APSRTC : ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. గెజిటెడ్ హోదా క‌ల్పిస్తూ నోటిఫికేష‌న్ విడుదల

Best Web Hosting Provider In India 2024


ఏపీ ర‌వాణ‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కాంతిలాల్ దండే జీవో ఎంఎస్ నంబ‌ర్ 39 పేరుతో తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీని (ప్రభుత్వ సేవల్లోకి ఉద్యోగులను విలీనం చేయడం) చట్టం-2019లోని నిబంధనలకు అనుగుణంగా.. “ప్రజా రవాణా శాఖ”గా నిర్ణయించిన‌ట్లుగా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 2020 జ‌న‌వ‌రి 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వంలో విలీనం అయ్యార‌ని స్పష్టం చేశారు.

రవాణా శాఖలోని వివిధ కేడర్‌ల ఉద్యోగులను.. ప్రభుత్వంలోని సంబంధిత కేడర్‌లతో సరిపోల్చాల‌ని ప్రభుత్వాన్ని ఉద్యోగులు అభ్యర్థించారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. రివైజ్డ్ పే స్కేల్స్- 2022 అప్పటికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే.. ప్రజా రవాణా శాఖకు సంబంధించి రివైజ్డ్ పే స్కేల్స్-2022ని అమలు చేస్తూ.. 2022 జూన్ 3 తేదీన ఇచ్చిన జీవో ఎంఎస్ నంబ‌ర్ 113, 114 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ క్యాడర్‌ల ఉద్యోగులను.. గెజిటెడ్ స్థాయిలుగా వర్గీకరించడానికి ఆమోదం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో డిపార్ట‌మెంట్‌ను సంప్ర‌దించిన త‌రువాత.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వివిధ కేడర్‌లను.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా లేదా సరిపోల్చడానికి సరైన ప్రతిపాదనలు పంపాలని.. ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌ను ఆదేశించింది.

పే స్కేల్‌లు, అధికార పరిధి, పోస్ట్ స్వభావం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వివిధ కేడర్‌లను సమానంగా చేయడం.. లేదా సరిపోల్చడంపై నిర్ణయం తీసుకునే వరకు.. ప్రభుత్వ రవాణా శాఖ ఉద్యోగులను గెజిటెడ్, నాన్ గెజిటెడ్ గ్రూపులుగా వర్గీకరించడం సాధ్యం కాదని కమిషనర్ స్పష్టం చేశారు. అయితే.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల వివిధ కేడర్‌లను ప్రభుత్వ ఉద్యోగులతో సరిపోల్చడానికి.. వివరణాత్మక సమర్థనను క‌మిష‌న‌ర్ 2023 జూన్ 19న అందించారు. దీంతో ఆ స‌మ‌స్య ప‌రిష్కారం పొందింది.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ కేడర్‌లను ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సరిపోల్చడం అనే సమస్య పరిష్కరించ‌డంతో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జా ర‌వాణ విభాగం (ఏపీపీటీడీ) రాష్ట్ర సేవలలోని వివిధ తరగతులు, కేటగిరీలను 5 గెజిటెడ్ స్థాయిలుగా వర్గీకరించడానికి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ప్ర‌తిపాదనను పరిశీలించి.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంతో సంప్రదించారు.

జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ 2024 జ‌న‌వ‌రి 4న వివిధ వర్గాల ఉద్యోగులకు “గెజిటెడ్” హోదాను కేటాయించే ప్రతిపాదనను అంగీకరించింది. ప్రజా రవాణా శాఖ రాష్ట్ర సేవలను ఐదు గెజిటెడ్ స్థాయిలుగా వ‌ర్గీక‌రించారు. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ మంగ‌ళ‌వారం విడుద‌ల అయింది.

ఎవ‌రెవ‌రికి గెజిటెడ్ హోదా..

1. అసిస్టెంట్ మేనేజ‌ర్లు (ఫైనాన్స్‌, ట్రాఫిక్‌, ప‌ర్స‌న‌ల్‌, స్టాటిస్టిక్స్‌, మెటిరియ‌ల్స్ ప‌ర్చేజ్‌), న‌ర్సింగ్ సూప‌రిటెండెంట్, చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజ‌నీర్స్ (సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్) ఉద్యోగుల‌కు లెవ‌ల్-1 గెజిటెడ్‌ హోదా క‌ల్పించారు.

2. జూనియ‌ర్ స్కేల్ స‌ర్వీస్ ఉద్యోగుల‌కు లెవ‌ల్‌-2 గెజిటెడ్ హోదా క‌ల్పించారు.

3. సీనియ‌ర్ స్కేల్ స‌ర్వీస్ ఉద్యోగులు (డివిజ‌న‌ల్ మేనేజ‌ర్‌, స‌మాన పోస్టుల్లో ఉన్న‌వారికి)కు లెవ‌ల్‌-3 గెజిటెడ్ హోదా క‌ల్పించారు.

4. స్పెష‌ల్ స్కేల్‌ స‌ర్వీస్ ఉద్యోగులు (రీజిన‌ల్‌ మేనేజ‌ర్‌, స‌మాన పోస్టుల్లో ఉన్న‌వారికి)కు లెవ‌ల్‌-4 గెజిటెడ్ హోదా క‌ల్పించారు.

5. సూప‌ర్ స్కేల్ స‌ర్వీస్ ఉద్యోగుల (ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌)కు లెవ‌ల్‌-5 గెజిటెడ్ హోదా క‌ల్పించారు.

దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను ప్ర‌జా ర‌వాణా డిపార్ట్‌మెంట్ క‌మిష‌న‌ర్ తీసుకోవాల‌ని నోటిఫికేష‌న్‌లో స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

ApsrtcGovernment Of Andhra PradeshAndhra Pradesh News

Source / Credits

Best Web Hosting Provider In India 2024