Feticide : ఆడ పిల్లల పట్ల వివక్షత, రహస్యంగా లింగ నిర్థారణ పరీక్షలు!

Best Web Hosting Provider In India 2024


ఆడబిడ్డలకు అమ్మ కడుపులో ఉన్నా.. బయటకొచ్చినా ప్రమాదమే అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆడపిల్లలంటే ఇష్టం లేదని కొందరు.. తప్పుచేసి గర్భం దాల్చి మరికొందరు.. కారణమేదైనా పురిట్లోనే పసికందులను చిదిమేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని చంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వివిధ కారణాలతో వచ్చినవారి అవసరాన్ని కొందరు వైద్యులు, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా.. విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. అందుకు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వాష్ రూమ్ లో మృత ఆడ శిశువు పిండం లభించడం నిదర్శనంగా నిలుస్తుంది.

కడుపులో పడింది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కొందరు తల్లిదండ్రులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ పాప లోకాన్ని చూడకముందే ప్రాణం తీసి, బయటకు విసిరేస్తున్నారు. అడ్డదారి తొక్కిన కొందరు వైద్య సిబ్బంది వల్ల లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ కేంద్రాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సమాజంలో బాలబాలికల నిష్పత్తిలో గణనీయ వ్యత్యాసం కనిపిస్తోంది. తాజాగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో లభ్యమైన 7 నెలల మృత ఆడ శిశువు పిండం లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. ఎక్కడో అబార్షన్ చేసి ఇక్కడి దవాఖానాకు తీసుకువచ్చి పడేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీల ద్వారా కీలక సమాచారం సేకరించారు.

ముగ్గురిపై అనుమానం?

హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలోని వాష్ రూమ్ లో 7 నెలల మృతపిండం లభించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డీసీహెచ్ డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై విచారణ జరిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో చందు, ఆస్పత్రి సూపరింటెండెంట్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను జిల్లా అధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు ఇప్పటికే కీలక సమాచారం సేకరించారు. ఎలక్ట్రిక్ బైక్ పై వచ్చిన ఓ మహిళా, పురుషుడు, మరో మహిళ ఈ ఆడశిశువు పిండాన్ని వాష్ రూమ్ లో పడేసిట్లు అనుమానిస్తున్నారు. హనుమకొండకు చెందిన మహిళలతో పాటు పెద్ద పాపయ్యపల్లికి చెందిన మరో మహిళపై అనుమానం వ్యక్తం చేస్తు వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

రెండో సంతానం వారే 90 శాతం

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం భౌగోళికంగా కరీంనగర్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటోంది. ఇక్కడ వైద్య పరీక్షల్లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ (భ్రూణ హత్య) చేయడం కొంతమంది వైద్య సిబ్బందికి దందాగా మారింది. అబార్షన్ చేయించుకుంటున్న వారిలో రెండో సంతానం ఆడపిల్ల అని తెలుసుకున్న వారే 90శాతం మంది ఉంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి హుజూరాబాద్, జమ్మికుంటలకు వస్తున్నారు. వీరిలో ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉండి, మగ సంతానం కోసం వస్తున్న 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న దంపతులు ఉండటం గమనార్హం. అప్పటికే వీరు వేసక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకున్నా.. తిరిగి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ రెండు ప్రాంతాలు మగపిల్లలను కనేందుకు కేంద్రాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. ఈ దందా చేసేవారికి, చేయించుకునేవారికి కొందరు ఆర్ఎంపీలు వారధిగా ఉంటున్నారు. గత జూన్ లో హుస్నా బాద్ పోలీసులు ఓ ఆర్ఎంపీని, ప్రైవేటు ఆస్పత్రి పీఆర్వోను అరెస్టు చేశారు.

లింగ నిష్పత్తిలో వ్యత్యాసం

అనధికార లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 0-6 ఏళ్ల వయసు గల బాలబాలికల నిష్పత్తి గణనీయంగా పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ 1,000 మంది బాలురకు 936 మంది బాలికలే ఉన్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 932 మందే ఉన్నారు. ముఖ్యంగా రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో 897 మందే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాల్లోనూ బాలబాలికల నిష్పత్తి పడిపోవడానికి జమ్మికుంట, హుజూరాబాద్ లో జరుగుతున్న ఈ అక్రమ దందా కూడా ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ లను అరికట్టేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

టాపిక్

KarimnagarHuzurabad Assembly ConstituencyCrime TelanganaTelangana NewsTrending TelanganaTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024