Flood ALERT : ఏపీలో మళ్లీ దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాకు వరద ముప్పు!

Best Web Hosting Provider In India 2024


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు వచ్చింది. లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇటు ధవలేశ్వరం బ్యారేజ్‌ 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6.40 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు వివరించారు. బ్యారేజ్‌ ప్రస్తుత నీటిమట్టం 9.30 అడుగులు ఉంది.

లోతట్టు ప్రాంతాల్లో అలెర్ట్..

అటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాలకు వరద ముప్పు ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటు బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో.. రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. కోనసీమ, కాకినాడ, యానాం, విశాఖపట్నం సహా ఇతర జిల్లాల్లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సోమవారం వరకూ..

నెల్లూరు, కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉంది. సెప్టెంబరు 9 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో అల్పపీడనంగా మారుతుంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని అధికారులు భావిస్తున్నారు.

కృష్ణా నదికి వరద..

ఇటు బెజవాడలో వరద తగ్గుముఖం పడుతుంది. గండ్లు పూడ్చడంతో బెజవాడకు బుడమేరు వరద తగ్గింది. కేఎల్‌రావు నగర్‌, సాయిరాం సెంటర్‌, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో వరద ఉధృతి ఇంకా ఉంది. మరోవైపు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

టాపిక్

Ap RainsGodavari FloodsVijayawada FloodsEast GodavariSrikakulamKonaseema

Source / Credits

Best Web Hosting Provider In India 2024