Best Web Hosting Provider In India 2024
మీరు రోజూ ఏ వేళకి మధ్యాహ్నం భోజనం చేస్తారు? ఈ ప్రశ్నకి చాలా మంది కరెక్ట్‌గా సమాధానం చెప్పలేరు. దానికి కారణం.. మనం రోజూ ఒకే వేళకి భోజనం చేయలేకపోతుండటమే. పని ఒత్తిడి, ఆఫీస్ వాతావరణం, ఆకలి లేకపోవడం ఇలా కారణం ఏదైనా కావచ్చు. కానీ.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒకవేళకి భోజనం చేయడం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు.
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కోసం నిపుణులు సూచించిన సమయాల్ని ఒకసారి పరిశీలిస్తే..
- టిఫిన్‌ను ఉదయం 7:00 గంటల నుంచి 9:00 గంటలలోపు తినేయాలి
- మధ్యాహ్నం భోజనాన్ని 12:30 గంటల నుంచి 2:00 గంటల్లోపు తినేయాలి
- రాత్రి భోజనాన్ని రాత్రి 7:00 గంటల నుంచి 8:30 గంటల్లోపు తినడం మంచిది
ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయడం వల్ల శరీరం దానికి అలవాటుపడి.. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఒకవేళ లేటుగా తింటే.. జీర్ణక్రియ సమస్యలు, అధిక బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
టిఫిన్ ఎలా ఉండాలి?
టిఫిన్ సమయానికి తినకపోతే ఆకలి అదుపులో ఉండదు. దాంతో ఆ ప్రభావం లంచ్‌పై పడి అధికంగా తినే అవకాశముంది. చాలా మంది ఆఫీస్‌కి లేట్ అవుతుందని టిఫిన్‌ను అవాయిడ్ చేస్తుంటారు. ఇలా ఉదయం టిఫిన్ తినకపోవడం వల్ల మెటబాలిజం మందగించడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
టిఫిన్ ప్రోటీన్లు, ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకుంటే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శక్తి ఉంటుంది. ఉదయం మజ్జిగ, దొస, లేదా ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు శరీరానికి మరింత బలాన్ని ఇస్తాయి.
లంచ్ మెనూ ఇలా ఉంటే..
మధ్యాహ్నం భోజనంలో మన శరీరానికి కావలసిన కేలరీలను మనం ఇవ్వాలి. లంచ్‌లోకి సలాడ్, రొట్టె, కూరగాయలు, పప్పులు లాంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు ఇతర పోషకాలు అందుతాయి.
లంచ్ ఆలస్యం అయితే ఆకలి అదుపులో లేకుండా అధికంగా తినే ప్రమాదం ఉంటుంది. లేటుగా లంచ్ చేస్తే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు మారిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దెబ్బతింటాయి. దీని వలన మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
డిన్నర్ తీసుకునేటప్పుడు జాగ్రత్త
డిన్నర్ ఆలస్యంగా తీసుకుంటే, ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ తీసుకుంటే మీ జీర్ణక్రియ మందగించి పేగు సమస్యలు, అధిక బరువు సమస్యలు తలెత్తుతాయి.
భోజనం తర్వాత నిద్రకు కనీసం 2 గంటల గ్యాప్ లేకపోతే, నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. రాత్రిపూట కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, శరీరం సరైన సమయంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఉదాహరణకు పాలకూర పప్పు, చపాతి, సూప్ లాంటి తేలికపాటి భోజనం శరీరానికి సులభంగా జీర్ణమవుతుంది.
టైమ్‌ను ఫాలో అవ్వండి
భోజనాన్ని ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణతో పాటు ఆరోగ్యం మన కంట్రోల్‌లో ఉంటుంది. అలా కాకుండా ఒక్కో రోజు ఒక్కో సమయంలో మనం భోజనం తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆకలి కూడా మన కంట్రోల్‌లో ఉండదు. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం మెటబాలిజాన్ని పెంచుతుంది.