RG Kar hospital: ఆర్జీ కర్ ఆసుపత్రిలో సీల్డ్ బాక్సుల్లో రక్తపు మరకలున్న సర్జికల్ గ్లౌజులు

Best Web Hosting Provider In India 2024


RG Kar hospital: ఇటీవల ట్రైనీ డాక్టర్ పై హత్యాచారంతో వార్తల్లోకి ఎక్కిన కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కొన్ని సెట్ల సర్జికల్ గ్లౌజుల్లో రక్తపు మరకలు కనిపించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం విచారణకు ఆదేశించింది. ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్లో హెచ్ఐవీ రోగికి చికిత్స అందిస్తున్న ఇంటర్న్ డాక్టర్.. క్యాబినెట్లో ఉంచిన బాక్స్ నుంచి తాజా సర్జికల్ గ్లౌజులను బయటకు తీస్తున్న సమయంలో, ఇలా రక్తపు మరకలు ఉన్న సర్జికల్ గ్లవ్స్ ను చూశారు. దాంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

చాలా బాక్స్ ల్లో రక్తపు మరకలున్న గ్లవ్స్

‘‘రోగికి చికిత్స చేయడం కోసం నేను బాక్స్ నుండి ఒక జత సర్జికల్ గ్లౌజులను బయటకు తీశాను. వాటిపై ఎర్రటి రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో పొరపాటున ఉపయోగించిన గ్లౌజులను పెట్టెలో ఉంచి రెండో జతను బయటకు తీసి ఉంటారని అనుకున్నాను. అయితే, ఒక జత గ్లవ్స్ కు కాకుండా, చాలా జతలపై ఇలాంటి రక్తపు మరకలు కనిపించాయి’’ అని ఆ ఇంటర్న్ డాక్టర్ తెలిపారు. రక్తపు మరకలు ఉన్న గ్లవ్స్ ఉన్న సీల్డ్ బాక్స్ లు రెండు, మూడు ఉన్నాయని వెల్లడించాడు.

విచారణకు ఆదేశం

ఈ ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ‘‘మాకు దీనిపై ఫిర్యాదులు అందాయి. విచారణకు ఆదేశించాము. లాట్ (గ్లౌజులున్న పెట్టెలు) మార్చారని ప్రాథమికంగా భావిస్తున్నాం. ఇతర బాక్సులను కూడా తనిఖీ చేశారు. అందులో గ్లవ్స్ బాగానే ఉన్నాయి. రక్తపు మరకలున్న గ్లవ్స్ ను ఉన్న పెట్టెను సీల్ చేసి తొలగించారు. అవి రక్తపు మరకలు కాదా అని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ విభాగం పరిశీలిస్తోంది” అని నిగమ్ చెప్పారు.

హత్యాచారంపై నిరసన

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా పశ్చిమబెంగాల్ లోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు ఆగస్టు 9 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఆస్పత్రుల్లో భద్రత పెంచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని పది డిమాండ్లు చేశారు.

Best Web Hosting Provider In India 2024



Source link