Devara Collections: రూ.500 కోట్ల మార్క్ దాటిన దేవర.. ఎన్టీఆర్ స్టార్‌డమ్ పవర్ ఇది!

Best Web Hosting Provider In India 2024


మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి కలెక్షన్లు ఇంకా జోరుగా వస్తున్నాయి. సెప్టెంబర్ 27న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు బాగానే దక్కుతున్నాయి. దీంతో తాజాగా దేవర మూవీ అదిరిపోయే మైల్‍స్టోన్ దాటేసింది.

రూ.500 కోట్లు

దేవర సినిమా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 16 రోజుల్లోనే ఈ మార్క్ దాటేసింది. సోలో హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ఈ ఫీట్ సాధించారు. రూ.500 కోట్లను అధిగమించినట్టు దేవర టీమ్ నేడు (అక్టోబర్ 13) అధికారికంగా వెల్లడించింది.

బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ కలెక్షన్ల ఊచకోత అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “రక్తపు సముద్రం, విధ్వంసపు తీరం. ఎన్టీఆర్ ఊచకోతతో దేవర చిత్రం రూ.500కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్లను దాటేసింది. ఈ వేట అన్‍స్టాపబుల్‍గా ఉంటుందని చెప్పేసింది” అని ట్వీట్ చేసింది.

ఎన్టీఆర్ స్టామినా ఇది!

దేవర చిత్రానికి రిలీజైన రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ యాక్టింగ్‍పై ప్రశంసలు కురిసినా.. కథ, కథనంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ అంచనాలను తగ్గట్టుగా లేదంటూ టాక్ వినిపించింది. మొత్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం దేవర పరుగు ఆగలేదు. అప్పడప్పుడూ డ్రాప్ అయినా మళ్లీ పుంజుకుంది.

మిక్స్డ్ టాక్ వచ్చినా దేవర చిత్రం రూ.500కోట్ల మార్క్ దాటేందుకు ఎన్టీఆర్ స్టార్‌డమ్ ముఖ్య కారణంగా నిలిచింది. మాస్‍లో ఆయనకు క్రేజ్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంటుంది. ఇంటెన్స్ యాక్షన్, రెండు పాత్రల్లో యాక్టింగ్ వేరియేషన్, డ్యాన్స్ ఇలా దేవర మూవీలో ఎన్టీఆర్ అన్ని విషయాల్లో అదరగొట్టారు. దీంతో మూవీకి అనుకున్న టాక్ రాకపోయినా ఎన్టీఆర్ స్టార్ పవర్, పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులు ఈ మూవీని భారీగా చూశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‍లో ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. హిందీలో మంచి కలెక్షన్లు వచ్చేందుకు ఇది కూడా తోడ్పడింది. సోలో హీరోగా ఎన్టీఆర్‌కు దేవరనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీగా ఉంది.

దేవర సినిమా ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి అడుగుపెట్టింది. కాగా, పోటీగా ఏ పెద్ద సినిమా రాకపోవటం కూడా దేవరకు కలిసి వచ్చింది. కొన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దసరా సెలవులు కూడా కలిసి వచ్చాయి. దీంతో దేవర మూవీ ఇంకా కలెక్షన్లను బాగానే రాబడుతోంది. మంచి థియేట్రికల్ రన్ సాధిస్తోంది.

దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించగా.. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రఫీ చేశారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024