Best Web Hosting Provider In India 2024
Aamir Khan Kishore Kumar: ఇండియన్ సినిమా చరిత్రలోని అత్యుత్తమ సింగర్లలో ఒకరు కిశోర్ కుమార్. కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ ను ఊపేసిన స్వరం అతనిది. అలాంటి లెజెండరీ సింగర్ పై ఇప్పుడు బయోపిక్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు కూడా పింక్విల్లా రిపోర్టు వెల్లడించింది.
కిశోర్ కుమార్ బయోపిక్‌లో ఆమిర్
ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్మించబోయే కిశోర్ కుమార్ బయోపిక్ కోసం ఆమిర్ ఖాన్, అనురాగ్ బసు చర్చిస్తున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఇప్పటికే నాలుగైదుసార్లు ఈ ఇద్దరూ ఈ బయోపిక్ పై చర్చలు జరిపారట. ఈ ముగ్గురూ కిశోర్ కుమార్ ను ఎంతగానో అభిమానించే వాళ్లు కావడంతో అతని జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు.
“అనురాగ్ బసు, భూషణ్ కుమార్ లకు కిశోర్ కుమార్ బయోపిక్ చేయాలన్న ఆలోచన ఉంది. దానిని సాధ్యమైనంత అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఆమిర్ ఖాన్ కు కూడా కిశోర్ కుమార్ అంటే చాలా ఇష్టం. అతని బయోపిక్ విషయంలో అనురాగ్ బసు విజన్ కూడా అతనికి ఎంతగానో నచ్చింది. దీనిని బసు పూర్తి భిన్నంగా చెప్పడం ఆమిర్ ఖాన్ కు బాగా నచ్చింది” అని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
ఆమిర్ ఖాన్.. సినిమాల క్యూ
ఆమిర్ ఖాన్ నటించిన గత రెండు సినిమాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన విషయం తెలుసు కదా. దీంతో తన తర్వాతి సినిమాల ఎంపికలో అతడు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర ఆరు సినిమాల కథలు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే కిశోర్ కుమార్ బయోపిక్ తోపాటు ఉజ్వల్ నికమ్ బయోపిక్, రాజ్ కుమార్ సంతోషి కామెడీ మూవీల స్క్రిప్ట్ లు రెడీ అయిపోయాయి. ఇక గజిని 2, లోకేష్ కనగరాజ్ తో మూవీ, జోయా అక్తర్ తో మరో మూవీ కూడా లైన్లో ఉన్నాయి. ఈ సినిమాల కథలన్నీ ఆమిర్ కు బాగా నచ్చాయట. అయితే వీటిలో మొదట ఏ సినిమా చేయాలన్నదానిపై అతడు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాడు.
ఎవరీ కిశోర్ కుమార్?
కిశోర్ కుమార్ ఇండియా మెచ్చిన ప్లేబ్యాక్ సింగర్లలో ఒకడు. మ్యూజిక్ కంపోజర్, నటుడు కూడా. హిందీతోపాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీస్, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, మలయాళం, ఒడియా, ఉర్దూల్లోనూ పాడాడు.
1960వ దశకం నుంచి 80ల వరకు బాలీవుడ్ ను ఊపేసిన గొంతు అతనిది. కిశోర్ కుమార్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. లతా మంగేష్కర్ లాంటి లెజెండరీ సింగర్లతో కలిసి ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు.