Pocso Court: ప్రేమ‌పేరుతో బాలిక‌పై అత్యాచారం… నిందితుడికి ప‌దేళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు

Best Web Hosting Provider In India 2024

Pocso Court: ప్ర‌కాశం జిల్లా శింగ‌రాయ‌కొండ ప్రాంతానికి చెందిన మండే అనిల్ (22) బ‌తుకుదెరువు కోసం హైద‌రాబాద్‌కు వెళ్లాడు. అక్క‌డ వ‌న‌స్థ‌లిపురం శ్రీ‌నివాస‌పురం కాల‌నీలో తాపీ మేస్త్రీగా స్ధిర‌ప‌డ్డాడు. 2019లో ప్రేమ పేరుతో ఓ బాలిక (16)ను మ‌భ్య‌పెట్టి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. కొన్ని రోజుల త‌రువాత ఆమెను అప‌హ‌రించి వ‌న‌స్థ‌లిపురంలోని ఓ ఆల‌యంలో బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక కుటుంబ స‌భ్యుల ఫిర్యాదుతో వ‌న‌స్థ‌లిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నిందితుడిపై అత్యాచారం, అప‌హ‌ర‌ణ, పోక్సో కేసుల‌ను న‌మోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ జరిపిన త‌రువాత నిందితుడిని జ్యూడీషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ కేసును పోక్సో కోర్టుకు బ‌దిలీ చేశారు. కేసుపై పలుమార్లు విచారించిన రంగారెడ్డి జిల్లా ప్ర‌త్యేక పోక్సో న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తి ఎంకే ప‌ద్మావ‌తి మంగ‌ళ‌వారం తుది తీర్పు వెలువ‌రించారు.

నిందితుడు మండే అనిల్‌కు ప‌దేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.15,000 జ‌రిమానా కూడా విధించారు. బాధితురాలికి రూ. 10 లక్ష‌ల ప‌రిహారాన్ని మంజూరు చేశారు. నిందితుడు చెల్లించే జ‌రిమానాను బాధితురాలి వైద్యం, పున‌రావాసానికి వినియోగించాల‌ని తీర్పులో పేర్కొన్నార‌ని ప్ర‌త్యేక ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ సునీత తెలిపారు.

ప్రేమ పేరుతో మోస‌గించిన వ్య‌క్తిపై అట్రాసిటీ కేసు

త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి యువ‌తిని మోసం చేసిన యువ‌కుడిపై అట్రాసిటీ కేసు న‌మోదు అయింది. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని మెయిన్ బ‌జార్‌లో గ‌ల ఓ హోల్‌సేల్ దుకాణంలో స్థానిక కాల‌నీకి చెందిన యువ‌తి ప‌ని చేస్తోంది. అదే దుకాణంలో మ‌హ్మ‌ద్ హుస్సేన్ ప‌ని చేస్తున్నారు. ఏడాదిన్న‌ర కాలంగా వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పి ఆమెను న‌మ్మించాడు.

ప్రేమికుడు మాయ‌మాట‌లు న‌మ్మి అత‌ను ఏం చెబితే అదే చేసేది. ఈ క్ర‌మంలో ఆమెను శారీర‌కంగా క‌లిసేందుకు ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏడాదిన్న‌ర‌గా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. మాయ‌మాట‌లు చెప్పి ఆ యువ‌తిని మ‌హ్మ‌ద్ హుస్సేన్ చివ‌రికి లొంగ‌దీసుకున్నారు. ఇద్ద‌రూ శారీరంగా క‌లిసిన త‌రువాత‌, ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ్డాడు.

త‌ల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయితో ఈనెల 21న వివాహానికి సిద్ధ‌మ‌య్యాడు. దీంతో విష‌యం తెలుసుకున్న బాధిత యువ‌తి పోలీసుల‌కు మంగ‌ళ‌వారం ఫిర్యాదు చేసింది. పోలీసులు యువ‌కుడిపై అట్రాసిటీ కేసుతో పాటు ప‌లు సెక్ష‌న్ల‌తో కేసు న‌మోదు చేశారు. ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఆత్మ‌కూరు ఎస్ఐ జిలానీ తెలిపారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

Crime NewsCrime ApCrime TelanganaHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024