AP TG Roads: తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌… రోడ్ల నిర్మాణానికి నిధులు, ఏపీకి 400, తెలంగాణకు 516కోట్లు

Best Web Hosting Provider In India 2024

AP TG Roads: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్‌) పథకం కింద మొత్తం 200.06 కిలో మీట‌ర్ల మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసిన‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సేతు బంధన్ పథకంలో భాగంగా, గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో నాలుగో లైన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి రూ.98 కోట్లను ఆమోదించామ‌ని తెలిపారు.

తెలంగాణ‌కు రూ.516 కోట్లు మంజూరు

తెలంగాణ–ఏపీని కలిపే కీలకమైన జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌)– 565 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ టౌన్ బైపాస్ కు సంబంధించిన నాలుగు లేన్ల రహదారి నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు కలిపే 14 కిలో‌ మీటర్ల నేషనల్ హైవే మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

తెలంగాణలో ఎన్ హెచ్– 565లోని నకిరేకల్ నుండి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు నల్గొండ టౌన్ కోసం 14 కిలో మీటర్ల పొడవు… 4-లేన్ బైపాస్ నిర్మాణానికి రూ. 516 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ –565 తెలంగాణ– ఏపీలను కలిపే కీలకమైన జాతీయ రహదారిగా వెల్లడించారు.

ఈ రూట్ తెలంగాణలోని నకిరేకల్ వద్ద ఉన్న ఎన్ హెచ్– 65 జంక్షన్ నుండి ప్రారంభమై నల్గొండ– మాచర్ల– ఎర్రగొండపాలెం – కనిగిరి పట్టణాల మీదుగా వెళుతుందని వివరించారు. ప్రస్తుతం నల్గొండ టౌన్ భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది కి గురవుతుందని, దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయాణీకులు అవస్తలు పడాల్సి వవస్తుందని తెలిపారు. అయితే కేంద్ర తీసుకున్న ఈ కొత్త ప్రాజెక్ట్ నల్గొండలో ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా… నకిరేకల్ – నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని వెల్లడించారు. అలాగే రహదారి భద్రతను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్ప‌టికే కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీ, తెలంగాణ‌కు నిధులు

కేంద్ర పన్నుల్లో వాటా కింద రెండు తెలుగు రాష్ట్రాలకు గురువారం (అక్టోబర్ 10న) నిధులను విడుదల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలకు గాను రూ.1,78,173 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల కోసం 15 ఆర్థిక సంఘం నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శ‌నివారం (అక్టోబ‌ర్ 12న‌) విడుద‌ల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.988 కోట్లకుపైగా మొదటి విడతగా విడుదలైంది. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్ర‌టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్ఎల్‌బీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ‌ ఆర్థిక సంఘం గ్రాంట్‌ల మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు అన్‌టైడ్ గ్రాంట్లు మొత్తం రూ.395.5091 కోట్లు, టైడ్ గ్రాంట్‌లు మొత్తం రూ.593.2639 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా ఎన్నికైన తొమ్మిది అర్హతగల జిల్లా పంచాయతీలు, 615 అర్హతగల బ్లాక్ పంచాయతీలు, 12,853 అర్హతగల గ్రామ పంచాయతీలకు సంబంధించినవని కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ‌ పేర్కొంది.

(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

Government Of IndiaNitin GadkariAndhra Pradesh NewsTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024