Best Web Hosting Provider In India 2024
ఇంట్లో పెళ్లికి, దగ్గర బంధువుల వేడుకలకు రకరకాల ఫేషియల్స్ ట్రై చేస్తారు. ముఖ్యంగా తెల్లగా కనిపించడానికి ముఖానికి బ్లీచ్ చేయించుకుంటారు. బ్లీచ్ ముఖంపై ఉన్న ట్యాన్ తొలగించి చర్మానికి కొత్త మెరుపు తీసుకొస్తుంది. అయితే బ్యూటీ పార్లర్ లో చేసే బ్లీచ్‌లో కెమికల్స్ లేకుండా ఉండవు. ఇంట్లోనే కొన్ని పదార్థాలకు అలాంటి లక్షణాలే ఉన్నాయి. వాటిని వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. పెళ్లి కూతుర్లు కూడా మీ ముఖ్యమైన రోజున మెరిసిపోడానికి ఈ బ్లీచ్ ట్రై చేసి చూడండి. పక్కాగా పనిచేస్తుంది. ఇప్పుడు రెండు రకాల బ్లీచ్‌లు ఎలా తయారు చేయాలో చూద్దాం.
1. పసుపుతో:
దీన్ని తయారు చేయడానికి 1 టీస్పూన్ కస్తూరీ పసుపు పొడి, 1 టీస్పూన్ నారింజ తొక్కలను ఎండబెట్టి చేసిన పొడి, చల్లటి నీరు అవసరం అవుతాయి.
కస్తూరీ పసుపుకు, సాధారణ పసుపుకు తేడా ఉంటుంది. దీన్ని వంటల్లో వాడరు. కేవలం చర్మ సౌందర్యం కోసం వాడతారు. మామూలు పసుపు లాగా ఇది ముఖానికి పెట్టుకుంటే ఎలాంటి పచ్చదనం రాదు. ఈ పసుపు సువాసనలు వెదజల్లుతుంది. దీన్నే కస్తూరీ మంజల్ అనీ అంటారు. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే రోజూవారీ స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకున్నా లాభాలుంటాయి. దీన్ని వారానికి రెండు మూడు సార్లు రాసుకున్నా మంచి లాభాలుంటాయి. దీంతో బ్లీచ్ ఎలా చేయాలో చూడండి.
తయారుచేసే విధానం:
ఇప్పుడు కస్తూరీ పసుపు, నారింజ తొక్కల పొడికి గిన్నెలో తీసుకుని కొద్దిగా చల్లని నీళ్లు కలపాలి. మెత్తని పేస్ట్ తయారు చేసుకుని ముఖానికి అంతటా రాసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బ్లీచ్ నల్లమచ్చలను తొలగించి సహజసిద్ధమైన మెరుపును ఇవ్వడానికి సాయపడుతుంది. నారింజ తొక్క చర్మ ఆరోగ్యానికి, టాన్ తొలిగించడానికి, మొటిమలను తగ్గించడానికి తోడ్పడుతుంది.
2) బంగాళదుంపతో:
ఈ బ్లీచ్ తయారు చేయడానికి టమాటా, దోసకాయ, బంగాళాదుంప ఉంటే సరిపోతుందంతే.
తయారుచేసే విధానం: ఈ బ్లీచ్ తయారీకి టమాటాలు, బంగాళాదుంపలు, దోసకాయలను మిక్సీ పట్టి దేనికదే పిండేసి రసం తీయాలి. తరువాత వాటన్నింటినీ సమాన పరిమాణంలో కలపండి. ఇప్పుడు ఈ రసాన్ని ముఖానికి బాగా అప్లై చేయాలి. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థానికి బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని వారానికి రెండు సార్లయినా రాసుకోవచ్చు.
బంగాళదుంపల్లో ఎంజైమ్లు, విటమిన్ సి, కోజిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మం రంగును పెంచడంలో, నల్ల మచ్చల సమస్యలను తగ్గించడంలో సాయపడతాయి. అలాగే నలుపు రంగుకు కారణమైన మిలనిన్ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. టమాటాల్లో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా మారుస్తాయి.