Karimnagar News : యజమాని మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన శునకం

Best Web Hosting Provider In India 2024

విశ్వాసం గల శునకం, పెంచిన వారిపట్ల ఎంత ప్రేమాభిమానం చూపుతుందో కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. తనను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన యాజమాని ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన మరణాన్ని తట్టుకోలేక శునకం మౌనంగా రోదిస్తూ యజమాని ఫోటో దగ్గర నుంచి కదలలేదు. చివరకు ప్రాణాలు వదిలి యాజమాని పట్ల విశ్వాసం అంతకు మించిన ప్రేమను చూపింది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి గత నెల 14న గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.‌ సమ్మిరెడ్డికి శునకాలు అంటే చాలా ఇష్టం. గత పన్నెండు సంవత్సరాల క్రితం క్యాచ్ ఫర్ ల్యాబ్ జాతికి చెందిన శునకాన్ని పెంచారు. ఎంతో ప్రేమగా ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూశారు. సమ్మిరెడ్డి సెప్టెంబర్ 14న గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆయన పెంచిన శునకం సమ్మిరెడ్డి మృతదేహం వద్ద నుంచి కదలలేదు.‌ మౌనంగా రోదిస్తూ ఫోటో వద్దనే పడిగాపులు కాచింది. సమ్మిరెడ్డి మృతితో ఇంటికి వచ్చి పరామర్శించే వారిని ఎంతో విచారంతో చూసేది. శునకం పడే బాధను చూచి బంధుమిత్రులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. శునకాన్ని సైతం ఓదార్చారు.

మనోవేదనతో నెల రోజులకు మృతి

యాజమాని మరణాన్ని జీర్ణించుకోలేని ఆ శునకం మౌనంగా రోదిస్తూ యజమాని ఫోటో దగ్గరి నుంచి కదలలేదు. సమ్మిరెడ్డి మృతి చెంది సరిగ్గా నెలరోజులకు ఈ నెల 14న రాత్రి శునకం ప్రాణాలు విడిచింది. సమ్మిరెడ్డి నెలమాషికం రోజున్నే శునకం ప్రాణాలు వదలడంతో కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శునకానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. యాజమాని పట్ల ఎంతో విశ్వాసం చూపిన శునకం మృతితో బంధుమిత్రులు సమ్మిరెడ్డి ఇంటికి చేరి నివాళులు అర్పించారు.

మనుషుల కంటే శునకాలే మేలు

తనను పెంచి పెద్ద చేసిన యాజమాని మరణాన్ని తట్టుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోయిన శునకాన్ని చూసి స్థానికులు మనుషుల కంటే శునకాలే మేలని అభిప్రాయపడ్డారు. యాజమాని పట్ల విశ్వాసం చూపిన ఆశునకానికి అశృనివాళులు అర్పించారు.సమాజంలో కొందరు కన్నవారిని పట్ల, కట్టుకున్నవారి పట్ల, కడుపున పుట్టిన వారి పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించే వారు ఈ శునకాన్ని చూసి నేర్చుకోవాలంటున్నారు. యాజమాని మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన శునకం బుద్ధిహీనంగా ప్రవర్తించే వారికి గుణపాఠమని అభిప్రాయపడుతున్నారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaKarimnagarCrime NewsTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024