Prof Saibaba Death : ప్రొఫెసర్ సాయిబాబా మృతి.. సంతాపం తెలిపిన మావోయిస్టు పార్టీ

Best Web Hosting Provider In India 2024

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో.. మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబను 2014లో ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆయన ఈ కేసులో దాదాపు పదేళ్ల పాటు మహారాష్ట్రలోని నాగపూర్‌లో జైలు జీవితం గడిపారు.

బాంబే హైకోర్టు సాయిబాబాను ఈ ఏడాది మార్చిలో నిర్ధోషిగా విడుదల చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిబాబా.. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని తెలియజేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదలైంది.

ప్రకటన సారాంశం ఇదీ..

‘పౌర హక్కులను పరిరక్షించడానికి.. ప్రజల తరపున గొంతెత్తిన సాయిబాబాను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు రాజ్యమే పథకం ప్రకారం హత్య చేసింది. ఢిల్లిలో ప్రొఫెసర్‌గా కొనసాగుతూ మలి దశ తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్దేశం చేశారు. 1997 డిసెంబర్‌లో ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం (ఎఐపిఆర్ఎఫ్ ) ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సభలోనే వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆ సదస్సుకు జీఎన్ సాయిబాబా నాయకత్వం వహించారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

‘ఏఐపిఆర్ఎఫ్‌లో కొనసాగుతూ ప్రజల ప్రాథమిక హక్కుల పరి రక్షణకై సాయిబాబా పోరాడాడు. ఫోరం ఎగైనెస్ట్ వార్ ఇన్ పీపుల్స్ వేదికలో క్రియాశీలంగా పని చేస్తూ.. సామ్రాజ్యవాదుల, కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దేశ సంపదను, ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి దేశ ప్రజలపై, ప్రధానంగా ఆదివాసీ ప్రజలపై సల్వాజుడుం, గ్రీన్ హంట్ పేర్లతో సాగుతున్న పాశవిక దాడులను ఖండించాడు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

‘దేశంలో పాశవికంగా కొనసాగుతున్న రాజ్య హింసను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాడు. ప్రజాస్వామిక బద్దంగా ప్రశ్నించడం, ప్రశ్నించే శక్తులను తయారు చేయడం నేరంగా భావించిన రాజ్యం.. కుట్ర పూరితంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెగాసస్ వంటి మాల్వేర్ సాఫ్ట్ వేర్ల ద్వారా జీఎస్ సాయిబాబా కంప్యూటర్‌లో చొరబడింది. అందులో మావోయిస్టు సాహిత్యాన్ని చొప్పించి.. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని నిందారోపణ చేసి రాజ్యాంగ విరుద్ధ చట్టాలను అక్రమంగా మోపారు’ అని జగన్ ఆరోపించారు.

‘నిర్దోషిని, 90 శాతం అంగవైకల్యంతో కదల్లేని స్థితిలో వీల్ చైర్‌లో, ఒకరి మద్దుతు లేకుండా తన పని తాను చేసుకోలేని స్థితోలో ఉన్న జీఎన్ సాయిబాబాను అన్యాయంగా పది సంవత్సారాలు ఒంటరిగా అండా సెల్‌లో నిర్బంధించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా.. జైలులో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందకుండా చేశారు. చివరి దశలో నిర్దోషిగా నిరూపించబడి విడుదల చేయాలని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ.. ఎన్ఐఏ ఆయన విడుదలను అడ్డుకుంది. జైలులో దుర్భర పరిస్థితులను కల్పించి సాయిబాబా ఆరోగ్యం క్షీణించేలా చేశారు. సాయిబాబా మరణానికి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలే పూర్తి భాధ్యత వహించాలి’ జగన్ ప్రకటనలో డిమాండ్ చేశారు.

‘జీఎన్ సాయిబాబా పది సంవత్సరాలు ఒంటరిగా దుర్భర జీవితాన్ని అనుభవించినా.. ధృడ దీక్షతో చీకటి అమానవీయ చర్యలను ఎదుర్కొన్నాడు. ఫాసిస్టు పాలకులు ఎన్ని మానసిక చిత్రహింసలు పెట్టినప్పటికీ.. తాను ఏనాడు రాజీ పడలేదు. జైలులో ఖైదీల హక్కుల కోసం ధైర్యంగా పోరాడాడు. అత్యంత ధైర్యశాలి, మొక్కవోని ధైర్యంతో రాజ్యాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక వాది, బుద్ధి జీవి. అంగవైకల్యాన్ని లెక్క చేయక నిలబడిన ప్రజల పక్షపాతికి మరొక్కసారి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి విన్నమంగా జోహార్లు అర్పిస్తున్నది’ జగన్ ప్రకటనలో పేర్కొన్నారు.

(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్)

Whats_app_banner

టాపిక్

Cpi TelanganaCpm TelanganaTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024