Best Web Hosting Provider In India 2024
Krishnashtami Prasadam: కృష్ణాష్టమికి ప్రసాదంగా ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? శ్రీకృష్ణుడికి వెన్న,పాలుతో పాటు అటుకులతో చేసే ఆహారాలు కూడా బాగా నచ్చుతాయి. ఇక్కడ మేము అటుకులతో సింపుల్‌గా చేసే నైవేద్యాల రెసిపీ ఇచ్చాము. ఇవి చేయడానికి కేవలం పావుగంట సమయం సరిపోతుంది. సమయం తక్కువగా ఉన్న మహిళలకు ఈ రెసిపీలు ఎంతో ఉపయోగపడతాయి.
అటుకులు కొబ్బరి బర్ఫీ రెసిపీ
కావాల్సిన పదార్థాలు
అటుకులు – ఒక కప్పు
కొబ్బరి పాలు – రెండున్నర కప్పులు
బెల్లం తురుము – రెండు కప్పులు
నీళ్లు – ఒక కప్పు
యాలకుల పొడి – చిటికెడు
అటుకులు కొబ్బరిపాల బర్ఫీ రెసిపీ
1. అటుకులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
2. కొబ్బరి ముక్కల్లోంచి కొబ్బరి పాలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఆ కొబ్బరి పాలలో ముందుగా పొడి చేసి పెట్టుకున్నా అటుకుల మిశ్రమాన్ని వేసి నానబెట్టుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం వేయాలి.
5. ఆ బెల్లం కరగడానికి నీళ్లను కూడా వేసి ఉడికించాలి.
6. బెల్లం కాస్త చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
7. ఆ బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి ఈ బెల్లం నీటిని వేయాలి.
9. అవి వేడెక్కాక అందులో అటుకులు, కొబ్బరిపాల మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
10. అందులోనే యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
11. ఇది మొత్తం చిక్కగా హల్వాలాగా దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉంచి కలుపుతూనే ఉండాలి.
12. తర్వాత ఒక ప్లేటుకి కింద నెయ్యిని రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి చల్లబరచాలి.
13. అది కాస్త చల్లబడ్డాక ముక్కలుగా కోసుకోవాలి. అంతే అటుకుల కొబ్బరిపాల బర్ఫీ రెడీ అయినట్టే. ఇది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ.
…………………………………..………………………………
అటుకుల కొబ్బరిపాల పాయసం రెసిపీ
కావాల్సిన పదార్థాలు
అటుకులు – ఒక కప్పు
కొబ్బరి పాలు – రెండు కప్పులు
అరటి పండ్లు – రెండు
యాలకుల పొడి – చిటికెడు
డ్రై ఫ్రూట్ – గుప్పెడు
అటుకుల కొబ్బరిపాల పాయసం రెసిపీ
1. అటుకులను శుభ్రంగా కడిగి అందులో నీళ్లు వేసి నానబెట్టుకోవాలి.
2. తరువాత నీళ్లు వంపేసి అటుకులను వేరు చేయాలి.
3. ఒక గిన్నెలో ఈ అటుకులను వేసి ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను వేసి బాగా కలుపుకోవాలి.
4. అందులోనే బెల్లం తురుమును వేసి బాగా కరగనివ్వాలి.
5. తర్వాత బాగా పండిన అరటిపండును చేత్తోనే చిన్న ముక్కలుగా మెదిపి అందులో వేసి కలుపుకోవాలి.
6. చిటికెడు యాలకుల పొడిని వేసుకోవాలి.
7. గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను సన్నగా తరిగి అందులో కలుపుకోవాలి.
8. అంతే టేస్టీ అటుకుల కొబ్బరిపాల పాయసం రెడీ అయినట్టే.
9. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికి స్టవ్ అవసరం లేదు.
10. కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కృష్ణుడికి ఇష్టమైన వంటకాలలో ఇది ఒకటి.
………………………..………………………………………….
అటుకులు పెసరపప్పు పాయసం రెసిపీ
కావలసిన పదార్థాలు
అటుకులు – ఒక కప్పు
పెసరపప్పు – ఒక కప్పు
నెయ్యి – రెండు స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు
బెల్లం – ఒక కప్పు
యాలకుల పొడి – అర స్పూను
పాల పొడి – నాలుగు స్పూన్లు
ఉప్పు – చిటికెడు
అటుకులు పెసరపప్పు పాయసం రెసిపీ
1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. పెసరపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి.
3. కనీసం రెండు గంటల పాటు పెసరపప్పు నానితేనే బాగా ఉడుకుతుంది.
4. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత మిగిలిన నెయ్యిలో అటుకులను వేసి వేయించుకోవాలి.
5. ఈలోపు నానబెట్టిన పెసరపప్పును స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి.
6. అటుకులను వేయించాక ఉడుకుతున్న పెసరపప్పును నీళ్లతో సహా ఈ అటుకుల్లో వేసేయాలి.
7. ఇప్పుడు సన్నగా తరిగిన బెల్లం తురుమును, నాలుగు స్పూన్ల మిల్క్ పౌడర్‌ను, అర స్పూను యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇది పాయసంలా చిక్కగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి.
9. చివర్లో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను పైన చల్లుకోవాలి.
10. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ అటుకులు పెసరపప్పు పాయసం రెడీ అయినట్టే.
పైన చెప్పిన రెసిపీలలో మీకు నచ్చిన నైవేద్యాన్ని ఎంపిక చేసుకొని కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి నివేదించండి. ఓపిక ఉంటే ఈ మూడూ కూడా చేసుకోండి. ఇవి చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పైగా ఎంతో సింపుల్ కూడా.
టాపిక్