AP Liquor Shop Lottery 2024 : ఏపీలో ముగిసిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ.. ఎల్లుండి నుంచి లిక్కర్ కిక్కు స్టార్ట్!

Best Web Hosting Provider In India 2024


ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. మొత్తం 3 వేల 396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసింది. డ్రాలో విజేతలకు అధికారులు లైసెన్స్‌ ఇవ్వనున్నారు. ఏపీలో బుధవారం (16వ తేదీ) నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇటు సోమవారం జరిగిన లాటరీ ప్రక్రియ చాలా చోట్ల జాతరను తలపించింది. లాటరీ తీసే కేంద్రాలకు ఆశావహులు భారీగా తరలివచ్చారు.

ఏపీలో మొత్తం 3396 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా.. 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వ అంచనాలకు మించి దరఖాస్తు రుసుం ద్వారా దాదాపు రూ.1800 కోట్ల ఆదాయం వచ్చింది.

ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. డ్రా పద్ధతిలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి.

ఈనెల 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పట్లో 4 వేల 380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మొత్తం 76 వేల దరఖాస్తులు వచ్చాయి.

2017లో ఒక్కో దుకాణానికి సగటున 17 నుంచి 18 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌ రుసుముల రూపంలో 2017లో రూ.474 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అప్పటికంటే తక్కువ దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.

భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద ఎమ్మార్పీలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం సవరణ చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

టాపిక్

LiquorExcise PolicyTrending ApAndhra Pradesh News

Source / Credits

Best Web Hosting Provider In India 2024