Suryapet Crime : ట్రాక్టర్ దొంగలు వస్తున్నారు.. రైతులారా తస్మాత్ జాగ్రత్త

Best Web Hosting Provider In India 2024


మద్దిరాల, సీసీ‌ఎస్ పోలీసులు నలుగురు దొంగలను పట్టుకున్నారు. నిందితులపై 18 ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం కేసులు ఉన్నట్టు గుర్తించారు. రైతుల ట్రాక్టర్ ట్రాలీలే లక్ష్యంగా దొంగతనాలు చేసినట్టు పోలీసులు వివరించారు. 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక బైక్, ఒక ట్రాక్టర్ ఇంజన్ స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 11 దొంగతనాలు, నల్గొండ జిల్లాలో 7 దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన వాహనాల మొత్తం విలువ రూ.22,92,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ‘నిందితులు గ్రామాలలో, పొలాల వద్ద రెక్కి చేస్తారు. పొలాల వద్ద, రోడ్ల పక్కన రైతులు పెట్టిన ట్రాక్టర్ ట్రక్కు లను గుర్తించి దొంగలిస్తారు. ఇలా దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్మేస్తారు’ అని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ వివరించారు.

13.09.2024 సాయంత్రం మద్దిరాల ఎస్‌ఐ తన సిబ్బందితో.. మద్దిరాల అడ్డ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుంటపల్లి వైపు నుంచి TS 05 FS 5840 నంబర్ పల్సర్ బైక్‌పై ఇద్దరు, స్వరాజ్ ట్రాక్టర్ ఇంజన్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని గమనించిన మద్దిరాల ఎస్‌ఐ. తన సిబ్బందితో కలిసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాస్త లోతుగా పోలీస్ స్టైల్‌లో ప్రశ్నించగా అసలు భండారం బయటపడింది.

నల్గొండ జిల్లాకు చెందిన నలుగురు నిందితులు.. సంపంగి మహేశ్, సంపంగి సత్యం, ఒర్సు వెంకన్న, అలకుంట్ల మహేశ్ కలిసి.. 2023 అక్టోబర్‌ నెలలో పోలుమళ్ల గ్రామం నుంచి చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాల్లో షెడ్స్‌లో ఉంచిన 2 ట్రాక్టర్‌ ట్రాలీలను దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీనిపై పోలుమళ్ల గ్రామానికి చెందిన ఎల్లు జగన్, రామారెడ్డి మద్దిరాల పీఎస్‌లో పిర్యాధు చేశారు. నిందితులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

విచారణలో భాగంగా.. మునగాల, పెన్‌పహడ్‌, మిర్యాలగూడ రూరల్‌, నాగారం, మద్దిరాల, గుర్రంపోడు, నూతనకల్‌, మోతె, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్‌, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ట్రాక్టర్ల ట్రాలీలు చోరీ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. 19 ట్రాక్టర్ ట్రాలీలు, ఒక ఇంజన్, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు.

నల్గొండ జిల్లా హాలియా మండలం మారేపల్లి గ్రామంలో ఓ నిందితుడి ఇంటి నుంచి 20 లక్షల 92 వేలు విలువైన.. 19 ట్రాలీలు, 2 లక్షల విలువగల ట్రాక్టర్ ఇంజన్, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 7 దొంగతనాలకు పాలడినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు చెప్పారు.

నిందితుల వివరాలు :

A1)సంపంగి మహేష్ వయస్సు, 24 సంవత్సరాలు, మారేపల్లి గ్రామం, హోలియా, మండలం, నల్గొండ జిల్లా.

A2)సంపంగి సత్యం, 28 సంవత్సరాలు, గోరెంకలపల్లి, నకిరేకల్, నల్గొండ జిల్లా.

A3)ఓర్సు వెంకన్న, వయస్సు: 27 సంవత్సరాలు, చెర్ల గౌరారం గ్రామం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా.

A4)ఆలకుంట్ల మహేష్, వయస్సు: 27 సంవత్సరాలు, మారేపల్లి, అనుముల మండలం. నల్గొండ జిల్లా.

టాపిక్

Crime NewsTs PoliceSuryapetFarmersNalgondaTelangana NewsTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024