సమయం కేటాయించారు. ఇటీవలే ఈ మూవీ కోసం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా కోసం రామ్‍చరణ్ సిద్ధమవుతున్నారు. లుక్ కూడా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ రీషూట్ అంటే చరణ్ అంగీకరిస్తారా అనేది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది.

ఆలస్యమవుతుందా!

గేమ్ ఛేంజర్ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవలే ప్రకటించారు. అయితే, ఒకవేళ సినిమా రీషూట్ జరిగితే ఆలస్యమవుతుందనే ఆందోళన చరణ్ అభిమానుల్లో నెలకొంది. షూటింగ్ తుదిదశకు చేరిన సమయంలో మళ్లీ రీషూట్స్ అంటే మూవీ ఎప్పటికి వస్తుందో అనే టెన్షన్ కొనసాగే అవకాశం ఉంటుంది. మరి గేమ్ ఛేంజర్ సినిమా రీషూట్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, సునీల్, సుమద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండో పాట త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు ఆఖరులో దీనిపై అప్‍డేట్ వస్తుందని ఇటీవలే థమన్ హింట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు అంచనాలు ఉన్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024