Egg pepper fry: పది నిమిషాల్లో రెడీ అయ్యే మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై, రెసిపీ ఇదిగోండి

Best Web Hosting Provider In India 2024

కోడిగుడ్లతో చేసే వంటకాలకు పిల్లలు, పెద్దలు అభిమానులే. ఎప్పుడూ ఒకేలాంటి కోడిగుడ్డు కూర, ఎగ్ కీమా వంటివి వండుకోకుండా ఓసారి ఎగ్ పెప్పర్ ఫ్రై ప్రయత్నించి చూడండి. ఇది కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కోడిగుడ్లు ఉడికించి ఉంటే చాలు, పప్పన్నం తిన్నప్పుడు, సాంబార్ తో అన్నం కలుపుకున్నప్పుడు పక్కన ఎగ్ పెప్పర్ ఫ్రై పెట్టుకుంటే సైడ్ డిష్ గా అదిరిపోతుంది. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే రెసిపీ. దీనిలో కోడిగుడ్లతో పాటు మిరియాల పొడిని కూడా వాడతాము. ఈ రెండూ కూడా పోషకాలు కలిగి ఉన్న పదార్థాలే. కాబట్టి ఎగ్ పెప్పర్ ఫ్రై అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు – మూడు

ఉల్లిపాయలు – రెండు

వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

అల్లం – చిన్న ముక్క

పసుపు – పావు స్పూను

మిరియాలు – ఒక స్పూను

ధనియాలు – ఒక స్పూను

టమోటో – ఒకటి

దాల్చిన చెక్క – చిన్న ముక్క

లవంగాలు – నాలుగు

యాలకులు – ఒకటి

కారంపొడి – అర స్పూను

నూనె – సరిపడినంత

ఉప్పు – రుచికి సరిపడా

జీలకర్ర – అర స్పూను

కొత్తిమీర తరుగు – ఒక స్పూను

పచ్చిమిర్చి – రెండు

ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ

1. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి నిలువుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, టమోటోలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మిరియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి వేయించుకోవాలి.

4. తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి.

5. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నూనె వేయాలి.

6. నూనె కాక పసుపు, కారం, ఉప్పు వేసి వేయించాలి.

7. ఇప్పుడు గుడ్డు ముక్కలను కూడా రెండు వైపులా తిప్పుతూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

8. ఇప్పుడు అదే కళాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేయాలి.

9. నూనె వేగాక ఉల్లిపాయల తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

11. ఇప్పుడు ముందుగా రుబ్బిన మసాలా ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.

12. ఇది ఉడకడానికి సరిపడా నీటిని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.

13. అందులోనే కోడిగుడ్లను కూడా వేసి ఇగురులా దగ్గరగా అయ్యేవరకు కలుపుకోవాలి.

14. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్టే. ఇది వండుతుంటేనే నోరూరిపోతుంది.

ఎగ్ పెప్పర్ ఫ్రై లో కొంచెం నీరు వేసి ఇగురు లాగా వండుకోవచ్చు. లేదా నీరంతా ఆవిరయ్యే వరకు ఉంచి వేపుడులా మార్చుకోవచ్చు. ఎలా వండుకోవాలన్నది మీ ఇష్టమే. ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలనే వాడాము కాబట్టి ఇది అన్ని రకాలుగా శరీరానికి మేలే చేస్తుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024