Photo tips: సెల్ఫీలో, గ్రూప్ ఫొటోల్లో అందంగా కనిపించాలా? ఈ ఫోటో హ్యాక్స్ తెలిస్తే చాలు

Best Web Hosting Provider In India 2024

కొందరు ఏ ఫొటోలో అయినా అందంగా కనిపిస్తారు. అలాంటి వాళ్లకి ఫొటోజెనిక్ ఫేస్ ఉందని అంటుంటాం. కానీ ఫొటో దిగేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఎవరైనా ఫొటోల్లో చక్కగా కనిపించొచ్చు. ఆ చిట్కాలేంటో మీరూ తెల్సుకోండి..

ముందుగా మీరు ఇదివరకు తీసుకున్న ఫొటోలను ఒకసారి గమనించండి. వేటిలో మీరు బాగున్నారు, ఏ యాంగిల్‌లో మీరు బాగా కనిపిస్తున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకు బాగనిపిస్తుంది, ఎలా నవ్వితే మీకు మీరు నచ్చుతున్నారో ఒకసారి చూడండి. దాంతో మీకు పూర్తిగా మీరెలా ఫొటోలు తీయించుకోవాలో తెలుస్తుంది. వాటితో పాటే పర్ఫెక్ట్ ఫొటో కోసం కొన్ని టిప్స్ కూడా తెల్సుకోండి.

మంచి ఫొటో కోసం ఎలా నవ్వాలంటే..

మంచి నవ్వుంటేనే ఫొటో బాగొస్తుంది. దానికోసం కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే సరి..

1. మీ నవ్వు సహజంగా ఉండాలి. బలవంతంగా నవ్వుతున్నట్లు ఉండకూడదు. ఫొటోషూట్ లాంటివి చేస్తున్నప్పుడు సహజమైన నవ్వు రావాలంటే ఫొటో గురించి కాకుండా ఏదైనా మీకు ఆనందాన్నిచ్చే విషయం గురించి ఆలోచించండి. అలాగే ముందుగానే అద్దం ముందు నిలబడి మీ నవ్వును సాధన చేయడం వల్ల మీకూ అవగాహన వస్తుంది. ఫొటోలో ఎలా నవ్వాలో తెలుస్తుంది.

2. నాలుకను పళ్ల వెనకాల ఒత్తిపెట్టి ఉంచితే నవ్వు ఫొటోలో సహజంగా వస్తుంది. పెదాలు ఎక్కువ వెడల్పుగా తెరుచుకోకుండా నవ్వు అందంగా ఉంటుంది.

3. లిప్‌స్టిక్ రంగు ప్రభావం చాలా ఉంటుంది. ముదురు రంగు లిప్‌స్టిక్ పెట్టుకుంటే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. ప్రకాశవంతంగా ఉంటే రంగులైతే మీ నవ్వుకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.

4. కొంతమంది పళ్లు తెరిచే నవ్వితే బాగుంటారు. మరికొందరు దానికి భిన్నం. మీకు అవగాహన లేకపోతే అద్దం ముందు నిలబడి మీరెలా నవ్వితే మీకు నచ్చుతుందో గమనించండి. ఫొటో ముందు అలాగే నవ్వండి.

ఫొటోలకు ఎలాంటి పోజ్ ఇవ్వాలి..

1. కెమెరా వైపుకు ఎదురుగా కాకుండా భుజాలు కాస్త పక్కకు తింపి 45 డిగ్రీల కోణంలో నిలబడాలి. దానివల్ల ఫొటో బాగా రావడమే కాకుండా, సన్నగా కూడా కనిపిస్తారు.

2. ఫొటో దిగేటప్పుడు చేతులు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ముఖ్యంగా ఫొటో షూట్ చేస్తున్నప్పుడు చేతిలో కాఫీ కప్ పట్టుకోవచ్చు, లేదా చేతులతో జుట్టు సరిచేస్తున్నట్లు చేయొచ్చు. ఫంక్షన్లలో ఫొటో దిగేటప్పుడు చేతిలో హ్యాండ్‌బ్యాగ్ పట్టుకోవచ్చు.

3. జుట్టు ఎలాగుందనేదీ ముఖ్యమే. పొడవు జుట్టయితే ఓపెన్ హెయిర్ బాగుంటుందా లేదా జుట్టు వెనక్కి వేస్తే బాగుంటుందా, లేదంటే ఒక వైపు ముందుకు మరో వైపు వెనక్కి వేస్తు బాగుంటుందా అని ఒకసారి చూస్కోండి. దీనివల్ల ఫొటో లుక్ పూర్తిగా మారిపోతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024