Best Web Hosting Provider In India 2024
ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే సదర్ మాట్ బ్యారేజీ అతిపురాతనమైంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కంటే ముందు గోదావరి నది పైన బ్రిటిష్ వారు 1892లో నిర్మించారు. ఎంతో చరిత్ర ఉన్న ప్రాజెక్టును అత్యాధునికంగా నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం. ఎగువన ఎక్కువ నీరు ఆగేలా చర్యలు చేపట్టింది. ఈ కొత్త ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది.
త్వరలోనే ప్రారంభం…!
పాత ఆనకట్టకు ఎగువన గోదావరి నదిపై చేపట్టిన ఈ సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనలు పూర్తయ్యాయి. 24 అడుగులు మట్టం, 1.58 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజీకి 55 గేట్లు అమర్చారు. గేట్లకు సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం గేట్లు జనరేటర్ సహాయంతో పనిచేస్తున్నాయి. ఈసారి ఖరీఫ్ ప్రారంభంలోనే ఆయకట్టుకు విడుదలవుతున్నప్పటికీ…. అధికారికంగా సెప్టెంబర్ నెలలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
రెండు పంటలకు అవకాశం…!
సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన క్రమంలో ఖానాపూర్, కడెం రైతులకు ప్రతి ఏటా రెండు పంటలు పండించే అవకాశం కలుగుతుంది. గతంలో ఎస్సారెస్పీ లీకేజీ వాటర్ ఆధారంగా నిండే పాత సదర్మాట్ ఆనకట్టకు ఇక నుంచి ఆ దుస్థితి ఉండదు. మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో నిర్మించిన బ్యారేజీ నీరు… పాత సదర్మాట్ ఆనకట్టలోకి సమృద్ధిగా వచ్చి చేరుతుంది.
దీంతో ఖానాపూర్, ఉమ్మడి కడెం మండలాల గ్రామాల పరిధిలోని సుమారు 14 వేల ఎకరాలు నీటి ఎద్దడి లేకుండా సాగయ్యే అవకాశం ఉంది. అలాగే జగిత్యాల జిల్లా గంగనాల మినీ ప్రాజెక్టు ఫీడింగ్ అవుతుంది. ఈ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. అలాగే అవసరమైనప్పుడు కడెం ప్రాజెక్టు ఫీడింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
గతంలో నీటి సమస్య ఎదురైన సమయంలో గంగనాల ప్రాంత రైతులు సదర్మాట్ ఆనకట్టలోకి నీరు రాకుండా నదికి అడ్డుగా రాళ్ల కట్టలు వేసి తరలించుకుపోయే వారు. దీంతో ఖానాపూర్, గంగనాల ప్రాంత రైతుల మధ్యన సమస్య తలెత్తేది. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన క్రమంలో ఇక నుంచి ఆ సమస్య తీరనుంది.
ఆనందంలో రైతులు…!
బ్యారేజీ నిర్మాణం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఆయకట్టు రైతులు ఎదురు చూశారు. ఎన్నోసార్లు పాలకులకు మొర పెట్టుకున్నారు. రైతుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ అప్పట్లో పాత సదర్మాట్ ఆనకట్టను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులు ప్రతీ ఏటా ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను తెలుసుకున్న ఆయన బ్యారేజీ నిర్మాణం కోసం సర్వే చేయించి రూ.317 కోట్లు నిధులు మంజూరు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త ప్రభుత్వం రావటంతో… రీసర్వే తధితర కారణాల నేపథ్యంలో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పాత సదర్మాట్ ఆనకట్ట ప్రాంతంలో కాకుండా స్థలం మార్చి ఎగువన 7 కీలోమీటర్ల దూరంలో సర్వే చేయించి… రూ.517 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2017లో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం పూర్తి కావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రిపోర్టింగ్: కామాజి వేణుగోపాల్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.
టాపిక్