N Convention: ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేశారు.. ఇప్పుడు మా పరిస్థితి ఏంటీ.. బాధితుల ఆందోళన

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్డులో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ నేలమట్టం చేశారు. ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం ఎన్ కన్వెన్షన్‌ను బుక్ చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు. చాలా రోజుల కిందట పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకొని.. ఎన్ కన్వెన్షన్‌ను బుక్ చేసుకున్నామని.. ఇప్పుడు దాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వేదిక ఎలా..

పెళ్లిళ్లు చేయడానికి ఇప్పటికిప్పుడు మళ్లీ కొత్త వేదిక ఎలా దొరుకుతుందని బుక్ చేసుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఫంక్షన్ల కోసం ఎన్ కన్వెన్షన్‌ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంట్లో పెళ్లి, ఫంక్షన్ చేయాలంటే.. రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అటు బుక్ చేసుకున్న వారు కొంత మొత్తం అడ్వాన్స్ చెల్లించారు. ఇప్పుడు దాన్ని కూల్చివేయడంతో.. తమ అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బుక్ చేసుకున్న వారు కోరుతున్నారు.

అత్యాధునిక హంగులతో..

ఎన్3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ కింద ఎన్ కన్వెన్షన్ నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్‌ వ్యవస్థాపక పార్ట్‌నర్ హీరో నాగార్జున. 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. పిల్లర్లు లేకుండా హైసీలింగ్‌లో ఈ బిల్డింగ్ నిర్మించారు. 2 నుంచి 3 వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఏర్పాటు చేశారు. 300 నుంచి 450 సీట్లతో డైమండ్ హాల్ ఉంటుంది. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనయన్ హాల్ నిర్మించారు. 2015 ఆగస్ట్ 20 నుంచి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇక్కడ సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహణ జరుగుతోంది.

హైడ్రా రిపోర్ట్..

కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలను కూల్చివేసినట్టు స్పష్టం చేసింది. చింతల్‌లో బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్‌లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్‌లో వివరించింది.

సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

‘చెరువులను ఆక్రమించేవాళ్లను వదిలిపెట్టం. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదు. చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. ఫాంహౌస్‌ల డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలిపారు. మీ విలాసం కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా.. అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కబ్జాదారులను వదలం. ప్రకృతి సంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది. చెన్నై, వాయనాడ్‌లో ప్రకృతి ప్రకోపాన్ని చూశాం. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టాపిక్

Telangana NewsNagarjunaHyderabadTs PoliceCrime News

Source / Credits

Best Web Hosting Provider In India 2024