దేశంలోనే బలమైన పార్టీగా ఎదగాలి

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ వ‌ర్క్‌షాపులో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

సంస్థాగతంగా వ్యవస్థీకృత నిర్మాణంతోనే అది సాధ్యం

రాష్ట్రం నుంచి గ్రామం వరకు ప్రతి దశలో పటిష్ట నిర్మాణం

కమిటీలతో పార్టీ మరింత బలోపేతం

గ్రామస్ధాయిలోనూ అనుబంధ‌ విభాగాల ఏర్పాటు

పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజల కోసం పార్టీ పిలుపునిస్తే ఉవ్వెత్తున స్పందించేలా ఉండాలి

ఇప్పుడు కష్టపడే వాళ్లకే అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి

లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగిన సమయం

ఆ సమయం అవకాశం ఇస్తోంది. సద్వినియోగం చేసుకుందాం

పార్టీ నాయకుల పనితీరుపైనా ఎప్పటికప్పుడు నివేదికలు

వైయస్‌ జగన్‌ వెల్లడి

ప్రజల ముందుకు ఎప్పడైనా మనం తలెత్తుకుని వెళ్లగలం

ఆ పని తెలుగుదేశం వాళ్లు చేయలేరు

గ్రామస్థాయిలో పార్టీకి విస్తృతమైన నాయకత్వం ఉంది

పార్టీ నాయకులు ఎక్కడికక్కడ జనంతో మమేకం కావాలి

అన్యాయంపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి

పార్టీ నాయకులకు  వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం

నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం

ఈ ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 

అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది

ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

ఎన్నికల హామీలకు, ఇప్పటి పాలనకు సంబంధం లేదు

నాడు ఎన్నికల హామీలన్నీ మనం పక్కాగా అమలు చేశాం

ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు

అందుకే వార్షిక బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేదు

ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ బడ్జెట్‌తో నెట్టుకొస్తున్నారు

శాంతి భద్రల పరిరక్షణలో పూర్తిగా వైఫల్యం 

ఎక్కడ చూసినా, అన్ని రంగాల్లోనూ స్కాంలే

మద్యం టెండర్లలోనూ దారుణాలు.

షాపుల కోసం ఎమ్మెల్యేలే భయపెడుతున్నారు 

ప్రతి నియోజకవర్గంలో యథేచ్ఛగా పేకాట క్లబ్‌లు: గుర్తు చేసిన వైయస్‌ జగన్‌

విలువలు, విశ్వసనీయతే మన బలం

అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు 

ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది

మనం ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేశాం

చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు

ఒకవైపు ఈవీఎంల వ్యవహారం అలా ఉంది

మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓటమి

రాష్ట్రంలో పాలన, సంక్షేమం పూర్తిగా అస్తవ్యస్తం 

చెడిపోయిన వ్యవస్థపై మనం యుద్ధం చేస్తున్నాం

ఇది సోషల్‌ మీడియా కాలం. అదే అంతటా వ్యాప్తి

వాళ్లు అబద్ధాలు సృష్టిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు

మనం అంతకన్నా బలంగా తయారు కావాలి

అందుకు కమిటీల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండాలి

పార్టీ కమిటీలన్నీ ఆ మీడియాకు అనుసంధానం కావాలి

పూర్తి సమన్వయంతో అందరూ కలిసి పని చేయాలి

పార్టీ వర్క్‌షాప్‌లో వైయస్‌ జగన్‌ వెల్లడి

తాడేపల్లి: దేశంలోనే బలమైన పార్టీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ వర్క్‌షాపునకు  జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్టీ నాయ‌కుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. 

సమావేశంలో వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

వ్యవస్థీకృతంగా ముందుకు:
    ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది. మనలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవడానికి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. ఈ 15 ఏళ్లలో వివిధ రకాల ఎన్నికలు చూశాం. ప్రతిపక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ మన పార్టీ ఉంది. 15 ఏళ్లలో స్ధానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నాం. గ్రామ స్ధాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమైన విషయం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటాం. శాసససభ, పార్లమెంటుకు జమిలి అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం ఆర్గనైజ్డ్‌గా ఉంటేనే సమర్థంగా ఎదుర్కోగలం.
 
కమిటీలతో మరింత బలోపేతం:
    ఈరోజు మనం వేస్తున్న ఈ అడుగులు రాష్ట్రస్ధాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్ధాయి, మండల, గ్రామ స్ధాయి కమిటీల వరకూ ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశలో అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా విభాగం, విద్యార్ధి విభాగంతో పాటు విలేజ్‌ కమిటీ, బూత్‌ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. ఈ కమిటీల ఏర్పాటున్నది కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నెంబర్‌ వన్‌ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
    గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్‌ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీలు మన వాళ్లే ఉన్నారు. 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. అప్పుడు మనం రాష్ట్రస్ధాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామస్ధాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలిగాలి. 

జనంతో మమేకం కావాలి:
    మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం కూడా జరగదు.

నాలుగు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత:
    ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతుంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెప్తారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ల చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. 

అలా అందించింది మన ప్రభుత్వమే:
    నిజానికి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏ కార్యకర్త అయినా సగర్వంగా కాలర్‌ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిపెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసే వాళ్లం. నేరుగా బటన్‌ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పధకాలు అందించింది కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. 
    ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్‌ సిక్స్‌లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది. 

అదే మనకు, వారికి తేడా:
    ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం.
నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. వాళ్లూ మన శ్రేయోభిలాషులే. కానీ విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయల్లో అధికారం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ఆ విలువలు, విశ్వసనీయత మనలో కూడా లేనప్పుడు ప్రజలకు ఏ పార్టీ అయినా ఒకటే.. అన్ని పార్టీలూ ఇంతే అన్న భావన వస్తుంది. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది.

ప్రజల్లో ఆలోచన మొదలైంది:
    వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌ వల్ల జరిగిన మంచి ఏమిటి అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్‌ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. వైయ‌స్ జగన్‌ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది. బిర్యానీ లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. 

అబద్ధాలకు రెక్కలు కట్టారు:
    ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా? టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు.
మనం ప్రతి కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు చేశాం. కానీ చంద్రబాబుగారు అబద్ధాలకు రెక్కలు కట్టారు. ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు, ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు, వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు, 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు, అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత అని ప్రతి ఒక్కరికీ ప్రచారం చేశారు. 
    మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం.

వారికి మొహం లేదు:
    మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల ఇళ్లకు పోయి తిరిగే పరిస్థితి లేదు. వాళ్లు ఏదైనా ఇంటికి వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏౖమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్తే కచ్చితంగా ఇవే వినిపిస్తాయి. 
    ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన కూడా దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి.

హామీలన్నీ గాలికి. వ్యవస్థలన్నీ నిర్వీర్యం.:
    మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యాదీవెన, వసతిదీవెన లేదు. ఇంగ్లిష్‌ మీడియం లేదు. సీబీఎస్‌ఈ లేదు. టోఫెల్‌ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. 
    వ్యవసాయ రంగంలో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు ఎమ్మెస్పీ రాని పరిస్థితి.
    ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్‌ ఆర్డర్‌ సిట్యుయేషన్‌ ఘోరంగా ఉంది. మహిళలకు సెక్యూరిటీ సున్నా. దిశ యాప్‌ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్‌ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్ధితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు.
    రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగకేసులకు పరిమితం అయ్యారు. పోలీసులు సైతం డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.

ఇసుక టెండర్లకు రెండే రోజులా?:
    స్కామ్‌లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచన చేస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఫ్రీ ఇసుక అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్‌ రేటు, ట్రిపుల్‌ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు వచ్చి   ప్రజలకు రీజనబుల్‌ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో రేట్లు ఇచ్చేవాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత పగడ్బందీగా అమలు చేశాం.
    కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్‌యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేసేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి.

మద్యం.. ఏం మాట్లాడతాం?:
    మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్‌ రూమ్స్‌ తీసేసి, టైమింగ్స్‌ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్‌ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. 
    కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా  లిక్కర్‌ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు. అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్‌ రూమ్స్‌ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా, వారికి, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.

ఎప్పుడూ చూడని అధ్వాన్న పాలన:
    ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్‌ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండం. కానీ ఇవాళ కళ్లెదుటే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మనం చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తారు. ఇదే సమయంలో మన పార్టీ సన్నద్ధం కావాలి. 

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలి:
    ఇప్పుడున్నది సోషల్‌ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ నుంచి గ్రామస్థాయి లీడర్‌ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5తో, టీడీపీ తప్పుడు సోషల్‌ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 
    అందుకే మనం అంతకన్నా బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్‌ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామస్ధాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో.. గ్రామస్ధాయిలో జరుగుతున్న  అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం. అలాగే నియోజకవర్గ స్ధాయిలో కూడా జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు కూడా  చూపించగలగాలి. 
    రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామస్థాయికి వెళ్లాలి. ఇదంతా సోషల్‌ మీడియా ద్వారా జరగాలి. ఇది చాలా సవాల్‌తో కూడిన కార్యక్రమం. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. ఇది చేయగలిగే వ్యవస్ధ మనకుంది. దీనిపై తగిన ధ్యాస పెట్టాలి. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ను తయారు చేయాలి. 

పనితీరు ఆధారంగా ప్రమోషన్లు:
    జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీమీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్‌ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్‌ ఇచ్చే బాధ్యత నాది.  మీలో ఎక్కువ మంది మనం అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ వైయ‌స్ జగన్‌ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అదే విధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, మానిటరింగ్‌ ఉంటుంది. పర్యవేక్షణ కూడా జరుగుతుంది. 
    రీజినల్‌ జనరల్‌ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్‌ ఇవ్వడం జరుగుతుందని వైయ‌స్‌ జగన్‌ వివరించారు.

Best Web Hosting Provider In India 2024