TG Mlc Elections : ఊపందుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థిని ప్రకటించిన యూటీఎఫ్

Best Web Hosting Provider In India 2024

పన్నెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ, నల్గొండ జిల్లాకు చెందిన యూటీఎఫ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎ.నర్సిరెడ్డి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నవంబరు 6వ తేదీ నాటికి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముగియనుంది. అదే నెల 23వ తేదీన ముసాయిదా ఓటరు లిస్టును ప్రకటిస్తారు. టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు జిల్లాల పరిధిలో 20,898 మంది టీచర్ ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఓటరు లిస్ట్ ను పూర్తిగా రద్దు చేసి కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియను మొదలు పెట్టింది.

అభ్యర్థిని ప్రకటించిన యూటీఎఫ్

వచ్చే ఏడాది మార్చితో సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తవుతోంది. అంటే, ఫిబ్రవరిలోగా ఎన్నికను పూర్తి చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఓటర్ల నమోదు మొదలు పెట్టింది. ఎన్నికలకు కేవలం మూడు నాలుగు నెలల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు యూటీఎఫ్ ముందు అడుగు వేసింది. తమ సంఘం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డినే తమ అభ్యర్థిగా అధికారికంగా ఇప్పటికే ప్రకటించింది. గత 2019 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పీఆర్టీయూ అభ్యర్థిగా బరిలో నిలిచిన, నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మద్దతు తెలిపిన పూల రవీందర్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ప్రధాన పోటీ యూటీఎఫ్, పీఆర్టీయూల మధ్యనే కొనసాగే వీలుందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అభ్యర్థులను ప్రకటించాల్సిన ఇతర టీచర్ యూనియన్లు

నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు పీఆర్టీయూ సైతం అన్ని రకాలుగా శక్తులను ఒడ్డుతుంది. కానీ, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన గలాట, టీచర్ లీడర్లు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడం వంటి సంఘటనలు పీఆర్టీయూలో ఉన్న అభిప్రాయ భేదాలను, నాయకుల మధ్య ఉన్న టికెట్ పోటీని తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో యూనియన్ అధికారికంగా ఒక అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆశావహుల్లో కనీసం ఒకరిద్దరు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసే వీలుంది. గత ఎన్నికల్లో అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ రెండోసారి పోటీ చేస్తే యూనియన్ చెందిన వరంగల్ జిల్లా నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి రెబల్ పోటీ చేయడంతో పూల రవీందర్ ఓడిపోయారు. దీంతో పీఆర్టీయూ చేతి నుంచి ఎమ్మెల్సీ స్థానం యూటీఎఫ్ చేతిలోకి వెళ్ళింది. ఈ సారి కూడా పీఆర్టీయూ నుంచి పూల రవీందర్, శ్రీపాల్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్ వంటి నాయకులు టికెట్ రేసులో ఉన్నారని చెబుతున్నారు. మరో వైపు టీపీఆర్టీయూ, టీపీయూఎస్, టీపీఆర్టీయూ వంటి సంఘాలు సైతం పోటీ చేసే యోచనలో ఉన్నాయి.

పునరుద్ధరణ తర్వాత నాలుగో ఎన్నిక

శాసన మండలిని పునరుద్ధరించిన తర్వాత టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరుగుతున్న నాలుగో ఎన్నిక ఇది. ఉమ్మడి ఏపీలో శాసన మండలిని పునరుద్దరించిన తర్వాత 2007లో జరిగిన తొలి ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీగా విద్యావేత్త చుక్కా రామయ్య విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో ఉమ్మడి ఏపీలోనే జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి పూల రవీందర్ గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014) తర్వాత 2019లో జరిగిన తొలి ఎన్నికల్లో యూటీఎఫ్ నుంచి ఎ. నర్సిరెడ్డి గెలిచారు. ఇపుడు 2025 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆశలు పెట్టుకున్నాయి. కాగా, ఇప్పటి వరకు యూటీఎఫ్ మాత్రమే తమ అభ్యర్థిని ప్రకటించింది. కొత్త ఓటర్ల నమోదు పూర్తయ్యే నాటికి ఇతర సంఘాలూ అభ్యర్థులను ప్రకటించే వీలుంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTelangana Mlc ElectionsWarangalKhammamNalgondaTrending TelanganaTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024