Breast Cancer Awareness Month: పురుషులకూ రొమ్ము క్యాన్సర్ వస్తుంది.. దాని లక్షణాలు, కారణాలివే

Best Web Hosting Provider In India 2024


రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, దానికి కారణాలు, నివారణ, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణకు కావాల్సిన పరిశోధన కోసం నిధులను సేకరించే లక్ష్యంతో అక్టోబర్ ను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కానీ ఇది పురుషులకు కూడా రావచ్చు. ఈ వ్యాధి లక్షణాలు పురుషుల్లో ఎలా ఉంటాయి, దానికి కారణాలు, నివారణ మార్గాలు తెల్సుకోవాల్సిందే.

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్:

రొమ్ము క్యాన్సర్ అంటే మహిళలకు వచ్చే వ్యాధిగానే పరిగణిస్తారు. కానీ పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ రావచ్చు. అరుదుగా అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 0.5–1 శాతం పురుషుల రొమ్ము క్యాన్సర్ కేసులున్నాయి. పురుషుల రొమ్ము కణజాలం పరిమాణం చిన్నగా ఉన్నా కూడా అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు పురుషుల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.

పురుషులలో రొమ్ము క్యాన్సర్ అసాధారణం అయినప్పటికీ, లక్షణాలు, ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. మహిళల మాదిరిగానే పురుషులు కూడా వారి ఛాతీని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. అన్ని క్యాన్సర్ల మాదిరిగానే దీన్ని కూడా ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ చికిత్స మహిళల మాదిరిగానే ఉంటుంది. క్యాన్సర్ దశను బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీని చేస్తారు.

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు:

1. వాపు: రొమ్ము లేదా ఛాతీ ప్రాంతంలో నొప్పిలేని గడ్డ లేదా చర్మం మందంగా అనిపించడం సాధారణ లక్షణాల్లో ఒకటి.

2. రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో మార్పులు: ఇందులో ఒక వైపు వాపు రావడం లేదా రొమ్ము ముడుచుకు పోయినట్లు ఉంటుంది.

3. చనుమొన: చనుమొనల్లో ఎరుపుదనం, పొలుసులుగా చర్మం ఊడటం లేదా చనుమొన లోపలకు వెళ్లినట్లు అవ్వడం లాంటి లక్షణాలుంటాయి. అలాగే చనుమొనల నుంచి ఏదైనా ద్రవం రావడం, ముఖ్యంగా రక్తం ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

కారణాలు

1. వయస్సు: వయస్సుతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రమాదం ఎక్కువ.

2. కుటుంబ చరిత్ర: రొమ్ము క్యాన్సర్ ఉన్నవాళ్లు కుటుంబంలో ఉంటే చరిత్ర ప్రమాదాన్ని పెంచుతుంది.

3. జన్యు ఉత్పరివర్తనలు: బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 వంటి జన్యువుల్లో వంశపారంపర్యంగా ఉత్పరివర్తనాలు సంభవిస్తాయి.

4. హార్మోన్ల అసమతుల్యత: కాలేయ వ్యాధి లేదా ఊబకాయం వంటి ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచే పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి.

జాగ్రత్తలు

1. క్రమం తప్పకుండా స్వీయ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము కణజాలం లేదా ఛాతీ ప్రాంతంలో ఏదైనా అసాధారణతలను గుర్తించడానికి పురుషులు క్రమం తప్పకుండా స్వీయ పరీక్షలు చేయాలి.

2. కుటుంబ చరిత్రపై అవగాహన ఉండాలి. మీ కుటుంబం క్యాన్సర్ చరిత్రను తెలుసుకోవడం, వైద్యుడితో చర్చించడం ముఖ్యం. వైద్యులు అవసరమైతే ముందస్తు స్క్రీనింగ్‌ చేస్తారు.

3. ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయండి. అధికంగా తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

4. ఆరోగ్యకరమైన బరువులో ఉండండి. ఊబకాయం అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రమాదానికి దోహదం చేస్తుంది.

5. టెస్టోస్టెరాన్ స్థాయిలను సరిగ్గా ఉంచుకోవాలి. తక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న పురుషులు హార్మోన్ల మార్పులను నిశితంగా పర్యవేక్షించాలి. ఎందుకంటే ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

నివారణ

1. ఆరోగ్యకరమైన జీవనశైలి: సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

2. రెగ్యులర్ స్క్రీనింగ్లు: కుటుంబ చరిత్ర లేదా జన్యు ఉత్పరివర్తనల కారణంగా అధిక ప్రమాదం ఉన్న పురుషులు మామోగ్రామ్లు లేదా జన్యు పరీక్ష వంటి స్క్రీనింగ్ కోసం వైద్యులతో చర్చించాలి.

3. హార్మోన్ల అసమతుల్యతకు ముందస్తు చికిత్స: హైపోగోనాడిజం లేదా కాలేయ పరిస్థితులు వంటి హార్మోన్ల రుగ్మతలను ముందుగానే పరిష్కరించుకోవడం వల్ల ప్రమాద కారకాలను తగ్గించడం సాధ్యం అవుతుంది.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024