Karimnagar Ganesh Nimajjanam : గంగమ్మ ఒడికి గణనాథుడు, కరీంనగర్ లో రెండు రోజులపాటు సాగిన నిమజ్జనోత్సవం

Best Web Hosting Provider In India 2024


Karimnagar Ganesh Nimajjanam : తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజుల పాటు నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. విభిన్న ఆకృతుల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో శోభాయాత్ర ద్వారా ఊరేగించారు. పోయిరావయ్య.. పోయిరావయ్య.. బొజ్జ గణపతయ్య…మళ్లీ వచ్చే ఏడాదికి తిరిగి రావయ్యా అంటూ గణనాధుడిని నీళ్లల్లో నిమజ్జనం చేసి వీడుకోలు పలికారు.

తొలి పూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడి నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య రెండు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 10325 గణేశుడి పెద్ద విగ్రహాలను అందంగా అలంకరరించిన వాహనాల్లో పురవీధుల గుండా ఊరేగించారు.‌ డప్పు చప్పుళ్లు, భోజనలు, కోలాటం, ఒగ్గుడోలు నృత్యాలు, డ్యాన్సులతో గణేషుడి శోభాయాత్ర సాగింది.‌ కరీంనగర్ లో జరిగిన గణేశుడు శోభాయాత్రలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ పమేల సత్పతి సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీ అభిషేక్ మోహంతి పాల్గొన్నారు.

బై బై గణేశా

తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో కొలిచిన గణనాథున్ని శోభయాత్రతో తీసుకెళ్లి సమీపంలోని చెరువులు కుంటల్లో నిమజ్జనం చేశారు భక్తులు. డీజే సౌండ్ ను పోలీసులు నిషేధించినప్పటికీ యువత మాత్రం డెక్ లు ఏర్పాటు చేసుకుని డప్పు నృత్యాలు చేశారు. గణపతి బొప్ప మోరియా.. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. అంటూ భక్తులు జయజయ ధ్వనులతో బొజ్జ గణపయ్యకు బై బై గణేశా అంటూ వీడ్కోలు పలికారు.

చైన్ స్నాచింగ్

గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. నగర సమీపంలోని దుర్శేడ్ గ్రామ శివారులో వినాయకుని నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మహిళా భోగ లక్ష్మీ మెడలో నుంచి రెండున్నర తులాలు బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. బైక్ పై వచ్చిన ఇద్దరు మెడలోని బంగారు గొలుసు లిక్కెళ్ళారని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చైన్ స్నాచింగ్ పై పోలీసులు విచారణ చేపట్టారు.

పలుచోట్ల స్వల్ప ఘర్షణలు

గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ లో పలు చోట్ల స్వల్ప ఘర్షణలు జరగగా పోలీసులు చదరగొట్టారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డులో గణేష్ నగర్ లోని వినాయకుడి విగ్రహం ఊరేగింపులో కొందరు ఆకతాయిలు డాన్స్ చేసేందుకు ప్రయత్నించగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు అడ్డుకున్నారు.‌ దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని వాగ్వాదంతో ఘర్షణ పడ్డారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని చెదరగొట్టి పరిస్థితిని చక్క దిద్దారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు అధికారులు భక్తజనులు ఊపిరి పీల్చుకున్నారు.‌

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం

టాపిక్

KarimnagarTelangana NewsTrending TelanganaTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024