Green Dosa: కొత్తిమీరతో టేస్టీ గ్రీన్ దోశ ట్రై చేయండి, ఎంతో రుచి పైగా ఆరోగ్యం కూడా

Best Web Hosting Provider In India 2024

దోశలు అంటే ఎంతో మందికి ప్రాణం. అలాగని ఒకే రకమైన దోశలను తినడం కూడా కష్టమే. ఇక్కడ మేము కొత్తిమీర గ్రీన్ దోశ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో ఈ కొత్తిమీర గ్రీన్ దోశ తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని చూడండి, మీ అందరికీ నచ్చడం ఖాయం. ఈ కొత్తిమీర గ్రీన్ దోశ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. చాలా సులువుగా చేసేయొచ్చు.

కొత్తిమీర గ్రీన్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం – ఒక కప్పు

కొత్తిమీర తరుగు – ఒక కప్పు

మినప్పప్పు – ఒక కప్పు

మెంతులు – ఒక స్పూను

కరివేపాకులు – గుప్పెడు

పుదీనా – గుప్పెడు

వాము – చిటికెడు

ఉల్లిపాయ – ఒకటి

పచ్చిమిర్చి తరుగు – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – తగినంత

జీలకర్ర – అర స్పూను

కొత్తిమీర గ్రీన్ దోశ రెసిపీ

1. బియ్యం, మినప్పప్పు, మెంతులను శుభ్రంగా కడిగి ముందుగానే నానబెట్టుకోవాలి.

2. ఇవి కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానితే మెత్తగా పిండిలా రుబ్బుకోవచ్చు.

3. ఇవన్నీ నానాక గ్రైండర్లో వేసి రుబ్బుకోండి. అందులోనే కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పుదీనా తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి రుబ్బెయ్యాలి.

4. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

5. ఇప్పుడు ఆ రుబ్బును తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. ఆ గిన్నెలో దోశలు వేయడానికి ఎంత మందంలో కావాలో అంత మందానికి వచ్చేవరకు నీటిని కలుపుకోవాలి.

7. అలాగే జీలకర్ర, వాము కూడా వేసుకోవాలి.

8. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ పిండిని దోశలా పోసుకోవాలి.

9. పైన ఉల్లిపాయల తరుగును చల్లుకోవాలి.

10. అంతే టేస్టీ గ్రీన్ దోశ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

11. పక్కన కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీ పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం. పైగా ఇందులో మనం వాడినవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే.

కొత్తిమీర ఉపయోగాలు

కొత్తిమీర, పుదీనా, మినప్పప్పు, కరివేపాకులు, మెంతులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అలాగే శక్తిని కూడా అందిస్తాయి. ఇక బియ్య లో కార్బోహైడ్రేట్స్ మనకి నిరంతరం శక్తి అందేలా చేస్తాయి. ఇతర దోశలతో పోలిస్తే ఈ కొత్తిమీర గ్రీన్ దోశ చాలా హెల్తీ అని చెప్పవచ్చు. కొత్తిమీరలో ఉండే పోషకాలతో పాటు పుదీనాలో ఉండే ఫ్లేవర్ కూడా రుచిని పెంచేస్తుంది. కొత్తిమీర తినడం వల్ల మనకి పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటివి రావు. అలాగే నోటి దుర్వాసన, అల్సర్లు వంటివి కూడా తగ్గిపోతాయి. చిగుళ్ల నొప్పులు, దంతాలు నొప్పుల నుంచి బయట పడేసే శక్తి కూడా కొత్తిమీరకు ఉంటుంది. కిడ్నీలకు కూడా కొత్తిమీర ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. కాబట్టి కొత్తిమీర ఉన్న ఆహారాలను తినడం వల్ల కిడ్నీలు పరిశుభ్రంగా మారుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కొత్తిమీర ఆకులు, ధనియాలలో… విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది మీకు రక్తం గడ్డ కట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి వీలైనప్పుడల్లా కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024