Liquor Brands: ఏపీ మద్యం దుకాణాల్లో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు లభ్యం, ఐదేళ్ళుగా తప్పని నిరీక్షణ

Best Web Hosting Provider In India 2024


Liquor Brands: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో పాపులర్ బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 ప్రైవేట్ మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో మెల్లగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో దుకాణాలు తెరుచుకోకపోయినా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న వారి దుకాణాల్లో పాత బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి.

ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని ఎమ్మార్పీపై రెండు రెట్లు పెంచేసింది. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై పారింది. అక్రమ మద్యం రవాణాను నిరోధించడానికి సెబ్‌ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఏపీలో చుక్కలనంటే మద్యం ధరల్ని తట్టుకోలేక సరిహద్దు జిల్లాల్లో తాగడమో, తరలించడమో చేయడం మొదలైంది. దీంతో వేల సంఖ్యలో జనం సెబ్‌ నమోదు చేసిన కేసుల్లో ఇరుక్కున్నారు. మద్యం ధరలు పెరిగిపోవడంతో ప్రత్యామ్నయ మత్తు పదార్ధాల వినియోగం గణనీయంగా పెరిగింది.

పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలించడంపై ఆంక్షల్ని అమలు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ధరలు కాస్త తగ్గించింది. అయినా 2019 జూన్‌ ధరలతో పోలిస్తే 100శాతం పెంపును అమలు చేశారు. బీర్ల ధరలు దాదాపు 150-200శాతం పెరిగాయి. ఇంత చేసినా మద్యం బ్రాండ్లు మాత్రం మొదటి మూడున్నరేళ్లు ప్రభుత్వానికి నచ్చిన బ్రాండ్లు మాత్రమే విక్రయించేవారు. దీంతో మద్యం అలవాటు ఉన్న వారు బ్రాండ్లను మర్చిపోయి ప్రభుత్వం అమ్మేదానితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు వాటిని జే బ్రాండ్లుగా విస్తృత ప్రచారం కల్పించాయి.

పాతబ్రాండ్లకు చోటు…

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మద్యం దుకాణాలను ప్రారంభించారు. అక్టోబర్ 16 నుంచి ఇవి తెరుచుకున్నాయి. కొత్త దుకాణాల్లో పాత బ్రాండ్లకు చోటు దక్కింది. ఐదేళ్లుగా దుకాణాల్లో పెద్దగా కనిపించని రాయల్ స్టాట్, ఎంసీ విస్కీ, ఇంపీరియల్ బ్లూ, మాన్షన్ హౌస్, బ్లెండర్స్‌ స్పైడ్, మ్యాజిక్ మూమెంట్స్‌, బ్యాగ్‌ పైపర్‌, పాపులర్ బ్రాండ్ల ఒడ్కా, జిన్‌, రమ్‌ వంటి మద్యం వెరైటీలు దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. మద్యం ధరలు తగ్గకపోయినా తాము కోరుకున్న మద్యాన్ని అందుబాటులోకి తీసుకు రావడంపై మందుబాటులో కాస్త సంతోషం కనిపిస్తోంది.

కొత్త మద్యం విధానంలో రిటైల్ అవుట్ లెట్లకు సరఫరా చేయాల్సిన బ్రాండ్లను కొత్త ‘కంప్యూటర్ ఆధారిత మోడల్ ‘ నిర్ణయిస్తుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ మోడల్‌లో మార్కెట్ డిమాండ్ కు సంబంధించిన డేటాను విశ్లేషించి సప్లైను అ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరఫరాలను నిర్ణయిస్తుందని వివరించారు. డిమాండ్, సప్లయ్ డైనమిక్స్ ఆధారంగా నిర్ణయించే మార్కెట్ ఆధారిత విధానం అనుసరిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

2019-2024 మధ్య కాలంలో ఎక్కువగా అందుబాటులో లేని పెర్నోడ్ రికార్డ్, విలియం గ్రాంట్ అండ్ సన్స్ సహా పలు ప్రముఖ తయారీదారుల బ్రాండ్లు ఇప్పుడు ఏపీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎక్కువ అమ్మే బ్రాండ్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తామని ఆ అధికారి తెలిపారు.ఏపీలో ఇకపై రిజిస్టర్డ్ ప్రతి మద్యం బ్రాండ్ తమ ఉత్పత్తులను విక్రయించడానికి అవకాశం కల్పిస్తామని వివరించారు.

తొలుత లిక్కర్ బ్రాండ్లను మార్కెట్లో 10వేల కేసులను సరఫరా చేసేందుకు అనుమతిస్తామని, మార్కెట్ ఆధారిత మోడల్ ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా సప్లైలు పెంచుతామని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా జరిగిన మద్యం అమ్మకాల ఆధారంగా బ్రాండ్లకు అనుమతి ఇవ్వనున్నారు. కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లన్నీ రాష్ట్రంలోకి రావడం ప్రారంభించాయి.

వైసీపీ హయంలో అంతకు ముందు ఆదరణ పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, అధిక ధరలు గత వైసీపీ ప్రభుత్వంపై ప్రధాన ఆరోపణలుగా నిలిచాయి, మద్యం వినియోగదారులు ఎంపిక మరియు నాణ్యతను కోల్పోతున్నారని ఫిర్యాదు చేశారు. 2019-2024 మధ్య వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్లను ఎంచుకునే అవకాశాన్ని కోల్పోయారని, అందుబాటులో ఉన్న బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కె.రవీంద్ర అన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మద్యం రిటైల్ అమ్మకాలు, సేకరణ, నాణ్యత నియంత్రణ, ధరల విధానంలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికి అధికారులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించారని చెప్పారు.

ఎన్డీఏ ప్రభుత్వ మద్యం పాలసీ ప్రకారం వినియోగదారులు 180 ఎంఎల్ బాటిల్ మద్యాన్ని రూ.99కే కొనుగోలు చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంటుందని కొల్లు రవీంద్ర చెప్పారు. అన్ని మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులకు వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న 90 వేల మంది నుంచి రూ.1,800 కోట్ల దరఖాస్తు రుసుము వసూలు చేసి అక్టోబర్ 14న లాటరీ ద్వారా 3,396 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశారు. ప్రాంతాల వారీగా దరఖాస్తులను పరిమితం చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు విదేశాల నుంచి, దేశంలో నుంచి దరఖాస్తులు రావడం గమనార్హం.

2024-25 ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో లైసెన్సింగ్ ఫీజులు, మద్యం అమ్మకాల ద్వారా సుమారు రూ.20,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రానికి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు గతంలో ఆరోపించారు. పొరుగున ఉన్న తెలంగాణతో పోలిస్తే గత ఐదేళ్లలో (వైసీపీ ప్రభుత్వం) ఆంధ్రప్రదేశ్ రూ.42,762 కోట్ల మద్యం ఆదాయ వ్యత్యాసాన్ని చవిచూసిందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఏపీలో మద్యం ధరల్ని తగ్గిస్తామని టీడీపీ, జనసేనలు హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం దానిని నిలబెట్టుకోలేదు. వైసీపీ హయంలో ఉన్న ధరలనే దాదాపుగా కొనసాగిస్తున్నాయి.

Whats_app_banner

టాపిక్

LiquorGovernment Of Andhra PradeshChandrababu NaiduTdpJanasena

Source / Credits

Best Web Hosting Provider In India 2024