Rythu Bandhu Scheme : ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు – రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు (రైతు భరోసా) స్కీమ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. సాగు చేయని భూములకు పంట పెట్టుబడి సాయం అందించారని… తమ ప్రభుత్వం మాత్రం అలా చేయదని స్పష్టం చేస్తూ వచ్చింది.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ లోనే రైతుబంధు నిధులను విడుదల చేశారు. కొత్తగా సర్కార్ ఏర్పడటంతో మార్పులకు సమయం దొరకలేదు. దీంతో పాత నిబంధనల మేరకు నిధులు జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో గుంటల నుంచి ఎకరాల వారీగా జమ చేస్తూ వచ్చింది. తాజాగా వర్షాకాలం సీజన్ రావటంతో మరోసారి ఈ నిధులపై చర్చ జరుగుతోంది.

రైతు బంధు స్కీమ్ ను రైతు భరోసాగా మారుస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ స్కీమ్ లో తీసుకురావాల్సిన మార్పులపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల నుంచి సూచనలను స్వీకరించింది. త్వరలోనే ఈ స్కీమ్ కు సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

మంత్రి కీలక ప్రకటన..

ఈ క్రమంలోనే రైతుభరోసాపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం అలంపూర్ లో మాట్లాడిన ఆయన… పంట పెట్టుబడి సాయం కేవలం సాగు చేసిన భూములకే ఇస్తామని స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు ఇవ్వబోమని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులకు కూడా రైతుబంధు సాయాన్ని అందజేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పు చేయబోదన్నారు. పంట వేసే రైతులకే రైతు భరోసా సాయం అందుతుందని చెప్పారు.

ఇదే సమావేశంలో రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ కానివారికి ఈనెలఖారులోపు పూర్తి చేస్తామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్న రైతులు… ముందుగా ఎక్కువగా ఉన్న డబ్బులను చెల్లించాలని కోరారు. ఆ తర్వాత ప్రభుత్వం రూ. 2 లక్షలను జమ చేస్తుందని చెప్పారు. రూ. 31 వేల కోట్లతో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది.

ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎన్ని ఎకరాల లోపు వరకు ఈ స్కీమ్ ఇవ్వాలనేది కూడా కీలకంగా మారింది. పది ఎకరాలకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్ ఉందని తెలుస్తోంది.

టాపిక్

Rythu BharosaRythu Bandhu SchemeCrop LossCrop LoansTelangana NewsThummala Nageswara Rao

Source / Credits

Best Web Hosting Provider In India 2024