Cyclone Dana: ఒడిశా, పశ్చిమబెంగాల్ లను వణికిస్తున్న ‘దాన’ తుపాను; తీరం దాటేది ఈ రాత్రే; ‘దాన’ అంటే ఏమిటి?

Best Web Hosting Provider In India 2024


Cyclone Dana: గురువారం (అక్టోబర్ 24-25) రాత్రి ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం మధ్య దాన తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. గురువారం తుఫానుగా మారిన దాన కారణంగా ఈ నెల 26 వ తేదీ వరకు ఒడిశా, బెంగాల్ లలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుపాను ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సిద్ధమవుతున్న ప్రభుత్వాలు

దాన తుపానును ఎదుర్కోవడానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సన్నద్ధతను సమీక్షించారు. అక్టోబర్ 25 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ఒడిశా అధికారులు ప్రకటించారు. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) ఈ నెల 27న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్ష -2023-24ను వాయిదా వేసింది. పర్యాటకులు, యాత్రికులు, సముద్ర తీర ప్రాంతాలకు, పూరీకి వెళ్లవద్దని, మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లవద్దని సూచించారు. దాన తుఫాను (Cyclone Dana) ఈ రోజు రాత్రి తీరం దాటనుందని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

దాన తుపాను: ‘దాన’ అంటే ఏమిటి?

దాన (dana meaning) అనేది అరబిక్ పదం, దీని అర్థం ‘ఉదారత (generosity)’. అరబిక్ సంస్కృతిలో ‘దాన’ లేదా ‘దానహ్’ అనే పేరు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఇది ‘అత్యంత పరిపూర్ణ పరిమాణం, విలువైన మరియు అందమైన ముత్యం’ను సూచిస్తుంది. ముత్యాల డైవింగ్ యొక్క గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందిన పర్షియన్ గల్ఫ్ లోని అరబ్ దేశాలలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. కాగా, ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం, దాన పేరును ఖతార్ ప్రభుత్వం సూచించింది. ఉష్ణమండల తుఫానులకు పేర్లను కేటాయించడం వల్ల నిర్దిష్ట తుఫానులను ట్రాక్ చేయడం సులభం అవుతుందని, ముఖ్యంగా బహుళ తుపానులు ఏకకాలంలో చురుకుగా ఉన్నప్పుడు వాటి నిర్వహణలో గందరగోళం నెలకొనదని డబ్ల్యుఎంఓ తెలిపింది.

దానా తుపాను సహాయక చర్యలు

ఒడిశాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి కనీసం 1.1 మిలియన్ల మందిని లోతట్టు ప్రాంతాలకు తరలించనున్నట్లు మంత్రులు గురువారం తెలిపారు. 14 జిల్లాల్లోని 3,000 గ్రామాల నుంచి సహాయక శిబిరాలకు తరలించేందుకు ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, బెంగాల్ లో 1,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కు చెందిన రెస్క్యూ అండ్ రిలీఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి.

దాన తుపాను: రద్దయిన రైళ్ల జాబితా

దాన తుపాను కారణంగా భారతీయ రైల్వే 300కు పైగా రైళ్లను రద్దు చేసింది. హౌరా-సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, కామాఖ్య-యశ్వంత్ పూర్ ఏపీ ఎక్స్ప్రెస్, హౌరా-పూరీ శతాబ్ది ఎక్స్ప్రెస్, హౌరా-భువనేశ్వర్ శతాబ్ది ఎక్స్ప్రెస్, హౌరా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link