Bhadradri Police Deaths : భద్రాద్రి ఖాకీ వనంలో ఆత్మహత్యల కలకలం, వంద రోజుల్లో ముగ్గురు పోలీసులు బలవన్మరణం

Best Web Hosting Provider In India 2024


ఖాకీ వనంలో వరుస ఆత్మహత్యల పరంపర కల్లోలం రేపుతోంది. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించే పోలీసులే గుండె చెదిరి నిలువునా ఉసురు తీసుకుంటున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆత్మహత్యలు పోలీస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వంద రోజుల వ్యవధిలో జిల్లాలో ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఆత్మ హత్య చేసుకోవడంతో జిల్లాలో పోలీసులకేమైందనే చర్చ మొదలైంది. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో సాగర్ అనే కానిస్టేబుల్ సెల్ఫీ ఆత్మహత్య తాజాగా తీవ్ర చర్చకు కారణమైంది.

ఇదీ పరిస్థితి..

భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ జూన్ 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత చనిపోయాడు. ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది తనను కించపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాస్ పెట్టిన సెల్ఫీ వీడియో అప్పుడు రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. ఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనే పని చేస్తున్న కొందరు సిబ్బందితో పాటు ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ కావడం, స్టేషన్లో కొందరు సిబ్బంది చెప్పిందే వేదంగా మారడంతో ఆఫీసర్లు, సిబ్బంది మధ్య మిస్ అండర్ స్టాండింగ్ నెలకొంది. ఈ క్రమంలో వంద రోజుల్లో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య చేసుకున్నారు. సిబ్బంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్న ట్టు ఎస్సై సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

ఆ తర్వాత రమణా రెడ్డి

ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య నుంచి జిల్లా పోలీసులు తేరుకోక ముందే క్లూస్ టీంలో పనిచేస్తున్న రమణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నా డు. పాల్వంచలో నివాసం ఉంటూ క్లూస్ టీంలో పని చేస్తున్న కానిస్టేబుల్ రమణారెడ్డి సెప్టెంబర్ లో ఆత్మహత్య చేసుకున్నారు. “తట్టుకోలేని కష్టాలు నాకే వస్తున్నాయి.. కుటుంబ సమస్యలతో సతమత మవుతున్నాను. మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను.” అంటూ ఆయన తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

తాజాగా సాగర్

తాజాగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సాగర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లా పోలీస్ శాఖలో సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్లో గంజాయి మాయమైన కేసులో తనను పోలీస్ ఆఫీసర్లు అక్రమంగా ఇరికించారని, ఎస్సైలు సంతోష్, రాజ్ కుమార్ ఇందుకు బాధ్యులని, అన్యాయంగా తనను ఇబ్బందులు పెట్టారని సెల్ఫీ వీడియోలో ఆరోపించిన సాగర్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. సాగర్ చికిత్స పొందుతూ మృతి చెందడంతో భద్రాద్రి పోలీస్ శాఖలో మరింత గుబులు మొదలైంది.

కౌన్సిలింగ్ అవసరం

వరుస ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే అవగాహన సదస్సులు పెట్టించాల్సిన అవసరం ఉందనే వాదన పోలీస్ శాఖలో వినిపిస్తోంది. పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందులు, పర్యవేక్షణపై పర్సనాలిటీ డెవలప్మెంట్ పై పలు సూచనలు ఇవాల్సి ఉంది. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొంటున్నారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లతో పాటు సిబ్బంది ఎప్పుడైనా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించానని చెబుతున్నారు. బూర్గంపాడు కానిస్టేబుల్ సాగర్ కుటుంబ సభ్యులు, ఆయన విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో ఈ నెల 8న సస్పెన్షన్ వేటు ఎత్తివేశామని, పోస్టింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే సమస్య పరిష్కారం అయ్యేదని పేర్కొన్నారు. తొందర పాటుతో ప్రాణం పోగొట్టుకోవడం బాధగా ఉందని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి, ఖమ్మం.

సంబంధిత కథనం

టాపిక్

Ts PoliceBhadradri KothagudemTelangana NewsTrending TelanganaTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024