Husbands Secrets: భార్య దగ్గర భర్త దాచే సీక్రెట్స్ ఇవే, వాటిని అర్ధాంగిగా మీరు తెలుసుకోవడం ఎలా అంటే?

Best Web Hosting Provider In India 2024


కాపురం సజావుగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని పెద్దవాళ్లు చెప్తుంటారు. కానీ.. చాలా మంది భర్తలు తమ భార్యల దగ్గర కొన్ని విషయాలు మాత్రం దాస్తుంటారని మానసిక నిపుణులు చెప్తున్నారు. భార్య కోప్పడుతుందనే భయం లేదా అర్థం చేసుకోదేమో అనే ఆందోళన ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ భర్తలు మాత్రం చాలా విషయాల్ని భార్యల దగ్గర దాస్తారనేది మాత్రం నిజం.

మహిళలతో ఛాటింగ్

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ఎక్కువ అయిపోయాయి. కొంతమంది భర్తలు తమ భార్యలకి తెలియకుండా ఇతర మహిళలతో ఛాటింగ్, వీడియో కాల్స్, ఇమేజ్‌లు షేర్ చేయడం లాంటివి చేస్తుంటారు. వాస్తవానికి ఇవి అక్రమ సంబంధాలు అంతటి తీవ్రం కాకపోయినా.. ఎమోషనల్‌గా భార్యని మోసం చేసినట్లే. ఈ విషయాల్ని భార్యలకి తెలియకుండా భర్తలు జాగ్రత్తపడుతుంటారు.

అలవాట్లు లేదా వ్యసనాలు

కొంతమంది భర్తలు గేమింగ్, మద్యపానం, సిగరెట్ లేదా వేరే వ్యసనాలకు అలవాటు పడతారు. ఈ అలవాట్లు పెరుగుతున్నప్పుడు వాటి గురించి భార్యకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఆ వ్యసనం కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతున్నా భార్యకి మాత్రం చెప్పడానికి భర్తలు ఇష్టపడరు లేదా సాహసించరు.

జీతం, జాబ్ సెక్యూరిటీ

కొందరు భర్తలు తమ ఉద్యోగం, జీతం లేదా ఉద్యోగ భద్రత తదితర విషయాల్ని భార్యకు చెప్పకుండా దాచిపెడతారు. ఉదాహరణకు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు లేదా అప్పులు ఎక్కువగా పెరిగినప్పుడు కూడా అవి భార్యకు తెలియనీయకుండా భర్తలు జాగ్రత్తపడుతుంటారు. అలానే తాము అతిగా ఖర్చు చేస్తున్న విషయాల్ని కూడా భార్యలకి చాలా మంది భర్తలు చెప్పరు.

బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్

కొంత మంది భర్తలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భార్యకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లోనూ భార్యతో చర్చించకపోవడం.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. భార్యకి ఏమీ తెలియదనే అహం లేదా చెప్తే అడ్డుపడుతుందనే భయం ఇలా కారణం ఏదైనా కావొచ్చు. కానీ వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలు భార్యకి తెలియకుండానే చాలా మంది భర్తలు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత నష్టాలు వచ్చాక పశ్చాతాపం వ్యక్తం చేస్తుంటారు.

ఫ్రెండ్స్ గురించి

కొంత మంది భర్తలు భార్యకు తెలియనీయకుండా వేరే మహిళలతో స్నేహం కొనసాగిస్తారు. అది ఫ్రెండ్‌షిప్ మాత్రమే అయినా.. భార్య అనుమానిస్తుందేమో అనే భయంతో స్నేహితురాళ్ల గురించి భార్యకి చెప్పడానికి భర్తలు ఇష్టపడరు. ఆఖరికి దొరికిపోయే వరకూ భార్య దగ్గర గోప్యంగానే కొంత మంది భర్తలు ఉంచుతారు. చాలా మంది భర్తలు తమ ఫ్రెండ్స్‌తో కలిసే విషయాన్ని కూడా దాచేస్తుంటారు.

అక్రమ సంబంధాలు

కొంత మంది భర్తలు శారీరక ఆకర్షణ వల్ల ఇతర మహిళలతో సంబంధాలను కొనసాగిస్తారు. పెళ్లి జీవితంలో శారీరక సంతృప్తి లేకపోతే అది అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. ఈ విషయాల్ని భర్తలు అస్సలు భార్యకి చెప్పరు. భార్యకి అనుమానం వచ్చి ప్రశ్నించినా సరే సమాధానం దాట వేయడానికే ప్రయత్నిస్తారు తప్ప.. బంధాన్ని బహిర్గతం చేయరు.

అర్ధాంగిగా ఎలా తెలుసుకోవాలి?

మానసిక నిపుణులు ఏం చెప్తున్నారంటే.. భర్త అలవాట్లు, పోకడలపై భార్య నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. అలా అని ప్రతి విషయాన్ని అనుమానంతో చూడకూడదు. అలానే భర్త అభిప్రాయాలని గౌరవం ఇస్తూనే అతను స్వేచ్ఛగా ఏ విషయాన్నైనా మీ దగ్గర షేర్ చేసుకునే పరిస్థితిని కల్పించాలి. విషయం ఏదైనా భార్యకి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందని భర్తకి అనిపిస్తే తప్పకుండా చెప్తారు. కానీ.. చాదస్తం, అనుమానంతో భర్త చెప్పే ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ వెళ్తే.. మీ దగ్గర దాచే విషయాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024