Best Web Hosting Provider In India 2024
Lucky Baskhar: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు డైరెక్టర్లు, నిర్మాతలకు లక్కీ మస్కట్ గా మారిపోయాడు. అతడు నటించిన ప్రతి తెలుగు సినిమా హిట్ అవడమే దీనికి కారణం. లక్కీ భాస్కర్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. తన నటనతో ఆకట్టుకున్నాడు. గతంలో దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామంలాంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
దుల్కర్ ఉంటే బొమ్మ హిట్
దుల్కర్ సల్మాన్ ఓ మలయాళ హీరో. అక్కడి మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తన హ్యాండ్సమ్ లుక్స్, తండ్రికి తగిన తనయుడిగా నటనతో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు దుల్కర్ అంటే టాలీవుడ్ హీరోతో సమానమైన క్రేజ్ తెలుగు యువతలో ఉంది.
తాజాగా గురువారం (అక్టోబర్ 31) దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. ఇందులో ఓ మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి పాత్రలో అతడు జీవించేశాడు. దుల్కర్ నటన, వెంకీ అట్లూరి డైరెక్షన్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ ఖాయమన్న అంచనా తొలి రోజే వచ్చేసింది.
టాలీవుడ్లో దుల్కర్ జర్నీ
టాలీవుడ్ లో దుల్కర్ సాధించిన నాలుగో విజయం ఇది. మొదట నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మహానటితో దుల్కర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో జెమినీ గణేషన్ పాత్ర పోషించాడు. ఈ మహానటి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.
ఇక ఆ తర్వాత సీతారామంతో అతడు మరో హిట్ కొట్టాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ తో కలిసి మ్యాజిక్ చేశాడు. ఓ లవర్ బాయ్ గా ఇక్కడి యువత మనసు గెలుచుకున్నాడు. ఇక ఈ మధ్యే వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీలో అతిథి పాత్ర పోషించాడు. ఆ మూవీ ఎంతటి హిట్ అయిందో మనకు తెలుసు. ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ మరోసారి దుల్కర్ లక్కీ మస్కట్ అని నిరూపించింది.
కల్కిని కూడా కలుపుకుంటే దుల్కర్ కు ఇది తెలుగులో వరుసగా నాలుగో హిట్ అని చెప్పొచ్చు. పూర్తి స్థాయి లీడ్ రోల్ చూస్తే మాత్రం హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. తెలుగులో త్వరలోనే దుల్కర్ మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పేరు ఆకాశంలో ఒక తార. టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.