UK Visa Fraud : యూకే వీసాలు ఇప్పిస్తామ‌ని భారీ మోసం, నిరుద్యోగ యువ‌త వ‌ద్ద కోట్లలో కాజేసిన వైనం

Best Web Hosting Provider In India 2024


గుంటూరుకు చెందిన ఒక క‌న్సల్టెన్సీ కంపెనీ భారీ మోసానికి ఒడిగ‌ట్టింది. యూకే వీసాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగ యువ‌త‌ను మోసం చేసి వారి వ‌ద్ద నుంచి కోట్లలో సొమ్మును కాజేసింది. వీసాలు, నియామ‌క ప‌త్రాలు న‌కిలీవ‌ని తేల‌డంతో చివ‌ర‌కు ఎంబ‌సీ సుమారు ప‌ది మంది యువ‌కుల‌పై ప‌దేళ్ల పాటు వీసా తీసుకోకుండా నిషేధం విధించింది. దీంతో మోస‌పోయామ‌ని తెలిసి నిల‌దీయ‌డానికి నిర్వాహ‌కుడి ఇంటికి వెళ్తే, త‌నును బెదిరించి కొట్టడానికి త‌న ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేశార‌ని బాధితుల‌పైనే నిర్వాహ‌కుడి తిరిగి ఫిర్యాదు చేశాడు.

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో గుంటూరు అశోక్ న‌గ‌ర్ కేంద్రంగా ఏర్పాటైన క‌న్సల్టెన్సీ కంపెనీ ల‌క్షల్లో తీసుకుని వీసాలు, జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చింది. అందరూ క‌లిసి దాదాపు రూ.10 కోట్లకుపైనే చెల్లించారు. వృద్ధుల‌కు సేవ చేయాల‌నుకునే వారికి ప‌లు దేశాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకు అవ‌స‌ర‌మైన వీసా, ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మబ‌లికి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేసింది. తీరా వారికి ఇచ్చిన వీసాలు, ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు న‌కిలీవ‌ని తేల‌డంతో ఎంబ‌సీ అధికారులు సుమారు ప‌ది మంది యువ‌కుల‌పై ప‌దేళ్ల పాటు నిషేధం విధించారు. ఇందులో గుంటూరుకు చెంద‌ని ఇద్దరు యువ‌కులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మోస‌పోయిన వారు వంద‌ల సంఖ్యలో ఉన్నారు.

క‌న్స‌ల్టెన్సీ కంపెనీ ఇచ్చిన వీసాలు, నియామ‌క ప‌త్రాలు చెల్ల‌వ‌ని తెలుసుకుని ఈ ఏడాది జులై నుంచి గుంటూరులోని న‌గ‌రంపాలెం, న‌ల్ల‌పాడు, ప‌ట్టాభిపురం స్టేష‌న్ ప‌రిధిలో కొంద‌రు యువ‌కులు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేసి మిన్నకుండిపోయారు. స‌మాధానం చెప్ప‌కుండా క‌న్స‌ల్టెన్సీ నిర్వాహ‌కులు మొహం చాటేశాడు. ప్ర‌శ్నించేందుకు కొంద‌రు యువ‌కులు గుంటూరులోని ఓ నిర్వాహ‌కుడి ఇంటికి వెళ్లారు. త‌న‌ను బెదిరించి కొట్ట‌డానికి వ‌చ్చార‌ని, ఇంట్లో వారిపై దౌర్జ‌న్యం చేశార‌ని న‌ల్ల‌పాడు పోలీసు స్టేష‌న్‌లో నిర్వాహ‌కుడు కేసు న‌మోదు చేశారు.

క‌న్సల్టెన్సీకి చేసిన చెల్లింపుల‌ను ఆధారాల‌తో స‌హా పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా నిర్వాహ‌కుల‌పై కేసు న‌మోదు చేయ‌లేద‌ని, సామ‌ర‌స్యంగా ప‌రిష్కరించుకోవాల‌ని సూచించి పంపించేశార‌ని బాధితుడు అప్పిరెడ్డి అనిల్‌రెడ్డి అన్నారు. వారి మోసం వ‌ల్ల త‌న‌కు వీసా రాకుండా ప‌దేళ్లు నిషేధం విధించార‌ని వాపోయాడు. మ‌రో బాధితుడు గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన శ‌ర‌త్ వీసాకు రూ.12 ల‌క్షలు ఖ‌ర్చు అవుతుంద‌ని నిర్వాహ‌కుడు ల‌క్ష్మీశెట్టి జ‌య‌రాంతో ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని, చెక్కు రూపంలో రూ.4.50 ల‌క్షలు, ఆన్‌లైన్‌లో మ‌రో రూ.2 ల‌క్షలు చెల్లించామ‌ని తెలిపారు.

స‌గం డ‌బ్బులు చెల్లించాక సీఓఎస్ వ‌స్తుంద‌ని, అది రాగానే మిగిలిన మొత్తం చెల్లించాల‌ని చెప్పార‌ని, తీరా సీఓఎస్ ప‌ట్టుకుని హైద‌రాబాద్‌లోని వీసా కార్యాల‌యానికి వెళ్తే న‌కిలీద‌ని తేలిన‌ట్లు చెప్పారు. దానిపై తాము నిల‌దీసి, తాము చెల్లించిన డ‌బ్బులు త‌మ‌కు వెన‌క్కి ఇవ్వాల‌ని కోరితే ఆత్మహ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించార‌ని తెలిపాడు. ఈ మోసంపై తాను న‌గ‌రంపాలెం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాన‌ని, ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలు లేవ‌ని అన్నారు.

జ‌గదీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం

టాపిక్

GunturCrime ApAndhra Pradesh NewsTelugu NewsTrending Ap

Source / Credits

Best Web Hosting Provider In India 2024