Raiway Lands Issue: రైల్వే స్థలాలతో నయా రాజకీయం..బెజవాడలో అంతే, రైల్వే అవసరాలకు అందుబాటులో లేని భూమి

Best Web Hosting Provider In India 2024


Raiway Lands Issue: విజయవాడ నగరం నడిబొడ్డున ఖరీదైన రైల్వే స్థలాలు ఏళ్ల తరబడి కబ్జాలకు గురవుతున్నా రైల్వే అధికారులు చోద్యం చూస్తుండటంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రైల్వే విస్తరణ, అభివృద్ధి పనులకు భూమి అవసరమైనా వినియోగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

చెన్నై-న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్‌ మార్గంలో విజయవాడ పర్మనెంట్‌ వే డిపార్ట్‌మెంట్‌ సౌత్ సెక్షన్ పరిధిలో ఉన్న రైల్వే భూములు కొన్నేళ్లుగా ఆక్రమణలకు గురవుతూ వచ్చాయి. మొదట్లో సంచార జాతుల ప్రజలు రైల్వే ట్రాకుల వెంబడి గుడిసెలు వేసుకుని నివాసం ఉండటంతో రైల్వే అధికారులు వారిని చూసి చూడనట్టు వదిలేశారు.

90వ దశకం నుంచి వాటిలో ఆక్రమణలు మొదలయ్యాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్‌ పరిధిలో విజయవాడ- కొండపల్లి సెక్షన్‌ పరిధిలో డౌన్‌లైన్ వెంబడి 90లలో సంచార ప్రజలు గుడిసలు ఉండేవి. మిగిలిన భూములన్నీ ఖాళీగా ఉండేవి. ఆ తర్వాత కాలంలో ప్రజా ప్రతినిధులు రైల్వే స్థలాలను ఫ్లాట్లుగా వేసి విక్రయించడం మొదలైంది.

దీనికి ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. మొదట జెండాలు పాతడం, రైల్వే అధికారులు పట్టించుకోకపోతే వాటిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగేది. గత 25-30ఏళ్లలో దశల వారీగా ఎన్నికైన ప్రతి కార్పొరేటర్ రైల్వే స్థలాలను కబ్జా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయా ప్రాంతాలకు తమ ఏకంగా తమ పేర్లను కూడా పెట్టేశారు.

రైల్వే అవసరాలకు లేని భూమి…

చెన్నై-న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్‌ మార్గంలో కాజీ పేట నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాకులు రద్దీని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు నిత్యం 250కు పైగా ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వస్తుంటాయి. ఉత్తర దక్షిణ భారత దేశాల వెళ్లే ప్రతిరైలు విజయవాడ జంక్షన్‌కు రావాలంటే ఉన్న మూడు లైన్లు సరిపోవడం లేదు. వీటితో పాటు మరో 70కు పైగా గూడ్స్‌ రైళ్లను కూడా విజయవాడ మీదుగా అనుమతించాలి. దాదాపు 325 రైళ్లను 24 గంటల్లో నియంత్రించడం రైల్వే శాఖపై ఒత్తిడిగా ఉంటోంది. ఔటర్లలో రైళ్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. విజయవాడలో 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నా రైళ్ల రాకపోకలు సమయానికి నిర్వహించలేకపోతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో రైళ్లను నియంత్రిస్తున్నా ఒకదాని తర్వాత మరొకటి క్యూ కడుతుండటంతో మరిన్ని రైల్వే ట్రాకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

నగరంలో భూమి కొరత…

విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న భూమి ఆక్రమణలకు గురి కావడంతో రైళ్లను నిలపడం, కొత్త రైల్వే ట్రాకుల్ని నిర్మించడం కష్టంగా మారింది. రైల్వే భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేయడంలో రాజకీయ పార్టీలు కీలకంగా వ్యవహరించాయి. విజయవాడ-కాజీపేట, విజయవాడ -విశాఖపట్నం మార్గాల్లో భారీ ఎత్తున రైల్వే భూములు అన్యాక్రాంతం అయ్యాయి.

వాటిలో శాశ్వత నివాసాలు వెలిశాయి. ఇన్నేళ్లుగా వాటిని అడ్డుకోవడంలో రైల్వే అధికారులు పూర్తిగా మొద్దు నిద్రపోయారు. కొన్ని చోట్ల ప్రార్థనామందిరాలు కూడా ఏర్పాటు చేశారు. అవి రైల్వే స్థలాలని తెలిసినా భవిష్యత్తలో ఆక్రమణలు తొలగించకుండా వ్యూహాత్మకంగా ఇలా నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

రైల్వే విస్తరణ పనులు అడ్డుకుంటున్న రాజకీయం…

రైల్వే అధికారులు చేపట్టన విస్తరణ పనుల్ని రాజకీయ నేతలు అడ్డుకుంటున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్ అభివృద్ధిలో భాగంగా కాజీపేట-విజయవాడ సెక్షన్ పరిధిలో ఆక్రమణల్ని తొలిగిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు. పక్షం రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో రైల్వే స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలంటూ కొత్త ఆందోళన ప్రారంభమైంది.

వీటికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. రైల్వే స్థలాల్లో ఆక్రమణలకు విద్యుత్‌, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు స్థానిక నేతలు గతంలో డబ్బులు వసూలు చేశారు. కార్పొరేషన్‌ డబ్బులతో సదుపాయాలు కల్పించి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము తమ ఖాతాల్లో వేసుకున్నారు. రైల్వే అధికారుల హెచ్చరికలతో ఆందోళనలు మొదలు పెట్టారు. రైల్వే భూముల్లో గతంలో మార్కింగ్ చేసి బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని గుట్టు చప్పుడు కాకుండా తొలగించి ఫ్లాట్లుగా అమ్మేశారు.

తెలిసి కొందరు, తెలియక కొందరు రైల్వే స్థలాల్లో భారీ భవనాలు నిర్మించేశారు. తమకు అవసరం వచ్చినపుడు చూద్దామనుకుని రైల్వే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఇప్పుడు వాటిని తొలగించాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేయడంతో లబోదిబోమంటున్నారు.

Whats_app_banner

టాపిక్

VijayawadaVijayawada FloodsSouth Central RailwayGovernment Of Andhra Pradesh
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024